అబద్దాలు మానవద్దా?

ఫాదర్ పి .జోజయ్య s.j

12 Jul 2026

నరులు సులువుగా అబద్ధాలు ఆడతారు. అబద్ధం సత్యానికి వ్యతిరేకమైంది. మన మాటలను జాగ్రత్తగా గమనించాలి నోటిని అదుపులో వుoచుకోవాలి.

అబద్ధమంటే మనసులో ఓకటి వు0చుకొని వేరొకటి చెప్పడం, సత్యాన్ని దాచడం .సత్యం భగవంతుడే కనుక అబద్ధం చెప్పేవాడు భగవంతునికి, తోటి నరునికి కూడా ద్రోహం చేస్తాడు. మన సంభాషణ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తాం. అబద్ధాలు చెప్పడం ద్వారా సమాచారాన్ని తప్పుగా తెలియజేసి ఇతరులను మోసగిస్తాం అది పాపకార్యం.

బైబిల్ గ్రంధం అబద్ధాన్ని నిషేధిస్తుంది. దేవా! నేను ఎంత మాత్రం అబద్ధాలు ఆడకుండేలా చెయ్. సామెతలు 30, 8 తీర్పు దినాన మనం పలికే వ్యర్థమైన మాటను దేవునికి లెక్క నొప్పచెప్పాలి మత్తయి 12, 36 .అబద్ధాలు పిశాచానికి చెల్లుతాయి. దెయ్యం అసత్యవాది. అసత్యానికి తండ్రి .యోహాను 8: 44 జనం ఎక్కువగా వాగి అసత్యంలో పడిపోతారు. తక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా పని చేయాలి. కనుకనే ప్రభువు మీరు అవును గాదు అనే మాటలతో సరిపెట్టుకోండి. అంతకు మించిన పలుకులు పిశాచo నుండే వస్తాయని ఆదేశించాడు. మత్తయి 5, 37 అననీయ, సఫీరా అబద్ధం చెప్పి ప్రాణం కోల్పోయారు అపోస్తుల కార్యాలు 5, 5. అసత్య వాదులు గంధకంతో నిండిన అగ్నిగుండంతో పడిపోతారు. దర్శ 21, 8. అబద్ధాలు ఆడేవారు నాశనమైపోతారు సలోమోను. జ్ఞాన 1, 11

కొందరు నవ్వటానికి అబద్ధాలు చెప్తారు. ఇవి అబద్ధాలు కాదు బుద్ధిపూర్వకమైన అసత్యాలు మాత్రమే పాపాలు.

కొంతమంది మాటిమాటికి తేలిగ్గా అబద్ధాలు చెప్తారు. వీళ్లకు సత్యానికి, అసత్యానికి ఉన్న భేదం కూడా తెలియదు. అలాంటి వాళ్లకు సమాజంలో విలువ వుoడదు. మన పురాణాలు హరిశ్చంద్రుడనే రాజును సత్య సంబందికునిగా వర్ణిస్తాయి. అతడు ఎన్ని కష్టాలు ఎదురైనా బొంకాడ లేదని

మనం కొన్ని కార్యాలు అబద్ధాలు అనుకొo గానీ అవి నిజంగా అబద్ధాలే .కొందరు నేను ఇది చేశాను, అది చేశాను అని డబ్బాలు కొడతారు. నిజంగా వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళ డప్పు వాళ్ళు వాయించుకుంటారు అవి అబద్ధాలే అవుతాయి. మరికొందరు వ్యంగంగా మాట్లాడతారు. తాము ఉద్దేశించింది తాము చెప్పేదానికి కేవలం వ్యతిరేకంగా ఉంటుంది ఇవి అబద్ధాలే. ఇంకా కొందరు డబ్బాలు పలుకుతారు తాము ఉన్న దాని కంటే గొప్పగా చలామణి అవుతామని తాపత్రయపడతారు మాటలు కోటలు దాటుతాయి గాని చేతలు గడప దాటవు. ఇవి కూడా అబద్ధాలే. కొంతమంది నీతిమంతులు లాగా భక్తిమంతుల్లాగా నటన చేస్తారు. ఆ గుణాలు మాత్రం వారిలో ఏ మాత్రం కనిపించవు .ఇవి అబద్ధాలే

