నేటి పునీతులు :పునీత అలెక్సియ

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

17 Jul 2026

ఇటలీదేశం రోమునగరంలో యూఫేమియన్, అగ్లేయమ్మ దంపతులున్నారు. భర్త సెనెటరు అనగా ప్రజాప్రతినిధి. ధనవంతులైన కుటుంబం. 5వ శతాబ్దంలో వారికి కలిగిన పుత్రసంతానమే అలెక్సియస్. ఈ బాలునే 'దేవుని మనిషి' అని ఒక చరిత్రకారుడు వ్రాశాడు. తల్లిదండ్రులు లేదనకుండ పేదలకు దానధర్మాలు నిర్వహించేవారు. అదే పవిత్రదాన గుణంతో అలెక్సియ క్రీస్తు ప్రేమలో పెరిగారు. పేదలకు ఎంతదానంచేస్తే అంత సంపద తిరిగి మనకు వస్తుంది అని, మనం ఇచ్చిన దంతా మనతోనే ఉంటుందని అలెక్సియ భావిస్తారు. పరలోకంలో మనకు ఆస్థిని కూడబెట్టేదే దాతృత్వం అని వారినమ్మకం.

నిరాశలో, తిండి లభింపక బక్కచిక్కిన బాధాసర్పద్రష్టులకు ఏకైక దిక్కు అలెక్సియగా పేరుబడ్డారు. దేవుడిచ్చింది దేవుని ప్రజలకే దానం చేయాలని వారి కోరిక. "ఆస్థి ఉన్నచోటే నీ హృదయముండున"ని క్రీస్తు చెప్పారు. అందువల్ల ఆస్టి తనకు వద్దని వారు విశ్వసించారు. అందుకే మంచి కార్యాలకు, దానధర్మాలకే ఆస్టివినియోగించారు. అలాగే ఈ లోకం ఆశలకు దూరంగా ఉండాలనుకున్నారు.

కాని అలెక్సియగారికి యుక్తవయస్సురాగా తల్లిదండ్రులు పెండ్లి చేయ నిశ్చయించారు. పెండ్లినాటి రాత్రి అలెక్సియగార్కి కలిగిన దివ్యప్రేరణవల్ల రోమాపురి విడిచి పెట్టి పారిపోయారు. సిరియాదేశం చేరుకొని అక్కడ ఎడెస్సా పట్టణంలోని మేరీమాత దేవాలయంలో తలదాచుకున్నారు. వీరిపట్ల వింతగా చూస్తున్న ప్రజలకు దేవాలయంలోని మరియమాత విగ్రహం నోరు తెరచి ఇతడు "దేవుని మనిషి", ఆదరించమన్నట్లు పలికింది. అక్కడ 17 సం||లు ప్రార్ధన ప్రభు సేవలో అడుక్కుతినుకుంటూ జీవించారు.

అటు పిమ్మట అలెక్సియగారు రోమునగరం తిరిగివచ్చారు. జీర్ణవస్త్రాలు పెరిగినజుట్టు మాసినగడ్డం ఎవరూ గుర్తుపట్టలేదు. రోము దేవళంలో ప్రార్థనలు చేస్తూ పరిశుద్ధ జీవితంలో పునీతమైయుండగా గుర్తుపట్టని తండ్రే దిక్కులేకుండా ఉన్న అలెక్సియగారికి తమ వద్ద చిన్న ఉద్యోగమిచ్చి తమ ఇంట్లోనే మెట్ల క్రింద ఉన్న ఖాళీ జాగాలో ఉండమని అడుక్కుతినడం మానమని తీసుకుపోయారు. అలెక్సియగారు తనను గురించి కుటుంబసభ్యులకు పరిచయంచేసుకోలేదు. అలా తెలియని వ్యక్తికి సాయపడుతున్నట్లే వారు సాయపడ్డారుకాని కుటుంబవ్యక్తిని గుర్తుపట్టలేదు. ఇలా 17 సం|| లు దొర్లిపోయాయి. ఓపికతో, ప్రేమతో తన ఉద్యోగం నిర్వర్తించి పెట్టింది మాత్రమే తింటూ ఆదర్శ సేకుడుగా పేరు తెచ్చుకున్నారు. తోడి ఉద్యోగులు ఆటపట్టించినా, అవమానించినా భరించారు.

వృద్ధాప్యంలో అలెక్సియగారు చనిపోయినప్పుడు, వారి సంచిలో ఉన్న వారి చేతివ్రాతలు గుర్తులు చూసి వారు అలెక్సియగారు, కుటుంబకుమారుడని వారసుడని గ్రహించి మరింత దుఃఖించారు. కాని వారి పరిశుద్ధ జీవితానికి, క్రైస్తవ ఆదర్శ బ్రతుకును ఎల్లరూ కీర్తింపక ఉండలేకపోయారు. దేవుడు వారిని తమ సాక్షిగా ఎన్నుకున్నారు. 5వ శతాబ్ద ప్రారంభంలో ప్రభువు అలెక్సియగార్ని పిల్చుకున్నారు. వారి మధ్యవర్తిత్వాన ప్రార్థించిన వారికి ఆశ్చర్యకరమైన అద్భుతాలు, వ్యాధినివారణలు జరిగినట్లు చెప్పబడింది.
అలెక్సిసు అంటే ఆదుకొనువాడు అని అర్థం .

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN