భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని భారత పీఠాధిపతుల విజ్ఞప్తి

జోసెఫ్ అవినాష్
14 Jul 2026
అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య దేశంలో న్యాయం,శాంతి,మత స్వేచ్ఛ,సామాజిక సామరస్యం పరిరక్షించాలని కోరుతూ సమాఖ్య అధ్యక్షులు హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు మహా ఘన కార్డినల్ పూల అంతోని గారి అధ్యక్షతన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.ఇటీవల తీసుకొస్తున్న కొన్ని చట్టపరమైన, పరిపాలనా నిర్ణయాలు భారత రాజ్యాంగం కల్పించిన లౌకిక విలువలకు,అన్ని మతాల ప్రజలకు సమాన హక్కులు కల్పించే స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పీఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేశారు.విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని పీఠాధిపతులు ప్రభుత్వాన్ని కోరారు.ఈ సవరణలు అమల్లోకి వస్తే పేదలు,అణగారిన వర్గాల కోసం విద్య,వైద్యం,సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనేక క్రైస్తవ సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వారు హెచ్చరించారు.అలాగే షెడ్యూల్డ్ కులాలకు చెందిన క్రైస్తవులు,ముస్లింలకు ఎస్సీ హోదా నిరాకరించడం ఒక తీవ్రమైన అన్యాయమని వారు పేర్కొన్నారు.మతమార్పిడి నిరోధక చట్టాల పేరుతో క్రైస్తవులపై బెదిరింపులు,వేధింపులు,దాడులు పెరుగుతున్నాయని,మణిపూర్‌లో కొనసాగుతున్న మానవతా సంక్షోభానికి త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని కూడా పీఠాధిపతులు విజ్ఞప్తి చేశారు.భారతదేశంలో న్యాయం, శాంతి,మత స్వేచ్ఛ,రాజ్యాంగ విలువలు పరిరక్షించబడినప్పుడే దేశం మరింత బలపడుతుందని వారు తమ వినతిపత్రంలో స్పష్టం చేశారు.
