కృతజ్ఞతా భావం కలిగి జీవిద్దాం

జోసెఫ్ అవినాష్

24 Jun 2026

సామాన్య 12వ గురువారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 8:1-4
యేసుక్రీస్తు దైవరాజ్య విస్తరణలో భాగంలో తన పరిచర్యలో కేవలం మాటలకు బోధనకు మాత్రమే పరిమితం కాక తమ చేతల ద్వారా తన ఉనికిని, తన శక్తిని, తన అధికారంను కూడా బహిర్గతం చేస్తూ తన కార్యము దేవునిచే ఇవ్వబడినది అని రుజువు చేశాడు. తాను బోధించిన పిదప తన బోధన కార్యరూపం దాల్చింది. ఈనాటి సువిశేషంలో బోధను ముగించి పర్వతముపై నుండి దిగి వచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి అని వింటున్నాం. నిజమే ఆయన బోధన కొత్తగా వుంది. ఆదరణగా వుంది. అందుకే ఆయనను వెంబడించారు.ఆయన అధికారము గల వానివలే బోధించెను.ఆ అధికారమును క్రియలద్వారా స్థిరపరచెను. నేటి సువార్తలో యేసుక్రీస్తు కుష్టురోగిని జూచి జాలినొందాడు. అతని జీవితం ఎంత దుర్భరమో, ఆనాటి సమాజంలో కుష్టురోగుల జీవితం ఎంత హీనమైందో ప్రభువు అతని కళ్ళలోకి చూచి గ్రహించాడు,చలించిపోయాడు. అంతేకాదు, వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో కాని, ప్రభువు ముందు మోకరిల్లాడు. ఒళ్ళంతా కుష్టు ఉండవచ్చు. పుండ్లతో, తన శరీరం హీనమై యుండవచ్చు. కాని మోకరించాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువు తన వినయాన్ని, తన ఆశను గ్రహించాడు. వెంటనే "అతనిని తాకి నాకిష్టమే” నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే అతని కుష్టము పోయి శుద్ధుడైనాడు. ఇక్కడ ప్రభువు అతని అంతరంగ వ్యధను చూస్తున్నాడు, ఆశను చూస్తున్నాడు. అందుకే “నీవు శుద్దుడగుట నా కిష్టమే” అని యేసు పలికాడు. కాబట్టి మనందరం బాగుండాలి, మనందరి జీవితం ఆ దేవుని కొరకే. మనం కూడా ఎన్నో సందర్భాల్లో దేవుని నుండి మేలులు పొందుతున్నాం. మళ్ళీ మరచిపోతున్నాం. కాని వెళ్ళి ఆలయంలో దేవునికి కన్పించి, కృతజ్ఞతలు చెల్లించి, కానుకలు అర్పించాలి. ఎప్పుడైతే ఈ కృతజ్ఞతను మరచిపోతామో దేవునిలో మనల్ని మనం కోల్పోతాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN