దివ్యసత్ప్రసాద అద్భుతాలు

సిస్టర్ యం. అంతోనమ్మ
27 Jun 2026
1251 నాటి దివ్యసత్ప్రసాదం నేటికీ చెక్కుచెదరలేదు..
స్పెయిన్ దేశంలో జరిగిన అద్భుతం గురించి తెలుసుకుందాం. కౌంట్ వీఫ్రెడ్ అనే పేరుగల సన్యాసుల నాయకుడు పేరిణియన్ రాజ్యంలోని కేతాలోనియా ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించాడు,దానికి పునీత జాన్ అబడెస్సా అని నామకరణం చేసారు.స్థాపించిన వెను వెంటనే దానికి అతి సమీపంలో ఒక గ్రామం పుట్టుకొచ్చింది. 1251లో అచటి దేవాలయాన్ని అతిసుందరంగా చెక్కతో,సిలువ నుండి దించబడిన క్రీస్తు శ్రమల ముఖం,తల్లి మరియ,అరిమత్తయి యోసేపు, నికొదేము,ప్రియశిష్యుడైన పునీత యోహాను, ఇద్దరు దొంగల చిత్రాలను కళ్ళకు కట్టినట్లు తీర్చిదిద్దారు. ఈ కళాత్మకమైన పనిని తిలకించే ప్రతివారు గొప్పగా కొనియాడుతున్నారు.క్రీస్తుప్రభుని ముఖం అన్నిటికన్నా ఎక్కువగా ఆకర్షిస్తుంది.దీనిని చిత్రిస్తున్నప్పుడు చిత్రకారుడు యేసుప్రభు సుదుటి మీద ఒక రంధ్రం ప్రత్యేకంగా ఉంచాడు ఎందుకంటే దానిలో పవిత్ర దివ్య సత్ప్రసాదాన్ని దాచి ఉంచవచ్చు అని ఆలోచనతో చేసాడు. 1251లో కొంతమంది దీనిపై విశ్వాసం గల గురువులు దానిలో పవిత్ర దివ్య సత్ప్రసాదాన్ని దాచి ఉంచి దానిపై ముద్ర వేసారు,నెమ్మదిగా ఈ విషయం అందరు మరచిపోయారు.
అద్భుతం, అధికారిక గుర్తింపు...
1426లో తిరిగి ఈ రూపాలను పునరుద్ధరించు సమయంలో యేసుక్రీస్తు నుదుటి మీద ఉంచిన చిన్న రంధ్రాన్ని కనుగొన్నారు. దానిని చిన్న వెండి స్మారక చిహ్నాన్ని తెల్లని వస్త్రంతో చుట్టి ఉంచడం గమనించారు.1251లో ఆశీర్వదించ బడిన దివ్య సత్ప్రసాదం చెక్కు చెదరకుండా,నిర్మలంగా ఉండడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది.అప్పటి నుండి దీనిని అత్యంత పరమ రహస్యమైన పునీత జాన్ అబిదీస్ గా పిలుపబడుతుంది. దీనిని ఆరాధన భావంతో అధికారికంగా స్థానిక పీఠాధిపతులు గుర్తించి ప్రకటించారు. 1251వ సంవత్సరం నుండి విశ్వాసులు ఈ దివ్య సత్ప్రసాద నాథుని ఆరాధించి,పొగడి,కీర్తిస్తున్నారు.ప్రభువు అందరిని దీవిస్తూ కాచి కాపాడుతూ సంరక్షిస్తున్నారు.మనకు ఇంతటి భాగ్యాన్ని దయ చేసి,మన విశ్వాసాన్ని బలపరుస్తున్నందుకు హృదయపూర్వక వందనాలు,స్తుతులు,స్తోత్రములు చెల్లించుకొందాం.