ఒక రకం జనం దుష్క్రియలు చేస్తుంటే అందరూ చేస్తున్నారు లే నేను మాత్రం ఎందుకు చేయకూడదని తమ్ము తాము సమర్ధించుకుంటారు. నేను అపరాధిని కాను లే అని తమకు తాము చెప్పుకొని సంతృప్తి చెందుతారు. ఇది ఇంకో అబద్ధం. అబద్దాలు చాలా రకాలుగా ఉంటాయి .ఇవన్నీ అబద్ధాలను మాటల ద్వారా గాని క్రియల ద్వారా గాని చూపించమన్నమాట.

ఇంకో ముఖ్య విషయం ఇతరుల మంచి పేరు వారి ఆస్తి లాంటిది. అందరికీ గౌరవంగా బ్రతికే హక్కు ఉంది .మనం ఆ హక్కును చెడగొట్టకూడదు. అనవసరంగా ఇతరుల లోపాలను వెల్లడి చేస్తే వారి గౌరవాన్ని చెరుస్తాం. అన్యు ల లోపాన్ని పేర్కొంటే మనలో పని వెల్లడి చేస్తాం ఇతరుల మీద లేనిపోని నిందలు మోపిన కూడా వారి గౌరవాన్ని కాలరాసినట్లే. మరో విషయం సులువుగా ఇతరుల చర్యలను మాటలను శంకించకూడదు. వారే ఉద్దేశం ప్రవర్తన మంచిదే అనుకోవాలి. అసలు ఇతరుల నిజాయితీని గూర్చి మన మనసులో చెడుగా తీర్పు తీర్చకూడదు. ఎవరి హృదయంలో ఏమి ఉద్దేశాలు ఉన్నాయో మనకి తెలియదు కదా! ఇతరుల మంచి పేరు చెడగొడితే నష్టపరిహారం చేయాలి. అనగా మన వలనవాళ్ళు కోల్పోయిన గౌరవాన్ని వాళ్ళు తిరిగి పొందేలా చేయాలి .

మన మాటలకు మనం ఊహించని శక్తి ఉంటుంది. మరణము , జీవము కూడా నాలుక ఆధీనంలో ఉంటాయి. సామెతలు 18 ,21 .కనుక మాటలను జాగ్రత్తగా వాడాలి. కొందరి మాటల్లో అసత్యం తేలికగా దొర్లుతుంటాయి. సత్యం భగవంతుడు. అసత్యం పిశాచి. కనుక సత్యప్రీతి ఉండాలి లేనిది ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లుగాను నటన చేయకూడదు . మన పలుకుల్లోనూ చేతల్లోనూ నిజాయితీ ఉండాలి. గాంధీ ,మండేలా మొదలైన మహా నాయకులు సత్య ప్రీతితో జీవించారు. నేటి రాజకీయ నాయకుల్లో సత్యశుద్ధి లేని వాళ్ళు ఎంతమంది? ఆవు చేలో వేస్తుంటే దూడగట్టున మేస్తుందా? అబద్దాలకు అలవాటు పడిన వాళ్ళు వాటిని తేలిగ్గా తీసుకునేవాళ్ళు ఆత్మ శోధన చేసుకొని తమ దుర్భాగ్యాన్ని చక్కదిద్దుకోవాలి ఫలానా వ్యక్తి నిప్పులాంటి మనిషి అతని మాటలను నమ్మవచ్చు అనిపించుకోవాలి .తన మాటల్లో తప్పు చేయనివాడు నిక్కమైన భక్తుడు. ప్రజల మాటల్లోనూ, క్రియల్లోనూ అబద్ధాలు మానితే లోకం బాగుపడుతుంది.అందరూ కలిసి జీవించడానికి ఇప్పటికంటే యోగ్యమైన జగత్తుగా మారుతుంది. మన జీవితం అబద్దాల పుట్ట కాకూడదు. సత్యమార్గంలో పయనించదగినదై ఉండాలి. అసలు మనమే పెద్ద అబద్ధం కాకూడదు .

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN