నేటి పునీతులు: పునీత మెడార్డ్

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
08 Jun 2026
పునీత మెడార్డ్ గారు ఫ్రాన్సుదేశంలో పికార్డీ ప్రాంతంలో క్రీ||శ|| 470లో పుట్టారు. వీరు గొప్ప దైవభక్తికలవారు. శ్రద్ధతో చదువుకొని సకలశాస్త్రాలలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. తమ యుక్తవయస్సులో ఉండగా, ఫ్రాన్సు ఈశాన్య ప్రాంతంలో ఉన్న వెర్మన్ పీఠాధిపతి క్రీ||శ|| 503లో మెడార్డ్ గారిని గురువుగా అభిషేకించారు. అనంతరం క్రీ||శ|| 530లో అదే పీఠానికి బిషప్పుగా వీరు నియమింపబడ్డారు. సరిహద్దుల సమీపంలోని అటవిక జాతులవారు తరచూ దాడులు జరపడంవల్ల సమీపంలో పటిష్టమైన కోటలతో ఉన్న 'నొయోఫా' పట్టణానికి తమ అధికార పీఠాన్ని మార్చుకున్నారు. దీనికి ఆనుకొని ఉన్న 'బెల్జియన్' పీఠం బిషప్పుగారు పునీత ఎలేవుతేరియస్ గారు క్రీ||శ|| 532లో స్వర్గస్థులవడంతో ఆ పీఠం బాధ్యతల్నికూడ మెడార్డ్ గారే నిర్వహించాల్సి వచ్చింది. ఈ విధంగా క్రీ||శ|| 600 సం||రం వరకు ఈ రెండు పీఠాలు కలిసేఉన్నాయి.
ఆ రోజుల్లో ఫ్రాస్సుదేశంలో గిరిజనులు అధిక సంఖ్యలో ఉండేవారు. వీరు అన్యదేవతలను ఆరాధించేవారు. ఆ విగ్రహాలు వికృత ఆకారాల్లో ఉండి వింతగా ఉండేవి. ఏవేవో
మూఢనమ్మకాలు, మూఢాచారాలతో బలులర్పిస్తూ, నృత్యాలుచేస్తూ విందులు వినోదాల్లో మునిగి ఉండేవారు. మెడార్డుగారు తమ అధికార పరిధిలో ఉన్న ప్రాంతాల్లో గల గిరిజనులను బాగా ప్రభావితంచేశారు. వారికి క్రీస్తు బోధలను విన్పింపచేసి క్రీస్తుశ్రమలను కండ్లకుగట్టినట్లు బోధించి నిజమైన దేవుడు ఈ విధంగా ఉండాలని దైవ లక్షణాలను తెలియజెప్పి, నిజ ఏక సర్వేశ్వరుని మాత్రము ఆరాధించాలని వారికి శతథా తెలిపారు. వివిధ దేవతాపూజలని అభిషేకాలని వారి తినుబండారాల్ని వృథాగా నేలపాలు చేసేవారు.
మెడార్డ్ గారు వారి మూఢనమ్మకాలను పోగొట్టి నాగరీకులుగాను, క్రీస్తు భక్తులుగాను మార్చేందుకు బహుళ ప్రయాస చెందారు.ఆ కాలంలో ప్రజాభిమానాన్ని సంపాదించిన బిషప్పులలో మెడార్డు ప్రథములని చెప్పవచ్చు. వీరు తమ మరణ శయ్యపై ఉన్నప్పుడు "క్లోటేర్" అను ఒక రాజు వీరి వద్దకు విచ్చేసి మోకరిల్లి హస్తాలను ముద్దాడి, తానుచేసిన పొరపాట్లను క్షమింపమని వేడుకున్నాడు. మంచి క్రైస్తవ విశ్వాసిలా జీవింప మాటయిచ్చాడు. మోటార్డ్ గారు తన 88వ ఏట తమ వృద్ధాప్యంలో దేవుని స్మరించుకుంటు క్రీ.శ|| 558లో పరలోక ప్రాప్తినొందారు.
ఉత్తర ఫ్రాన్సులోని భక్తులు పునీత మెడార్డ్ గారిని భక్తితో స్మరిస్తారు. వేనోళ్ల కొనియాడతారు. వారు తమ నాయకులుగా
ఉంటూ, తమ జీవితాలను మెరుగుపరచుటకు చేసిన ఘనకార్యాల్ని ప్రజలు నేటికీ గొప్ప కథలుగా చెప్పుకుంటారు. పునీత మెడార్డుగారిని ఫ్రెంచి దేశీయులు వర్షం రప్పించే పాలక పునీతులుగా వేడుకుంటారు. వీరి పండుగరోజైన జూన్ 8వ తేదీన వర్షం పడినట్లయితే మరలా నలభై రోజులకు వర్షం తప్పక కురుస్తుందని వారి బలమైన విశ్వాసం.
