నేటి పునీతులు: పునీత జోసఫ్ కఫాస్సో

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
23 Jun 2026
ఇటలీదేశంలోని పీదెమోంట్ ప్రాంతంలో 'కా సెల్ నువో పట్టణం ఉంది. ఆ పట్టణంలో పేదవ్యవసాయ కుటుంబం ఒకటుండేది. దీనత, భక్తి, విశ్వాసం వారికి పెట్టని భూషణాలు. క్రీ||శ|| 1811లో ఈ కఫాస్సో కుటుంబంలో జోసఫ్ జన్మించారు. మంచి విశ్వాసంలో క్రమశిక్షణలో పెంచబడ్డారు.
జోసఫ్ కఫాస్సో మంచి ప్రజ్ఞాశాలి. విద్యావ్యాసంగాల్లోను, ఆటపాటల్లోను దిట్ట. పేదరికాన్ని అధిగమించడానికి కఠోరపరిశ్రమ, నిరంతరకృషి సల్పేవారు. ఈ బాలుని సత్యసంధత, ప్రార్థనా జీవితం, క్రీస్తునందలి విశ్వాసం గమనించినవారు వీరిని "ఓ బాల పునీతుడా !" అని సంబోధించేవారు. పువ్వుపుట్టగానే పరిమళించడమంటే ఇదే కాబోలు
ఇట్టిగట్టి క్రైస్తవ పునాది కలిగిన జోసఫ్ ఇటలీదేశంలోని టూరిన్ నగరంలో గల గురు విద్యా లయంలో చదువుకొని తన 22వ ఏట అనగా క్రీ||శ|| 1833లో పవిత్ర గురుపట్టా స్వీకరించారు. ఆధ్యాత్మిక రంగంలో ఒక ఒరవడితో ముందుకు దూసుకెళ్లారు. అంచెలంచెలుగా పదవుల నందుకోసాగారు. సెమినరీ డైరెక్టరుగా, నీతి వేదశాస్త్రంలో ప్రొఫెసరుగా, కడన టూరిలో ప్రసిద్ధిగాంచిన గురుశిక్షణాలయం రెక్టరుగా గురుతర సేవలందించి, తాను నిర్వహించిన అన్ని పదవుల్లో ఎంతో సమర్ధుడనిపించుకొని అందరి మన్ననలందుకున్నారు. వీరి సోదరుని లేక సోదరి కుమారుడైన క్యానన్ జోసఫ్ అల్లమనొగారే 'కన్సొలేట్ గురుసభను స్థాపించి సుప్రసిద్ధులయ్యారు.
ఫాదర్ జోసఫ్ కఫాస్సోగారు ఇంచుమించు అయిదడుగులు ఎత్తుకలిగి ఉన్నా చూపరులకు పొట్టివానిగా ఒక విధమైన వికలాంగుడుగా అపోహకలిగేది. ఏమైనావారు శ్రీ సభకు ఒనరించిన దొడ్డ సేవలకుగాను ప్రజలెంతగానో పొగిడారు. వారు గురువులకే కాకుండా టూరిన్ నగర నివాసులెల్లరకు గొప్ప ఆశీర్వాదకర వ్యక్తిగా ఆదరింపబడ్డారు. వీరి అనుంగు శిష్యుడైన పునీత డాన్ బోస్కోగారి యువజనులకు, అనాధాశ్రమాలు, చెరసాలలో ఉన్నవారి సేవలకై ఎంతగానో ప్రోత్సహించారు. మరియు “అనంతజ్ఞానియైన ఏసుక్రీస్తు ప్రభువు ప్రజలకు బోధించేటప్పుడు మంచి భాష జాతీయాలు, ఉపమానాలు వాడేవారు. నీవును అదే పంథాలో బోధించు" అని భుజంతటారు కఫాస్సో. తద్వారా ప్రపంచంలో ప్రసిద్ధి ధర్మసేవల అపోస్తలునిగా మిక్కిలి పేరొందిన జాన్ బోస్కోగార్కి ఫాదర్ జోసఫ్ మంచి ఆథ్యాత్మిక సలహాదారుడుగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ ఘనవిశేషం.
