ఆలయ ప్రవేశములో స్త్రీలు “తల ముసుగు” ధరించాలని పౌలు ఎందుకు కోరాడు?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

14 Jul 2026

ప్రశ్న -:
ఆలయ ప్రవేశములో స్త్రీలు “తల ముసుగు” ధరించాలని పౌలు ఎందుకు కోరాడు? భర్త, భార్యకు యజమాని అని నిశ్చయించడంలో కారణమేమైనా ఉన్నదా?

సమాధానం -:
ఆలయ ప్రవేశంలో స్త్రీలు ముసుగు ధరించాలని పౌలు కోరడం కేవలం తలను కప్పుకోవడం మాత్రమేకాదు. తలముసుగు అందులో ఒక భాగం మాత్రమే (1 కొరింతీ 11:1-16). ఆ కాలములో కొరింతు సంఘంలో 'ఐసిస్' అనే దేవత ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ దేవత అన్ని దేవతలకు తల్లివంటిదని భావించేవారు. ఈమె, ప్రేమకు, మాతృత్వానికి పోషకురాలిగా ప్రసిద్ధిచెందింది. ఈమెకున్న పొడుగు శిరోజాలతో, స్త్రీలను అమితంగా ఆకట్టుకోసాగింది. ఈ 'ఐసిస్ ఆరాధనా' విధానంలో లైంగిక భావోద్వేగాలతో, ఆ దేవత విగ్రహంచుట్టూ వికృత నృత్యాలూ చేసేవారు. ఈసందర్భంలో స్త్రీలు తమ తల వెంట్రుకలను వదలి వేసి ఒళ్ళు మరచి చిందులు వేసేవారు. చాలా మంది క్రైస్తవ సంఘంలోని స్త్రీలు, ఈ దేవత మాయలో పడిపోయేవారు. కొందరు శిరోజాలను క్రమపరచుకోకుండా, పొడవుగా వదలివేస్తూ, చూపరుల దృష్టిని ఆకర్షించేవారు. ఈ వైనం ప్రార్థనా మందిరాలలో కూడా ప్రాకిపోయింది. ఇది క్రైస్తవ విశ్వాసానికి అవరోధంగా భావించాడు పౌలుడు. క్రైస్తవ సంఘం, స్థానం తప్పుతోందని ఆందోళన చెందాడు. తాను ప్రేమించిన క్రైస్తవ సంఘాన్ని పరదేవతా ఆకర్షణ నుండి కాపాడడానికి, క్రీస్తు మీద నమ్మకంలో సంఘటితం చేయడానికి, స్త్రీలను అప్రమత్తం చేశాడు. ముసుగు ధరించమని ఆయన చేసిన ఉపదేశం, పరదేవతా ఆకర్షణకు లోనుకావద్దని చెప్పిన హితవు. ‘ఐసిస్' దేవతారాధన క్రైస్తవ సంఘంలో వ్యాపిస్తుందేమోనన్న పౌలుని ఆందోళన సమర్థనీయమే. ప్రలోభాలకు సులభంగా పడిపోయి, ఆత్మను పోగొట్టుకోవద్దన్న హెచ్చరిక, సమంజసమే కదా!

ప్రార్ధనాసమావేశాలలో స్త్రీలు ముసుగుధరించాలన్న నియమానికి, పౌలుడు ఇంకో కారణం చూపించాడు. ఆ ప్రార్థనా సమావేశంలోనున్న తన భర్తకి,
భార్య ముసుగు ధరించడం ద్వారా గౌరవం చూపుతోంది. యూదయా సాంప్రదాయంలో, కుటుంబానికి అధినేత భర్త. తానొక అన్యదేవతారాధనకు
లోనై, భర్తను ఇబ్బందికర పరిస్థితులలోకి నెట్టవద్దని పౌలు హెచ్చరిస్తున్నాడు.సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రకారం, భర్తకు, క్రీస్తుకు, దేవునికి మర్యాద, గౌరవం చెల్లించాలని స్త్రీలకు హితబోధ చేశాడు..

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN