నేటి పునీతులు: పునీత కజిన్ జెర్మెయినమ్మ

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

14 Jun 2026

ఫ్రాన్సుదేశంలో "తవుల్లోస్" అనే గ్రామం ఉంది. అక్కడ ఒక పేద వ్యవసాయ కుటుంబం ఉంది. వారు సామాన్య క్రైస్తవులు. ఆ కుటుంబంలో ఒక ఆడశిశువు జన్మించింది. జ్ఞానస్నానంలో జెర్మేయినమ్మ అని నామకరణం చేయించారు. వారినే జెర్మెయిన్ కజిన్ అనికూడ పిలుస్తారు. ఆ పాపకు పుట్టుకతో అవిటిచేయి. పైగా క్షయవ్యాధి సంబంధమైన ఒక విచిత్రమైన రోగంకూడ ఆమెను అంటి పెట్టుకొని పీడించింది.

ఇలా అవిటితనంతో రోగంతో అసహాయ స్థితిలో పెరుగుతున్న జెర్మేనమ్మకు. కన్నతల్లే అన్ని విషయాలలో తోడ్పడుతూ కంటికి రెప్పలా సాకింది. అట్టితల్లి అకాల మరణంతో జెర్మేన్ నిస్సహాయురాలైంది. దిక్కులేని వారికి దేవుడే దిక్కని ఆ ప్రభువునే ప్రార్థించుకొంటూ కాలం గడిపేది.

జెర్మేయినమ్మ తండ్రి ఇంకా యవ్వనంలోనే ఉన్నాడు. తనకు తోడుగాను పాపయొక్క ఆలన పాలనా చూసుకునేందుకుగాను ఒక యువతిని పెండ్లాడాడు. కాని ఆతని ఊహ తారుమారైంది. యవ్వనస్తురాలు, సుఖభోగాలనాశించే ఆ స్త్రీ జెర్మేనను కన్నతల్లిలా చూడలేక పోయింది. సవతితల్లిలానే ప్రవర్తిస్తూ ఎడమొహంపెడమొహంగా సాచివేత ధోరణి ప్రదర్శింపసాగింది. ఇల్లు ఊడ్చమని, అంటు పాత్రలు కడగమని పురమాయించింది. అనేక ఆంక్షలు విధించి రాచిరంపాన పెట్టింది. అవిటిపిల్ల పైగా బలహీనురాలైన రోగిష్టిదని కూడ చూడకుండ తిట్టేది. కొట్టేది. భర్త ముందుమాత్రం పాపను బాగా చూసుకుంటునట్లు వగలుపోయేది. జెర్మేన్ సవతితల్లిని విధేయించడానికే శతాథా ప్రయత్నించింది. వాస్తవాన్ని తండ్రికి తెలుపక పరలోకతండ్రికి మాత్రమే విన్నవించుకునేది. ఒక్కోసారి జెర్మేనకు కడుపునిండాతినడానికి మంచి భోజనంకూడ సవతి తల్లి పెట్టలేదు. పైగా "ఇంట్లో నాకన్నింటికి అడ్డమే" అని శాపనార్థాలు పెడ్తూ ఇంటిబైటే ఉండమని ఆ చిన్నారిని శాసించేది.

ఇట్టి దుస్థితిలో జెర్మెయినమ్మ జీవితమంతా బాధలమయంగా నెటుకొనుంది. సిలువధారియై కలువరిగిరి నెక్కిన క్రీస్తు శ్రమలనే ధ్యానించేది. తనకు 'ఓర్పు-నెమ్మది' అనే వరాన్నిమ్మని అధికాధికంగా ఒసంగమని ప్రభువును ప్రార్థించింది. దీనికి తోడు 'మౌనం-భక్తి'తో కూడిన జపతపాలు అలవర్చుకుంది. దివ్యసత్రసాదం లో కొనడమన్నా ఆ దివ్యనాధుని ఆరాధించడమన్నా ఎంతో ప్రీతి. దేవమాత యెడల ప్రత్యేక భక్తి కనబరచేది.

జెర్మేయినమ్మ తనకు చేతనైనంతమట్టుకు ఇంటిపనులన్నీ చేస్తూనే కొంత సమయాన్ని తీరిక చేసుకుని, గ్రామంలోని పిల్లల్ని ఒక చోట చేర్చి వారికి ప్రార్థనలు నేర్పించేది. ఏసుప్రభు బోధలను, మేరిమాత ఆదర్శంను కథలు, పాటల రూపంలో నేర్పించేది. ఈ విధంగా ఉపశమనం ఆథ్యాత్మిక ప్రశాంతత పొందేది. ఇంట్లో తనకు పెట్టబడే ఆ కాస్త భోజనంలో కొంత భాగాన్ని తనకంటే బీదస్థితిలో ఉన్నవారికి భిక్ష పెట్టేది. ఉపవాసంతో లేక అర్థాకలితో కాలం వెళ్లబుచ్చడం, తన అవిటితనపు నిస్సహాయతను క్రీస్తు విశ్వాసం కోసం భరిస్తూ పుణ్యం మూటగట్టుకునేది. ఆత్మ సంతోషంతో కళకళలాడేది.

జెర్మేనమ్మకు యుక్తవయస్సురాగా ఆమె తన సర్వస్వం దేవునికే అర్పితమై పవిత్రతకు ప్రాముఖ్యతనిచ్చింది. లోకాశలు సుఖభోగాలపై ఆసక్తి కనబరచక సుకృత జపములు, త్యాగక్రియలకే అంకితమైంది. అనేకులు పలికే దైవదూషణలు, చేసే దుష్క్రియలకు పరిహారము చేయనెంచి ఏసును మొర పెట్టుకునేది. ఫ్రాన్సుదేశంలోనే కాక ఎక్కడ కూడ క్రైస్తవంకు ఆపద రాకుండ శ్రీసభ మూడుపూవులు ఆరు కాయలుగా సుభిక్షంగా విలసిల్లాలని మౌన ప్రార్థనలు, బహిరంగ ప్రార్థనలు సల్పుతుండేది.

జెర్మేయినమ్మ ప్రార్థనా జీవితాన్ని, కన్యగానే కఠోరనియమాలతో నిష్ఠగా గడిపే విశుద్ధ బ్రతుకును సునిశిత దృష్టితో గమనించిన పెద్దలు, విశ్వాసులు ఏదో దివ్యశక్తి ప్రేరణవలన శ్రీ సభలో తలెత్తిన అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. మత విరోధులు అదుపులో ఉన్నారు. కతోలికులను అనేక ఆపదలనుండి తప్పింపబడి వివిధ మేలులతో ఆశీర్వదింపబడ్డారని, అందుకు జర్మేయినమ్మ అఖండ జపతపాలే కారణం" అని నమ్మారు. తమ దివ్య ప్రేరణలతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ భక్త కన్యామణి తన 22వ ఏట క్రీ||శ|| 1601లో ప్రభువునందు నిద్రించినది.

బాల్యం నుండి బాధలు, కష్టాలు, అవిటితనంవల్ల నిస్సహాయ ఆవేదనలు, త్యాగక్రియలు, ఎడతెగని ప్రార్థనలు, కన్యగా పవిత్రత కాపాడుకుంటుచేసిన ఉపవాస దీక్షలు విశ్వాస ప్రదర్శనకుగాను ఆమెకు పరలోకంలో గొప్ప బహుమానం ఇవ్వబడింది. శ్రీ సభకూడ కన్య జెర్మేనకు క్రీ||శ|| 1867 జూన్ 29న 9వ భక్తినాథ పోపుగారిచే పునీత పట్టానిచ్చి ఆమె ఆదర్శంను కొనయాడింది. ఆయమ్మ సమాధి ఉన్న 'పి బ్రాక్' దేవాలయం ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. జెర్మెయిన్ అనగా సోదరభావం, నిజమైన అని అర్థం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN