నేటి పునీతులు: పునీత అలెగ్జాండ్రియా సిరిల్

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

27 Jun 2026

ఈజిప్టుదేశంలో నైలునది ఒడ్డున అలెగ్జాండ్రియా అనే నగరం ఉంది. పునీత సిరిల్ గారు అక్కడే క్రీ||శ|| 376లో జన్మించారు. ఉత్తమ క్రైస్తవ విశ్వాసంలో పెంచబడ్డారు. ఆ రోజుల్లో వీరి దగ్గరబంధువైన (తండ్రి సోదరుడు లేక తల్లి సోదరుడు) తెయోఫీ ల గారు అలెగ్జాండ్రియా పీఠానికి బిషప్ గా పనిచేస్తుండేవారు. వారు ఆ కాలంలో ఈజిప్టు దేశ అడవుల్లో గడుపుతున్న సన్యాసులవద్దకు యువకుడైన సిరిల్ గారిని ఆథ్యాత్మిక సాధన చేసేందుకు క్రీస్తుతత్వాన్ని ఒంటబట్టించుకునేందుకు పంపించారు. క్రీ||శ|| 403లో దేశంలో ఉన్న కాన్స్టాంట్ నోపిల్ వద్ద జరిగిన ఓక్ మహాసభలకు సిరిల్ గారు, తెయోఫిల గారు ఇద్దరూ హాజరయ్యారు. ఆ రోజుల్లోనే క్రైస్తవులపై యూదప్రజలు, విగ్రహారాధకుల చిత్రహింసలు అధికమయ్యాయి.

ఒక మఠాశ్రమంలో చేరిన సిరిల్ గారు అత్యంత క్రమశిక్షణతో ఆశ్రమ కట్టుబాట్లను ఆచరించేవారు. ప్రార్థన, ఉపవాస దీక్షలు వీరికి నిత్యకృత్యం. క్రీ||శ|| 412లో బిషప్ తియోఫీలస్ గారు దివంగతులయ్యారు. అట్టిసమయమున 36 ఏండ్ల ప్రాయంగలిగి అన్ని విధాలా యోగ్యుడు, అనుభవజ్ఞుడు అయిన యువగురువు సిరిల్ గారే అలెగ్జాండ్రియా పీఠానికి బిషప్పుగా నియమింపబడ్డారు. వారు అధికారం చేపట్టిన వెంటనే తప్పుడు బోధనలను, క్రైస్తవసత్యాలను వక్రీకరించి చెప్పబడుతున్న నొవెషియా దేవాలయాలన్నింటికి తాళం వేయించారు. పైగా శ్రీసభలో చీలికను తెచ్చి ప్రోత్సహిస్తున్న యూదులందరిని వారు వెలివేశారు. దీని ఫలితంగా కక్ష పెంచుకున్న వితండవాద యూదులు తరచూ క్రైస్తవులపై దాడులు జరుపుతూ వారిని ఊచకోతకోయడం ప్రారంభించారు.

క్రీ||శ|| 428లో సిరియాదేశములోని అంటియోకియానగరానికి చెందిన నెస్టోరియస్ అను పేరుగల వ్యక్తి కాన్స్టాంట్ నోపిల్ కు పీఠాధిపతిగా ఎన్నికయ్యారు. వీరు మరియమాత యెడల, క్రీస్తుకు సంబంధించిన కొన్ని సిద్ధాంతాలయెడల తప్పుడు అభిప్రాయంకలిగిఉండి వాటినే క్రమంగా ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఈ తప్పుడు ప్రచారాన్ని త్రిప్పికొట్టేందుకు పునీత సిరి గారు సారధ్యం వహించారు. బిషప్ నెస్టోరియస్ అతిక్రమ వ్యవహారాల్ని బిషప్ సిరిల్ గారు అప్పటి పోపు 1వ సెలస్టీనుగార్కి పూసగుచ్చినట్లు తెలియజేశారు. అందుకు వారు సిరిల్ గారి అధ్యక్షతన ఒక నిజనిర్ధారణ కమిషను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ యొక్క సిఫారసులు క్రీ||శ|| 431లో ఎ ఫేసులో జరిగిన మహాసభలో వెల్లడింప బడ్డాయి. తత్ఫలితంగా బిషప్ నెస్టోరియస్ ను పదవీభ్రష్టుణ్నిచేసి బహిష్కరించడం జరిగింది. మేరీమాత 'దేవునిమాత' అని యావత్ ప్రపంచానికి ఆ సభాధికారికంగా ప్రకటించింది.

