కృత్రిమ మేధస్సు గురించి వివరిస్తూ పోప్ వ్రాసిన సందేశ పత్రాన్ని ప్రశంసించిన భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య
జోసెఫ్ అవినాష్
05 Jun 2026
కృత్రిమ మేధస్సు(AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో,మానవ గౌరవం మరియు వ్యక్తిత్వాన్ని కాపాడటం అత్యంత ముఖ్యమని తెలియపరుస్తూ,కృత్రిమ మేధస్సు వల్ల కలిగే లాభ నష్టాలను చర్చిస్తూ,విశ్వ కాపరి పోప్ లియో XIV "Magnifica humanitas: On Safeguarding the Human Person in the Time of Artificial Intelligence".పేరుతో తన తొలి అధికారిక సందేశ పత్రాన్ని విడుదల చేసిన విషయం విధితమే.అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య కృత్రిమ మేధస్సుపై స్పందిస్తూ పోప్ విడుదల చేసిన సందేశ పత్రాన్ని ప్రశంసిస్తూ,ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి సమాఖ్య అధ్యక్షులు హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు కార్డినల్ మహా ఘన పూల అంతోని తండ్రి గారు అధ్యక్షత వహించారు.పోప్ సందేశ పత్రాన్ని కృత్రిమ మేధస్సు (AI) యుగంలో మానవ గౌరవాన్ని కాపాడే శక్తివంతమైన నైతిక దిక్సూచిగా అంతోని తండ్రిగారు అభివర్ణించారు.సాంకేతిక పురోగతి ఎంత వేగంగా జరిగినా, అది మానవ వ్యక్తిత్వం,స్వేచ్ఛ,న్యాయం మరియు సమాజ శ్రేయస్సుకు సేవ చేయాలే గాని వాటిని దెబ్బతీయకూడదని ఈ పత్రం గుర్తుచేస్తుందని వారు తెలిపారు.AI అభివృద్ధి లాభం,అధికారం లేదా యుద్ధ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రతి మనిషి గౌరవాన్ని కేంద్రంగా ఉంచుకొని జరగాలని పోప్ పిలుపునిచ్చారని భారత పీఠాధిపతులు ప్రశంసించారు.నేటి డిజిటల్ యుగంలో ఈ బోధనలు కేవలం కతోలికులకు మాత్రమే కాకుండా,మొత్తం మానవ సమాజానికి ఒక నైతిక దిక్సూచిగా నిలుస్తాయని పీఠాధిపతులు పేర్కొన్నారు.
