నేటి పునీతుడు:పునీత 2వ హెన్రి

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
12 Jul 2026
పునీత 2వ హెన్రిగారు క్రీ||శ|| 973లో జర్మనీ బవేరియ రాజ్యంలో హిల్టెషీమ్ పట్టణంలో రాజ కుటుంబంలో పుట్టారు. తండ్రి పేరు కూడ హెన్రి ప్రభువు కాగా తల్లి పేరు జైసెల్లా. బర్గండీ రాజవంశీకురాలు. కుమారుని క్రమశిక్షణలో దైవభక్తిలో పెంచారు. వారి విద్యాభ్యాసం నిమిత్తం రతిస్బాన్ పట్టణ పీఠాధిపతి పునీత ఉతా గ్యాంగ్ గారి వద్ద ఉంచారు. మంచి విద్యతో పాటు హెన్రిగారు తానొక మంచి గురువు కావాలనే ఆకాంక్షతో ఎదిగారు.
కాని రాజకీయ పరిస్థితిలో కలిగిన మార్పులవల్ల హెన్రిగారు క్రీ||శ|| 955లో బవేరియా యువరాజుగా ప్రకటింపబడ్డారు. అయితే వీరి పెద్దనాన్న 3వ ఒట్టో రోమాపురి చక్రవర్తిగా ఉన్నారు. బవేరియా, జర్మనీకూడ వారి అధీనంలోనే ఉంది. ఒట్టా చక్రవర్తి క్రీ||శ|| 1002లో చనిపోగా హెన్రిగారే చక్రవర్తి అయ్యారు. హెన్రిగారు చక్రవర్తి అయినా క్రైస్తవ భక్తి విశ్వాసాల్లో ఏమాత్రం తేడా లేదు. క్రీ||శ|| 1014లో విశాలరోమునగర సామ్రాజ్యాధినేతగా 8వ బెనడిక్టు జగద్గురువుల హస్తాలు మీదుగా రంగరంగ వైభవంగా ఆశీర్వదింపబడి కిరీటధారణ చేయించుకున్నారు.
రాజ్య పరిపాలనలో అసాధారణ రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. నీతియుతంగా పాలించారు. శ్రీసభపట్ల తన బాధ్యతలను నెరవేర్చారు. శ్రీసభసంస్కరణలకు మద్దతునిచ్చారు. జర్మనీలో రాజ్యపాలనను చక్కబరచారు. ఇటలీని ఆక్రమించడానికి దండెత్తి వచ్చిన 'ఐవ్రేయ అర్ద్విన్' ను చిత్తు చిత్తుగా ఓడించి తానే ఇటలీరాజుగా వ్యవహరించారు. అలాగే బోహేమియా రాజ్యంను జయింప వచ్చిన పోలెండు క్రూరరాజు 1వ బొలెస్లాస్ రాజును ఓడించి తరిమికొట్టారు.
పునీత హెన్రీ చక్రవర్తి భార్య పునీత కునెగుండిసమ్మ క్రీ||శ|| 998లో వివాహమైంది. వారికి సంతానం కలుగలేదు. కాని దైవచిత్తానికే విధేయులై ఆ దంపతులు పుణ్యజీవితం జీవించారు. క్రీ||శ|| 1006లో బ్యాయంబెర్గ్ పీఠాన్ని ఏర్పరచిన వారు పునీత హెన్రిగారే. అక్కడ నిర్మంపబడిన పెద్ద కేథడ్రల్ దేవాలయాన్ని 8వ బెనెడిక్టు పోపుగారే క్రీ||శ|| 1020లో అధికార లాంఛనాలతో ఆశీర్వదించారు. ఈ పట్టణంలోనే ఒక పెద్ద మఠాశ్రమాన్నికూడ ఈ చక్రవర్తె కట్టించారు.
పునీత హెన్రిగారు అపూలియలోని గ్రీకుల పెత్తనం తొలగింప దండెత్తి వెళ్లినట్లుగా చెప్పబడింది. ఆ సమయంలో తీవ్ర జబ్బుకు గురికాగా మోంటె కాస్సినోలో ఉన్న పునీత బెనడిక్టుగారి ప్రార్థనాసాయంవల్ల అద్భుతంగా స్వస్థత పొందారనికూడ చెప్పబడింది. హెన్రిగారి హయాములో అర్హులు యోగ్యులైన పీఠాధిపతులనే నియమింపబడేలా చూశారు. శ్రీసభ చట్టాన్ని గౌరవింపబడేలా పాలించారు. క్లుని మఠాలయాన్ని అభివృద్ధి పరచారు. ఈ మఠంలో ప్రసిద్ధులైన గురువులు పునీత ఓడిలో, పునీత వన్నెనగరకు చెందిన రిచర్డ్ గారు హెన్రిచక్రవర్తిగారికి మంచి మిత్రులు, వీరు జర్మనీలోని గొట్టింజన్ పట్నంలో క్రీ||శ|| 1024 జూలై 15న పరమపదించారు. బ్యాంబెర్గ్ కేథడ్రల్ దేవాలయంలో సమాధి చేయబడ్డారు. క్రీ|| శ|| 1146లో 3వ యూజీను పోపుగారిచే పునీత పట్టా ఒసంగబడింది. హెన్రీ అంటే గృహపాలకుడు.
