జులై మాసము క్రీస్తు పవిత్ర రక్తమునకు అంకితంచేయబడిన మాసం

జోసెఫ్ అవినాష్

01 Jul 2026

క్రీస్తు పవిత్ర రక్తము గురించి మనము తెలుసుకోవాల్సిన విషయాలు. ‌

అపోస్తులుడైన పునీత యోహాను గారు సిలువ మీద వ్రేలాడే క్రీస్తుని సైనికుడు ఈటెతో పొడవటం కనులారా చూశారు... (క్రీస్తు శిష్యులు ప్రాణభయంతో క్రీస్తు నుండి దూరంగా వెళ్లిపోయారు .కానీ యోహాను గారు ఒక్కరు మాత్రమే సిలువ చెంత నిలిచి ఉన్నారు..) ఆ దృశ్యానికి అతని మనసు కరిగిపోయింది. కనుకనే ఆ సంఘటనను కేవలం యోహానుగారు మాత్రమే తన సువిశేషములో పేర్కొన్నారు.. దాని గురించి నొక్కి చెప్పారు. వేరే విషయాలను వర్ణించేటప్పుడు కూడా యోహాను ఈ అంశాన్ని మర్చిపోలేదు. ఉదాహరణకి యోహాను సువార్తలో క్రీస్తు తోమాను ఆహ్వానించిన సందర్భంలో " నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచు" అంటారు (యోహాను 20:27) అనగా ఈ అంశం యోహాను గారి హృదయం మీద చెరగని ముద్ర వేసిందని చెప్పాలి.

సైనికుడు క్రీస్తు ప్రక్కను ఈటెతో పొడవగా నెత్తురు స్రవించింది(యోహాను 19:34) యోహాను తన సువిశేషం కాక తను రాసిన మొదటి లేఖలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు

"ప్రత్యక్షమైన అతను యేసు క్రీస్తే, ఆయన జలముతో, రక్తముతో వచ్చెను. ఆయన కేవలము జలముతోనే కాక, జలముతో, రక్తముతో వచ్చెను.(1 యోహాను 5:6)

క్రీస్తు ప్రక్కలో నుండి కారిన రక్తాన్ని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం-:
ఈ నెత్తురు ప్రధానంగా బలిని సూచిస్తుంది. క్రీస్తు మనకు పాస్క గొర్రెపిల్ల వంటి వాడిని బైబిల్ గ్రంధం సాక్ష్యం ఇస్తున్నది.. సిలువ మీద అతడు నెత్తురు చిందించి ప్రాణత్యాగం చేసుకొన్నారు ఇదే అతని బలి అతని ఆత్మార్పణం దీని ద్వారా మనకు పాపవిమోచనం కలిగింది.. నూతన నిబంధన చాలా తావుల్లో క్రీస్తు రక్తం మనకు పాప పరిహారం చేసి పెడుతుందని చెప్తుంది. అలాంటి సందర్భాలను మూడింటిని మాత్రం ఈ వ్యాసంలో పరిశీలిద్దాం

1. క్షయ వస్తువులైన వెండి బంగారాల వలన మీకు విమోచనం లభించలేదు నిర్దోషమును,నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటివాడగు క్రీస్తు అమూల్య రక్తము ద్వారా మీకు విమోచనం లభించింది" (1పేతురు 1:18-19)

పూర్వం బానిసల యజమానులకు వెండి బంగారాలు చెల్లించి ఆ బానిసలను బానిసత్వం( దాస్యం) నుండి విడిపించే వాళ్ళు. మనం పాపము ద్వారా పిశాచానికి బానిసలై ఉన్నప్పుడు క్రీస్తు నశ్వర వస్తువులైన వెండి బంగారాల ద్వారా మనలను విడిపించలేదు. మరి తన పవిత్ర నెత్తుటి ద్వారా అతడు మనలను పాప దాస్యం నుండి విడిపించారు.. ఆ నెత్తురు అమూల్యమైనది అనగా విలువ కట్టరానిది. అతడు నిర్దోషి నిష్కల్మషుడు. అనగా మహా పవిత్రుడు, దేవుని కుమారుడు అతని నెత్తురు ఎంత పవిత్రమైయుండాలి? అలాంటి నెత్తురు మనకు విమోచనం కలిగించింది-: (హెబ్రి 9:13-14)

2. "నీవు బలి కావింపబడితివి
నీ రక్తం ద్వారా
ప్రతి జాతి నుండి భాష నుండి ప్రజ నుండి తెగ నుండి దేవునికి నరులను కొని తెచ్చితివి" (దర్శన 5:9)

క్రీస్తు సిలువ మీద బలయ్యారు సొంత రక్తం చిందించారు.. ఇలా అతడు మనలను పాపమునుండి విమోచించారు. ఈ విమోచనం ద్వారా అతడు దేవునికి కొత్త ప్రజలను సంపాదించి పెట్టారు. ఈ ప్రజలు అన్ని దేశాల్లో నుండి అన్ని జాతుల నుండి వచ్చిన వాళ్ళు అనగా ప్రభువు తన సిలువ మరణము ద్వారా అందరినీ దేవుని ప్రజలను చేశాడని భావం...