అనంతరం బిషప్ సిరిల్ గారు రెట్టింపు ఉత్సాహంతో దేవునితల్లిగా మేరీమాత గౌరవాన్ని ఎత్తిచూపుతూ క్రీస్తు దేవుని పుత్రుడు మరియు మరియ పుత్రుడు. క్రీస్తు నిజమైన దేవుడు మరియు నరుడు. ఇందువల్ల దేవుడైన దేవునిపుత్రునికి తల్లికావున మేరీమాతను దేవమాత అనడంలో తప్పులేదని, ఏసే తన జీవితంలో తల్లిని నిస్సంకోచంగా గౌరవించినందువల్ల ముఖ్యంగా కానాపల్లె వివాహ సందర్భంలో తన సమయమింకను రాలేదని చెప్పిన ఏసు తల్లిని గౌరవిస్తూ తన సమయాన్ని ముందుకు జరుపుకొని అనగా తన సమయాన్ని అప్పటికప్పుడు రప్పించుకొని నీటిని ద్రాక్షారసముగా మార్చి అద్భుతాన్ని చేశారని వివరణనిస్తూ సమర్థించారు. అలాగే త్రిత్వేక సర్వేశ్వరునియొక్క పరమ రహస్యమును తేటతెల్లంచేయ ప్రయత్నించారు. ఉదాహరణకు సూర్యుడు-వెలుగు-ఉష్ణం ఈ మూడు ఎలా వేర్వేరైనా కలసి ఉండటం కలసిఉన్నా వేర్వేరుగా ఉండటం లాంటికధలరూపంలో కతోలిక సత్యాల్ని వివరించి ఉండవచ్చు. క్రీస్తుని దైవమానవ స్వభావాలు ఏకకాలంలో ధరించడంగూర్చి, వారి ప్రాణత్యాగంవల్ల ఎలా మానవాళికంతటికి రక్షణ లభించిందో ఉపమానాలతో బోధించి ఈ అంశాలగూర్చి అనేక రచనలుచేసి శ్రీసభను పటిష్టపరచడంలో ఎనలేని కృషిచేశారు బిషప్ సిరిల్ గారు. అదేకాలంలో మత భ్రష్టుడైన జూలియన్ వాదనలకు వ్యతిరేకంగా సిరిల్ గారు ఒక పుస్తకాన్నికూడ వ్రాసి ప్రజలకు సత్యాన్ని

నిరూపించకలిగారు.

వీరు తమ 68వ ఏట అనగా క్రీ||శ|| 444లో పరలోకప్రాప్తి నొందారు. వీరు పునీతులుగా

వెల్లడింపబడి కొనియాడబడుతున్నారు. అయితే సుదీర్ఘ కాలం తర్వాత క్రీ||శ|| 1882లో వీరిని శ్రీసభ పండితులుగా 13వ లియో పోపుగారు ప్రత్యేక గుర్తింపునిచ్చారు. "అన్యజాతులును అతని విజ్ఞానమును సమ్మతించును. విద్యత్సభ అతనిని కీర్తించును." (సిరాక్ 39:10) అనిన సిరాకు వచనాలు ఇట్టి పునీత సిరల్ వంటి వారికి అన్వయింపనగును. శ్రీసభ పండితులని గుర్తింపబడిన 30 మంది పురుష పునీతులు ఇరువురు స్త్రీ పునీతులో బిషప్ సిరిల్ గారు ఒకరంటే విశేషమేమరి. సిరిల్ అనగా ప్రభువు, పాలకుడు, చక్రవర్తి, రాజు అని అర్ధం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN