పిల్లల రక్షణ మాటల్లో కాదు, కార్యాచరణలో కనిపించాలి - పోప్
జోసెఫ్ అవినాష్
17 Jun 2026
పిల్లలు, యువకులు మరియు బలహీనుల రక్షణ శ్రీసభ యొక్క అత్యంత పవిత్రమైన బాధ్యత అని పోప్ లియో XIV పేర్కొన్నారు. కతోలిక శ్రీసభ ఆధ్వర్యంలో పసి బిడ్డల సంరక్షణ కోసం పనిచేసే ఒక విభాగం ఉంది. ఆ విభాగ ప్రతినిధులతో సమావేశమైన పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రతి చర్చి, విద్యాసంస్థ, కుటుంబం మరియు డిజిటల్ వేదిక కూడా వారికి భద్రత,గౌరవం,విశ్వాసం కలిగించే స్థలంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.దుర్వినియోగం బాధితుల జీవితాల్లో లోతైన గాయాలను మిగులుస్తుందని,అందుకే కేవలం నియమాలు రూపొందించడం సరిపోదని,ప్రతి వ్యక్తిలో సంరక్షణ,జాగ్రత్త మరియు బాధ్యతాయుతమైన సంస్కృతి పెంపొందాలని ఆయన అన్నారు.బాధితుల పక్షాన నిలబడి,పారదర్శకతతో, జవాబుదారీతనంతో వ్యవహరించడం ద్వారా మాత్రమే శ్రీసభ తన సాక్ష్యాన్ని విశ్వసనీయంగా నిలబెట్టుకోగలదని పోప్ స్పష్టం చేశారు.
