దేవుని ప్రసన్నం చేసుకోవాలే గాని పరీక్షింపకూడదు

జోసెఫ్ అవినాష్
16 Jun 2026
సామాన్య 11వ బుధవారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 6:1-6,16-18
నేటి సువార్తా పఠనం ప్రధానంగా దాన విధానం, ప్రార్థన విధానం, ఉపవాస విధానం గూర్చి బోధిస్తోంది.
దాన విధానం:
ఏదో అడిగారు,ఏదో చేయాలి అనే మొహమాటంతో కాకుండా ప్రతి వ్యక్తి తనకు తోచినట్లు దానం చేయాలి (2 కొరింతి 9:7).
మనలో చాల మంది ఇతరులు నన్ను గుర్తించాలి.ఇతరులు నన్ను మెచ్చుకోవాలి, ఇతరులు నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అనే తలంపుతో దానధర్మాలు చేస్తుంటారు.ఇది దేవునికి అప్రియమైన ఆలోచన. ఒక వేళ అయ్యో ఇవ్వవలసి వచ్చిందే, ఫలానా వారి ఒత్తిడి వల్ల ఇస్తున్నానే అనుకుంటూ చేసే దానం నిష్ప్రయోజనం. దానిని దేవుడు మెచ్చడు. కాబట్టి దానధర్మాలు అయిష్టంతో కాకుండా ఇష్టంగా, ప్రేమతో, సంతోషంగా చేయాలి. అది కూడా ఆర్భాటాలకు పోకుండా రహస్యంగా చేయాలి. అపుడే దేవుని బహుమానం పొందుతాం.
ప్రార్థన విధానం:
ప్రార్థనలో మన నటనను ప్రభువు ఎత్తి చూపుతున్నాడు. మనలో అనేక మందిమి ఈ కోవకు చెందిన వారమే. ముఖ్యంగా మనం ఎప్పుడైతే సంఘ ప్రార్థనలకు వెళ్తామ్మో అది దేవాలయం కావచ్చు, పుణ్యక్షేత్రం కావచ్చు, వివాహవేడుక కావచ్చు ఏదైనా సరే సమూహంగా ఉన్న చోట కొందరు నిష్ఠగా భక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా కనిపిస్తారు. తమను వేరే వారు గమనించాలని తహతహలాడుతారు. అది ఒక నటన. ఈ నటన ద్వారా మనకు ఒరిగేది ఏమిలేదు. పైగా దేవుని ముందు నటిస్తే శాపగ్రస్తులమౌతాం. కనుక ఈ నటన మానుకోవాలి. మరి వ్యక్తిగతంగా, ఏకాంతంగా ప్రార్ధన చేస్తే దేవుడు మన హృదయాన్ని గుర్తిస్తాడు. బహుమానాలు ఇస్తాడు. ఏకాంతంలోను, సంఘ సభ్యుల బృందంలోనూ, దేవాలయాల్లోనూ దీనంగా, అర్థవంతంగా ప్రార్థించాలి. దేవుని ప్రసన్నం చేసుకోవాలే గాని పరీక్షింపకూడదు.
