తిరు హృదయ చిత్రపటం - విశేషాలు

జోసెఫ్ అవినాష్

01 Jun 2026

మన కతోలిక పుణ్యక్షేత్రాలలో క్రీస్తు తిరు హృదయ స్వరూపాలు మరియు చిత్రపటాలు మనకు కనిపిస్తాయి. ఈ స్వరూపాలను, చిత్రపటాలను క్షుణ్నంగా గమనించినట్లయితే అగ్ని జ్వాలలతో మండుచున్న యేసుక్రీస్తు హృదయం, దాని చుట్టూ ఒక ముళ్ళ కిరీటం, దాని నుండి పైకి వెలువడు సిలువ, హృదయం చుట్టూ కాంతివంతంగా ప్రకాశించు వెలుగు కిరణాలు మనకు కనిపిస్తాయి. అయితే వీటిలో దాగి ఉన్న గుర్తులు చాలా లోతైన అర్థాలను ఇస్తూ ఉన్నాయి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం-:

1. అగ్ని జ్వాలలు-:
పరిశుద్ధ గ్రంథంలో అగ్ని దైవానికి గుర్తుగా ఉన్నది. అదే విధముగా అగ్ని దేవుని సన్నిధిని సూచిస్తుంది. ఉదాహరణకి మండుచున్న పొదలో అగ్నియై దేవుడు మోషేతో సంభాషించారు(నిర్గమ 3:13), ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలను అగ్ని స్తంభ రూపంలో ముందుండి నడిపించారు(నిర్గమ 13:21). ఎలీషా బలిని అగ్ని రూపంలో పై నుండి దిగి వచ్చి దహించారు(1రాజులు 18:30-33). పెంతుకోస్తు పండుగ నాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు అగ్ని నాలుక రూపంలో అపోస్తుల పైకి వేంచేసి వచ్చారు.(అపో.కా 2:3)

పునీత మార్గ్ రేట్ మరియమ్మ గారికి కలిగిన దర్శనంలో క్రీస్తు నాధుని తిరు హృదయం అగ్ని జ్వాలలతో రగులుతున్నది. అగ్నిజ్వాలలు ప్రేమకు చిహ్నం. క్రీస్తు నాధుని పరిశుద్ధ హృదయం మానవుల పట్ల ప్రేమాగ్ని జ్వాలలతో మండుచున్నది.

2. వెలుగు కిరణాలు-:
క్రీస్తు నాధుని పరిశుద్ధ తిరు హృదయం చుట్టూ వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయి. లోకానికి వెలుగు క్రీస్తేనన్న సత్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. సౌలు క్రీస్తు దివ్య వెలుగును చూసి పౌలుగా మారి గొప్ప సాక్షిగా చరిత్రకెక్కారు. మనం కూడా ఆ వెలుగు బాటలో పయనించాలి.

3.బాణం-:
రోమన్ పురాణంలో "కుపిడ్" అనే ప్రియుడు బాణం వదిలి తన ప్రియురాలికి తన ప్రేమను తెలిపాడు." బాణం గుచ్చుకున్న గుర్తు" మన పై ప్రభువుకున్న ప్రేమకు,దయకు,కరుణకు గుర్తు. మనం చేస్తున్న పాపాలు ఇలా బాణం రూపంలో ప్రభువు హృదయానికి గుచ్చుకుని తీవ్రంగా బాధిస్తున్నాయి.

4. ముళ్ళ కిరీటం-:
నాడు క్రీస్తు శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టబడింది.నేడు ఇదే ముళ్ళ కిరీటం తిరు హృదయ దర్శనంలో హృదయం చుట్టూ కనిపిస్తున్నది.. ఈ ముళ్ళ కిరీటంలో ఒక్కొక్క ముళ్ళు మనందరి ఒక్కొక్క వ్యక్తిగత పాపాన్ని సూచిస్తున్నది.. ముల్లులా ఆ పాపాలు తిరు హృదయాన్ని గాయపరుస్తున్నాయి. కాబట్టి పాపాలకి దూరంగా ఉందాం ఆ తిరు హృదయానికి ఓదార్పును చేకూర్చుదాం.

5.సిలువ-:
కల్వరిలో క్రీస్తుకు కొట్టబడ సిలువ ప్రభువు దేహంలో భాగంగా బరువెక్కిన ఆయన తిరు హృదయాన్ని కూడా మోసింది. నాడు సిలువ చాలా పెద్దది. హృదయం చాలా చిన్నది. నేడు ఆ తిరు హృదయం నుండి సిలువ పైకి ఉద్భవిస్తున్నది. హృదయం పెద్దదిగా సిలువ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఆ హృదయమే మనకోసం శ్రమల సిలువను ప్రేమతో మోసింది.ఆ కరుణా హృదయం నుండే సర్వ మానవాళికి రక్షణ లభిస్తుంది. ఇవి ఆ చిత్ర పటంలో ఉన్న గుర్తులకు లోతైన అర్ధాలు..

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN