పరలోక బహుమానాన్ని అందుకుందాం

జోసెఫ్ అవినాష్
08 Jun 2026
సామాన్య 10వ సోమవారం
సువిశేష ధ్యానం:
మత్తయి 5:1-12
"పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు కావున ఆనందపడుడు మహానందపడుడు"
యేసుక్రీస్తు దైవరాజ్య విస్తరణలో భాగంగా ప్రజలకు బోధించిన వాక్కులు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించేవి కావు అవి మన సంపూర్ణ జీవితానికి ఉపకరించే జీవిత సత్యాలు.అందుకే ఈ అష్టభాగ్యాలు అందరిచేత అంగీకరించబడినాయి.అత్యంత ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి వీటిని వారి వారి జీవితాల్లో కలిగి ఉండడం ద్వారా మూర్తీభవించిన క్రీస్తు మనస్తత్వాన్ని ధరిస్తాము. "క్రీస్తుయేసు నందు మీదైనా ఈ మనస్తత్వాన్ని మీ మధ్య ఉండనిండు" (ఫిలిప్పీ 2:5). ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు మనస్తత్వాన్ని కలిగి ఉంటాడో అతడు తన జీవితంలో దీనత్వం,వినమ్రత, నీతికార్యాలు,దయాగుణం, నిర్మల హృదయం కలిగి శాంతిస్థాపన కోసం,ధర్మం కోసం,న్యాయం కోసం శ్రమిసాడు.అందుకే యేసుప్రభువు తాత్కాలిక బోధన చేయకుండా శాశ్వత మార్గాలను తన బోధనల ద్వారా చూపించాడు.కాబట్టి ప్రతి క్రైస్తవుడు సంపూర్ణ, శాశ్వత జీవితానికి శ్రమించాలి. ఎప్పుడైతే మన పరలోక పౌరులం అని,ఈ లోకం శాశ్వతం కాదని గ్రహిస్తామో (ఫిలిప్పీ 3:20) ఈ అష్టభాగ్యాలను కలిగి జీవిస్తాం. పరలోక బహుమానాన్ని పొందుతాం.అందుకే మహాత్మా గాంధీ,స్వామి వివేకానంద, బాబాసాహెబ్ అంబెడ్కర్ మొదలగు ఎంతో మంది మేధావులు యేసుక్రీస్తు బోధించిన అష్టభాగ్యాలను గుర్తించారు,శ్లాఘించారు. వీటిని పాటిస్తే మనిషి మహోన్నతుడౌతాడని బోధించారు.కాబట్టి ఇహలోక జీవితం కొరకు కాకుండా పరలోక శాశ్వత జీవితానికి ఈ అష్టభాగ్యాల ద్వారా పునాదులు వేసుకుందాం. పరలోక బహుమానాన్ని అందుకుందాం.
