ద్రాక్షరసం బైబిల్ భావం

ఫాదర్ పూదోట జోజయ్య

08 Jul 2026

ద్రాక్షరసానికి బైబుల్లో చాల సాంకేతిక భావాలున్నాయి. ఇక్కడ కొన్నిటిని పరిశీలిద్దాం. ద్రాక్షరసం శ్రమలకు,నెత్తురు కార్చడానికి చిహ్నంగా వుంటుంది.ప్రభువు కోపంతో తన శత్రువులను శిక్షించి శ్రమపెట్టడాన్ని ద్రాక్షపండ్లను తొక్కి,రసము తీయడంతో పోలుస్తుంది పాత నిబంధన "ద్రాక్షపండ్లను నలగతొక్కి రసము తీయువానివలె నీ దుస్తులు ఎర్రగా వున్నవేల? నేనొక్కడనే జాతులను ద్రాక్షపండ్లలా నలగద్రొక్కాను నేను కోపంతో జాతులను నలగద్రొక్కాను వారి నెత్తురు నా బట్టలమీద చిందిపడగా. 'నా దుస్తులకు మరకలయ్యాయి" - (యెష 63: 2-3) ఇక్కడ యావే శత్రువులు అతని శిక్షవల్ల నలిగిపోయి ద్రాక్షపండ్లు రసాన్ని కార్చినట్లుగా నెత్తురు కార్చారని భావం.

ద్రాక్షరసం నెత్తురులా ఎర్రగా వుంటుంది.కనుక అది నెత్తురు కార్చడానికి కూడ చిహ్నమైంది. క్రీస్తు కడరాభోజన సమయంలో శిష్యులకు ద్రాక్షరసాన్ని ఇచ్చాడు.ఆ రసం అతడు కార్చబోయే నెత్తురుకే చిహ్నం. కనుకనే అతడు శిష్యులకు ద్రాక్షరసం పాత్రను ఇచ్చి మీరందరు దీనిలోనిది త్రాగండి.ఇది అనేకుల పాపపరిహారార్థమై చిందబడనున్న నూతన నిబంధనం యొక్క నా రక్తం" అన్నారు - (మత్త 26:27-28). నేడు మనం ఆ పాత్రంలోని దివ్యరక్తాన్ని త్రాగినపుడల్లా క్రీస్తు శ్రమలనూ, మరణాన్నీ గుర్తుతెచ్చుకొంటాం.అందుకే క్రీస్తు "ఈ పాత్ర నా రక్తంద్వారా నెలకొన్న దేవుని నూత్న నిబంధనం.మీరు దీన్ని త్రాగేపుడల్లా నా జ్ఞాపకార్థంగా త్రాగండి" అన్నారు. కనుక మనం ఆ ప్రభువు రొట్టెను తిన్నపుడూ, ఆ పాత్రంనుండి త్రాగినపుడూ, ప్రభువు మళ్లా రెండవసారి వచ్చేవరకూ అతని మరణాన్ని ప్రకటిస్తూంటాం - (1 కొరి 11:25-26) దివ్య సత్ప్రసాదవిధిలో ఈలాంటి నిగూఢభావాలు వున్నాయి.

ద్రాక్షరసం విందుకీ,దివ్యసత్ప్రసాదానికీ మోక్షానికి కూడా చిహ్నంగా వుంటుంది. యూదులు విందుల్లో ఈ రసాన్ని తనివితీర త్రాగేవాళ్లు. కనుక అది విందుకి చిహ్నమైంది. ఇంకా యూదులు స్వర్గాన్ని కూడ గొప్ప విందుతో పోల్చేవాళ్లు. ఈ భావాలన్నీ మనసులో పెట్టుకొనే క్రీస్తు "ఇది మొదలుకొని మీతో కలసి నూత్నంగా నా తండ్రి రాజ్యంలో ద్రాక్షరసాన్ని పానంచేసేవరకూ దాన్ని మళ్లా ముట్టుకోను” అన్నాడు.(మత్త 26:29) అనగా మోక్షపు విందులో మనం క్రీస్తుతోపాటు మరలా ద్రాక్షరసాన్ని పానం చేస్తాం. అనగా క్రీస్తుతోపాటు మనంకూడా మోక్షభాగ్యాన్ని అనుభవిస్తామని భావం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN