కతోలిక గురువులు, కన్యా స్త్రీలు ఎందుకు వివాహాలు చేసుకోరు.

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

10 Jul 2026

ప్రశ్న -:
యేసుక్రీస్తు బ్రహ్మచర్య వ్రతాన్ని ప్రతిపాదించారా? కథోలిక గురువులు, కన్యాస్త్రీలు ఎందుకు వివాహం చేసుకోరు? ఈ ఆచారం ఎప్పటినుండి. ప్రారంభమయినది?

సమాధానము -:
కతోలిక శ్రీసభలో ఈ ఆచారం ఎన్నో మంచి కారణాలతో ముడిపడి ఉన్నది.దీనిని దైవసంస్కారంగా కతోలికులు భావిస్తారు. స్వయానా యేసుక్రీస్తు వివాహం చేసుకోలేదు.దైవరాజ్యం కోసం కొందరు తమ జీవితాలను అర్పించుకొనటాన్ని యేసు సమర్ధించి కొనియాడారు.ఈ వాక్యలు చదవండి: "దైవానుగ్రహం కలవారికేగాని మరెవ్వరికీ అది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు.మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు.పరలోక రాజ్యనిమిత్తమై తమకు తాము నపుంసకులుగా అయినవారు కొందరున్నారు. గ్రహించగలిగినవాడు. "గ్రహించునుగాక!" (మత్తయి 19:12) ఈ క్రింది అంశాలు బ్రహ్మచర్మానికి అనుకూలంగా చెప్పబడినాయి:

గురువులు,కన్యాస్త్రీలు క్రీస్తు అనుచరులు.వారు ఆయన మార్గంలో పయనించడానికి ఇష్టపడతారు.పౌలు విషయంలో దైవసేవ కోసం అతడు ఒంటరిగా ఉన్నట్లు పలుమార్లు వెల్లడిచేస్తాడు.ఈ వాక్యాలు గమనించండి: "ఇక మీరు వ్రాసిన విషయములను గూర్చి; స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.. అవివాహితులకు, విధవలకును నేను చెప్పునదేమన, వారు నా వలెనే ఒంటరిగా జీవించుట ఉత్తమము" (1 కొరింతీ 7:1-8) పౌలుకున్న ఇటువంటి అభిప్రాయాలు ఈ వచనాలలో కూడా చూడవచ్చు (1 కొరింతీ 7:25-26; 32-38.)

దర్శన గ్రంథలలో యోహాను బ్రహ్మచర్య పవిత్రతలు కొనియాడాడు. "తమ్ము తాము పరిశుభ్రముగా ఉంచుకొనిన ప్రజలువారు.వారు స్త్రీలతో సంబంధం కలిగించుకొనలేదు. వారు అవివాహితులు, గొర్రెపిల్ల ఎటుపోయినా వారు దానిని అనుసరింతురు.వారు మిగిలిన మానవాళి నుండి విముక్తులైరి. దేవునికిని, గొర్రెపిల్లకును అర్చింపబడుటే వారే ప్రథమఫలము.వారు "దోషరహితులు" (దర్శన 14:4). ఈ మాటలు జీవితాన్ని దైవాంకితము చేసిన పురుషులకూ, స్త్రీలకూ వర్తిస్తాయి.

జీవనక్రమంలో పెళ్ళయిన వారికంటే,ఒంటరిగా ఉన్న గురువు, తనకున్న పూర్తి సమయాన్ని దైవసేవకు వినియోగించడానికి వీలవుతుంది. పెళ్ళయిన వారికి కుటుంబము, భార్యాపిల్లల బాధ్యతలు మెండుగా ఉంటాయి. ప్రాధ్యాన్యతల వరుసలో వివాహం చేసికొననివారు, ప్రజల యొక్క ఆధ్యాత్మిక, సామాజిక ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వటానికి వీలుంటుంది.అటు దైవసేవలో, ఇటు మానవసేవలో తమకున్న పూర్తి సమయాన్ని వినియోగించడానికి అవకాశముంటుంది.

పౌలు ప్రతిపాదించిన దైవాంకిత జీవితాల ఫలితాన్ని ఈ వాక్యాలలో -గమనించండి: "మీరు విచారమునుండి దూరము కావలెననియే నా ఆభిష్టము ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు అవివాహితుడగు వ్యక్తి ప్రభువు పనియందే నిమగ్యుడగును. కాని, భార్యను సంతోషపెట్టవలెనని తలంపుగల వాడగుటచే వివాహితుడగు వ్యక్తి లౌకిక వ్యవహారములలో చిక్కుకొని, రెండు,ప్రక్కల జరుగబడుచుండును. శారీరకముగను, ఆత్మయందును కూడా ఆర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక, ప్రభువు పనియందే. నిమగ్నురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకిక వ్యవహారములలో చిక్కుకొనును" (1 కొరింతీ 7:32-34).

సంసార బాధ్యతలులేని వారిలో త్యాగనిరతి మెండుగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ పునీత మాక్సిమిలియన్ కోల్బే, భార్యాబిడ్డలున్న తన సహచరి ఖైదీ చనిపోవలసి వచ్చినప్పుడు, అతని దుఃఖాన్ని ఆవేదనను అర్ధంచేసుకున్న ఈ పునీతుడు, అతని స్థానంలో తాను మరణిస్తానని ముందుకొచ్చాడు. భార్యాబిడ్డలున్నవారు ఇలాంటి సమయాలలో ముందు వెనుకలు ఆలోచించవలసి వస్తుంది కదా!

వివాహం చేసికోని గురువు, తన ఆర్థిక స్థితిని,ప్రజలకోసం వినియోగించి అందరినీ ఆదుకొనే అవకాశముంటుంది.

కుటుంబ బాధ్యతలులేని గురువులు, మఠవాసులు, పలుచోట్లకు వెళ్ళి దైవసేవ
చేయడానికి వీలుంటుంది. యేసుక్రీస్తు తన శిష్యులను పలుచోట్లకు పంపి
దైవసందేశాన్ని బోధించమని కోరాడు (మత్తయి 28:19-20)

గురువులకు బ్రహ్మచర్యాన్ని ప్రతిపాదిస్తూ క్రీ.శ. 385లో సిరీసియుస్ పావుగారు ఒక శాసనాన్ని రూపొందించారు. అదే శాసనాన్ని పునరుద్ఘాటిస్తూ, క్రీ.శ. 1074లో, 7వ గ్రెగర్ పాపుగారు,ఈ శ్రీసభ చట్టాన్ని క్రమబద్ధీకరణ చేస్తూ పునరుద్ఘాటించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN