దివికేగిన మల్లవరపు ప్రకాష్ తండ్రిగారు

జోసెఫ్ అవినాష్
07 Jun 2026
విశాఖ అగ్ర పీఠ విశ్రాంత పీఠాధిపతులు మహా ఘన. మల్లవరపు ప్రకాష్(77) తండ్రి గారు జూన్ 7న అనగా ఈనాడు తెల్లవారుజామున 2:30 గంటలకు శ్వాసకోశ సమస్యలతో ప్రభువు నందు నిద్రించారు.
1949 జనవరి 29న నిజామాబాద్ జిల్లాలోని జాడీజమాల్‌పూర్ గ్రామంలో అంతయ్య,అన్నమ్మ దంపతులకు ప్రకాష్ మల్లవరపు గారు జన్మించారు.దైవ పిలుపును అందుకుని 1979 అక్టోబర్ 11న గురుత్వ అభిషేకం పొందారు. 1998- 2002 వరకు కడప పీఠాధిపతిగా, 2002 - 2012 వరకు విజయవాడ పీఠాధిపతిగా,2012 నుండి 2024 వరకు విశాఖ అగ్ర పీఠాధిపతిగా విశిష్ట నాయకత్వం వహించారు.అలాగే తన పదవీకాలంలో ఏలూరు, శ్రీకాకుళం పీఠాలలో అపోస్తలిక పరిపాలనాధికారిగా కూడా తన విశిష్ట సేవలందించారు.అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్యలోని పలు విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించి దేశవ్యాప్తంగా శ్రీసభ బలోపేతానికి విశిష్ట కృషి చేశారు.
విశాఖ అగ్ర పీఠాధిపతిగా సేవలందించిన కాలంలో ఎన్నో నూతన విచారణలు,దేవాలయాలు,పాఠశాలలకు పునాదులు వేశారు.అనేక సామాజిక,ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలకు దిశానిర్దేశం చేశారు.నిరాడంబర జీవితం, వినయం,అందరినీ ఆప్యాయంగా పలకరించే స్వభావం, పేదలు మరియు అణగారిన వారిపట్ల చూపిన ప్రేమ ఆయనను విశ్వాసుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపాయి. తండ్రి గారి ఆత్మ శాంతికై మనమంతా ప్రార్థిద్దాం.