3. పాతనిబంధనలో సీనియా పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధనం చేసుకున్నారు. ఈ నిబంధనం నెత్తురు ద్వారా జరిగింది
"అప్పుడు మోషే పల్లెములలోని రక్తము యిస్రాయేలీయుల మీద ప్రోక్షించి “యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు, మీతో చేసికొనిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే” అనెను". (నిర్గమ 24:8) ఇది పాత నిబంధన. క్రీస్తు తన నెత్తుటితో మరలా మనతో నిబంధనం చేసుకున్నారు.

అతడు ద్రాక్ష సారాయపు పాత్రను అందుకుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి మీరందరూ ఈ పాత్రలోని రక్తాన్ని త్రాగండి. ఇది అనేకుల పాప పరిహారానికి చిందబడనున్న నిబంధనపు నా రక్తం అన్నారు(మత్తయి 26:28) ఇక్కడ "నిబంధనపు నా రక్తం" అనటం ద్వారా క్రీస్తు పాత నిబంధనలోని సీనాయి నిబంధనాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆ నిబంధన ద్వారా ఇశ్రాయేలీయులు యావే ప్రజలయ్యారు..ఈ నిబంధన ద్వారా మనం క్రీస్తు ప్రజలమౌతాం...ఆ నిబంధనం ఎడ్ల నెత్తుటితో జరిగింది. కానీ ఈ నిబంధన క్రీస్తు పవిత్ర రక్తముతో జరిగింది.. దాని కంటే ఇది ఎంతో శ్రేష్టమైనది..

క్రీస్తు శ్రమననుభవించడం మొదలుపెట్టినప్పటి నుండి విశేషంగా సిలువనెక్కినప్పటి నుండి రక్తం చిందిస్తూనే ఉన్నారు. అతడు తన మరణం దాకా మరణం ముగిసి అతని ప్రక్కను ఈటెతో తెరిచాక కూడా నెత్తురు కార్చారు. ఈ పవిత్ర రక్తమే మనకు పాపవిమోచనం కలిగించింది.. సిలువ మీద అతని ప్రక్కనుండి కారినది అతని నెత్తుటి లో చివరి బొట్లు అనుకోవాలి.. ఈ నెత్తుటి ద్వారానే అతడు మనతో నూతన నిబంధనం చేసుకున్నారు..

ఈ విధంగా రక్షణ చరిత్రలో క్రీస్తు పవిత్ర రక్తమునకు ఎంతో ప్రాముఖ్యత కలదు. మన శ్రీ సభ పితరులు, కతోలిక వేదపండితులు, పునీతులు క్రీస్తు పవిత్ర రక్తం గురించి బోధించారు. అనేక రచనలు రచించారు.

క్రీస్తు ప్రక్కలో నుండి నీరు, రక్తం స్రవించినప్పుడు కతోలిక శ్రీ సభ,దివ్య సంస్కారాలు ఉద్భవించినట్లు శ్రీసభ బోధనల ద్వారా తెలుస్తున్నది..క్రీస్తు ప్రక్కలో కారిన రక్తము పవిత్ర దివ్యబలిపూజలోని క్రీస్తు పవిత్ర రక్తమును సూచిస్తుంది.. క్రీస్తు రక్తము ఆరాధనకు స్తుతి పాత్రమని కతోలిక శ్రీసభ తెలియజేస్తున్నది..‌ యూదులు రక్తంలో ప్రాణం ఉందని బలంగా నమ్ముతారు..

క్రీస్తు పవిత్ర రక్తమునకు మనలను రక్షించు శక్తి ఉన్నది.. కనుక వ్యాధులతో బాధపడుతున్న వారిని, మన కుటుంబాలను క్రీస్తు పవిత్ర రక్తమునకు అంకితం చేద్దాం.. అందరి కొరకు ప్రార్థన చేద్దాం..

క్రీస్తు రక్తమే జయం ఆమెన్..

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN