నేటి పునీతుడు : పునీత బొనిఫాసు

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
05 Jun 2026
యూరపుఖండ మధ్యప్రాంతంలోని జర్మనీ దేశ కొండజాతి ప్రజలలో క్రైస్తవం విస్తరించిందంటే ఆ కృషిఫలితమంతా పునీత బొనిఫాసుగారికే దక్కుతుంది. అందుకే వారికి 'జర్మనీ దేశ అపోస్తలుడు' అని బిరుదుకూడ వచ్చింది. వారు ఇంగ్లాండు దేశంలోని డేవన్ షైర్ నగరంలోని క్రెడిటన్ అను పేటలో క్రీ||శ|| 673లో జన్మించారు. జ్ఞానస్నానం పేరు విన్-ఫ్రిడ్.
వారు చిన్నప్పుడు కొందరు సన్యాసి గురువులు వారి ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవారు. వారి సంభాషణలు వినడం ద్వారా వారివలె తానుకూడ పెద్దయ్యాక మంచి క్రైస్తవ గురువుకావాలనే దైవ పిలుపు వారి హృదయంలో ఒక నిప్పుకణికలా ఉండిపోయింది. వారు ఏడవఏట ఎట్టర్ అనే గ్రామం దగ్గరలోని ఒక మఠపాఠశాలలో చేరి చదువుకున్నారు. తమ 14వ ఏట శిశుకేంద్రం నిర్వహిస్తున్న ఒక బెనెడిక్టియను మఠంలో ప్రవేశం పొందారు. అక్కడ మఠాధిపతియైన విన్ బెర్ట్ గారికి శిష్యరికంచేసి పై చదువుల్లో నెగ్గి ఆ మఠ డైరెక్టరుగా కూడ నియమితులు కావడం విశేషం. విన్ ఫ్రిడ్ గారు సాహిత్యం, సువార్తలను బోధించడంలో నిష్ణాతులని పేరుగడించారు. క్రీ|| శ|| 715లో గురుపట్టం పొందారు.
ఫాదర్ విన్-ఫ్రిడ్ గారికి ఫ్రీస్ లాండు (ఉత్తర నెదర్లాండు)లో అధిక సంఖ్యలో తమ బంధువులైన ఆంగ్లో శాగ్సనులున్నారు. వారిని ఎలాగైనా క్రైస్తవంలోకి తీసికొనిరావాలని తీవ్ర వాంఛ కలిగి ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఆంగ్లేయ గురువులు అక్కడ పనిచేస్తున్నారు. తానుకూడ వెళ్లి 3 సం||లు పనిచేశారు. ఒకసారి ఫాదర్ విన్ ఫ్రీడ్ రోముసందర్శించినప్పుడు క్రీ॥ శ|| 718లో 2వ గ్రెగోరి జగద్గురువులు వారిని జర్మనీ వెళ్లి క్రీస్తు సందేశం విన్పించాలని కోరారు. అందుకు విధేయించి వారు జర్మనీ వెళ్లగా అక్కడి పాలకులు వారిని సాదరంగా ఆహ్వానం పలికారు. ఫాదర్ విన్ ఫ్రిడ్ గారు సాహిత్య ప్రకాండుడు కావడాన అక్కడి ప్రజలకు అర్ధమయ్యే భాషలో, యాసలో మాట్లాడటం మొదలు పెట్టారు.
జర్మనీదేశంలో హెస్సియాపట్టణ ప్రాంతంలోని కొండజాతి ప్రజలు ఏవో దబ్బరదేవుళ్లను పూజిస్తుండేవారు. వారిలోని మూఢనమ్మకాల్ని, అజ్ఞానాన్ని తొలగిస్తే వారిని సరియైనగాటిలో పెట్టవచ్చని తలంచారు ఫాదర్ విన్ ఫ్రీడ్. అందుకు ముందుగా గిస్మర్ పట్టణం దాపులోని గూడెన్బర్గ్ పర్వతం పైగల ఒక సిందూరపు వృక్షం దగ్గరకు ఒక గొడ్డలి తీసికొని వెళ్లారు. అక్కడి కొండజాతి జనం ఆ చెట్టుకు ఎంతో ఇదిగా పూజలు చేస్తుండేవారు. సృష్టికర్త దైవంను విడిచి సృష్టి వస్తువులైన చెట్లు, జంతువులు, గ్రహాలను పూజించి ప్రయోజనం లేదని వారికి నచ్చజెప్పారు. అన్నిచెట్లవలె ఆ సిందూరపు చెట్టుకూడ ఒకటని, దాన్ని నరికినా ఏమీకాదని అర్థమయ్యేలా చెప్పారు. పిమ్మట తన చేతిలోని గొడ్డలితో ఆ చెట్టును నరకడం మొదలు పెట్టారు. ఎలాంటి కీడు జరగకుండ ఆ చెట్టు కూలిపోయింది. ఆ ప్రజల అతి విశ్వాసాలన్నీ భ్రమలని, కల్పితాలని అర్థంచేసుకుని వస్తుపూజ విసర్జించారు. ఆ క్రైస్తవగురువును వెంబడించి క్రైస్తవమతావలంబికులై జ్ఞానవంతులయ్యారు. ఇక ఫాదర్ గారు తమ సువార్తా పనిని కొనసాగింప తురంగియా పట్టణం చేరుకున్నారు.
క్రీ||శ|| 722లో 2వ గ్రెగొరి జగద్గురువులు ఫాదర్ వి ఫ్రీడ్ గార్ని రప్పించుకొని జర్మనీకంతటికి పీఠాధిపతిగా వారిని అభిషేకించి, క్రొత్తపీఠాలు నెలకొల్పడం వాటికి బిషప్పులను ఏర్పరచడానికి పూర్తిహక్కును ప్రసాదించారు. ఆ సమయంలోనే ఫాదర్ విఫ్రి గారు తమ పేరుకు లాటిను అర్థంలో బిషప్ బొనిఫాసుగా మార్చుకున్నారు.
నూతనోత్సాహంతో విచ్చేసిన బిషప్ బొఫాసుగారు జర్మనీలోని గురువులు మఠవాసినులందరిని ప్రేమతో కూడగట్టుకొని క్రైస్తవ మతవ్యాప్తికి విశేషంగా కృషిసల్పారు. మఠాలయాలు అనేకం నెలకొల్పారు. ముఖ్యంగా ఒహుద్రుఫ్, రిచెన్, ముర్బక్, ఫ్రిడ్జ్ లర్, ఫుల్గా అనే పట్టణాలలో క్రైస్తవ మఠాశ్రయాలు తెరిచారు. విశ్వాసాన్ని, నాగరికతను ప్రజలకు నేర్పించారు.
క్రీ||శ|| 747లో మెయింజ్ నగరం అగ్రపీఠంగా నెలకొల్పబడి దానికి అగ్రపీఠాధిపతిగా బొఫాసుగార్ని నియమిస్తూ పునీత జకరిపోపుగారు ప్రకటించారు. జర్మనీ, గౌల్ రాజ్యాల తరపున వారే అపోస్తోలిక ప్రతినిధిగా వెల్లడించారు. జర్మనీ, ఫ్రాన్సుల్లో బొనిఫాసుగారు పీఠాల్ని, మఠాల్ని సంస్కరించి చైతన్యవంతంచేశారు. ఫ్రాన్సు రాజ్యపాలకుల్ని క్రైస్తవంలోకి వచ్చేలా చేశారు. "జర్మనీ పౌలు"గా పేర్గాంచారు.
క్రీ||శ|| 754లో జూన్ 5న పెంతెకోస్తు పండుగ రోజున ప్రీ లాండు (ఉత్తరహాలెండు)లోని దుక్కుం పట్టణంలో ఒక డేరాలో కొందరు విశ్వాసులకు భద్రమైన అభ్యంగమునకు తయారు చేస్తుండగా అవిశ్వాసులగుంపు దాడిచేసి డేరాకు నిప్పు పెట్టారు. 12 మంది గురువుల్ని, 40 మంది భక్తుల్ని చంపారు. బొఫాసుగారి మృతదేహం పుల్గా పట్టణంలో సమాధి చేయబడింది. తాను విశ్వసించిన శ్రీసభవిశ్వాసం కోసం వారు ప్రాణాలర్పించారు. వారు ఈ విధంగా వ్రాశారు. "ప్రపంచ సాగర ప్రయాణంలో శ్రీ సభ అనే ఓడకు జీవిత ఆటుపోటులు తప్పవు. అందువల్ల ఓడను త్యజించడంకాదు కొనసాగించడం మనవిధి." 9వ పయస్ (భక్తినాథ) పోపుగారు క్రీ||శ|| 1874లో వారికి పునీత పట్టం అలంకరించారు. బోనిఫాస్ అనగా బాగుగా పనిచేయు వ్యక్తి అని అర్థం.