ఫాదర్ జోసఫ్ గారికి సలేషియన్ సభగురువులతో సత్సంబంధాలుండేవి. అందుచే వీరినికొందరు సలేషియన్ గురువని అపోహపడేవారు. ఇటలీలోని జైలు సంస్కరణలకు ప్రధాన కారుకులు ఫాదర్ జోసఫ్ గారే. అనేక పాఠశాలలు, దైవపిలుపు తర్పీదు కేంద్రాలు, ఆనాధాశ్రమాల స్థాపనకు ఆద్యులు వీరే. వీరు టూరి పట్టణంలో నివశించే రోజుల్లో వీరుంటున్న ఆథ్యాత్మిక గృహానికి గురువులు, పీఠాధిపతులు, రాజవంశజులు, కార్మికులు ఇలా అనేక వర్గాల విశ్వాసులు వేలాదిగా విచ్చేసి, ఆత్మపరిశోధనగావించి, ఉత్తమ పాపసంకీర్తనచేసి మంచి ఉపదేశం పొంది దివ్యహాయిని, శాంతినిపొంది పరవశులయ్యే వారు. పవిత్రాత్మ ప్రభుని అనుగ్రహాలు వరాలతో తమ్ముతాము అభిషేకించుకొని, తమ హృదయాంతరంగంలో పరిమళ పరిశుద్ధ పుష్పాలంకరణ చేసికొని భువిలోదివిని చవి చూచేవారు.
వీరికి క్రితంలో జీవించిన 'పునీత ఫాదర్ జోసఫ్ కొట్టొలెంగ్' గారు పేదలు, అనాథల, నిరాశాపరులకు తమ శరణాలయం ద్వారా ధారాళ సేవలందించారు. వారికి బాసటగా నిలిచారు. వారి తరువాత అట్లాంటి ధార్మిక సేవలను ఇప్పుడు ఈ ఫాదర్ జోసఫ్ కఫాస్సోగారు చేపట్టి ఆత్మ సంతృప్తులయ్యారు. తన అవసానదశలో ఈ ఉత్కృష్ట విశ్వాస సేవలో తరించడం దేవుడు దయతో తన కొసంగిన వరంగా భావించిన వీరు క్రీ||శ|| 1860లో పరమపదించారు. లేబ్రాయంలో ఉన్నప్పుడే జీవిస్తున్న పునీతునిగా పేరొందిన వీరు తమ మరణానంతరం పునీతునిగా ప్రకటింపబడకుంటారా ?
అవును క్రీ||శ|| 1947 జూన్ 22న శ్రీ సభజగద్గురువులు 12వ పయస్ (భక్తినాథులు) గారు వీరిని పునీతునిగా తీర్మానించినట్లు వెల్లడించారు. ఆనాటి దివ్యబలిపూజలో పరిశుద్ద పోపుగారు ప్రసంగిస్తూ : ప్రతి ఒక్క గురువుకూడ అలుపెరుగని చురుకుదనం, సహనం, జాలి, సదాజపజీవన పద్ధతి అనే ఆదర్శ విశ్వాస లక్షణాల్ని ఫాదర్ పునీత జోసఫ్ కఫాస్పోగారినుండి నేర్వదగునని అభిభాషించారు. వీరు నిజంగా దైవప్రసాదిత సుమాతృకా సద్గురువని, వీరి సేవలు శ్రీసభకు కొంట్రొత్త జవజీవాల్ని చైతన్యస్పూర్తిని అందించిందని కొండాడుతూ జగద్గురువులు ఆనంద బాష్పాలు రాల్చారు. జోసఫ్ అనగా దేవుడు అధికముచేయును, హెచ్చించును అని అర్థం.
