నీ పయనమెటు వైపు?

జోసెఫ్ అవినాష్
31 May 2026
సామాన్య తొమ్మిదవ సోమవారం
2 పేతురు 1:2-7
కీర్తన 91:1-2, 14-15, 15,16
మార్కు 12:1-12
ధ్యానం:
దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకొని,దేవుని ప్రణాళికను గుర్తించని యూదా జాతి ప్రజలు క్రీస్తు అధికారాన్ని ప్రశ్నించారు.మరి ఈనాటి సువార్త భాగం వారి అవిధేయత,ధిక్కారం,వారి పాపం వారిని ఎంత దూరం తీసుకోని వెళ్తుందో తెలియజేయడం కోసం యేసు వారికి భూస్వామి - కౌలుదార్లు ఉపమానం చెప్పారు.
చాలాసార్లు మన జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చే వాటికి ప్రాధాన్యాన్ని ఇవ్వక, తాత్కాలిక స్థితినే ఆస్వాదిస్తూ దానినే శాశ్వతమని భావిస్తాం. ఇది అజ్ఞానం.అవగాహన లోపం.ఒక విషయాన్ని గూర్చి అన్నీ తెలిసినప్పటికి, అది ఎంత ముఖ్యమో గ్రహించ గలిగినప్పటికి ఏమరుపాటుగా జీవిస్తూ అసలు విషయాన్ని విడిచిపెడతాం.ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఇదే జరిగింది.
మనిషిని ప్రేమించిన దేవుడు మనిషికి కావలసిన ప్రతిదీ సమకూర్చి ఈ లోకంలో ప్రతిష్టించాడు. తన సుందర జీవితాన్ని సుఖమయం చేసుకున్న మనిషి దేవుని మరచి పాప సాంగత్యంలో జీవించడం మొదలుపెట్టాడు. ఆ పాప జీవితం నుండి మనిషిని బయటపడేయడానికి తిరిగి మనిషి జీవితాన్ని నిర్మించడానికి తన సేవకులను ఎంతోమందిని వారి మధ్యకు పంపాడు.కానీ వారు వారిని తిరస్కరించారు.చివరికి తన కుమారుడ్ని పంపిన ఫలితం లేకపోయింది.ఆ సమయంలో దేవుడు స్వయంగా వచ్చి దుష్టులను శిక్షించి వారికిచ్చిన అవకాశాన్ని వేరే వారికి ఇస్తున్నాడు.ఎవరైతే దేవుని ప్రణాళికలో లేరో వారికి రక్షణ అవకాశం ఇస్తున్నాడు. "ఇల్లు కట్టువారు త్రోసి వేసిన రాయి ముఖ్యమైన రాయి ఆయెను” (మార్కు 12:10-11) దేవుని ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరం!మనం గ్రహించ వలసిందేంటి?: ఇశ్రాయేలు ప్రజల వలే ఏమరుపాటుతో జీవించక దేవుడిచ్చిన అవకాశాన్ని గుర్తించాలి. - యూదా జాతి తమ జీవితంలో దేవుని అధికారం ఏంటి? మా మీద ఆయనకున్న హక్కు ఏంటని దేవుని సేవకులను, దేవుణ్ణి ధిక్కరించారు.కానీ మనం మన జీవితం ఆయన పెట్టిన భిక్షగా గుర్తించి మారుమనస్సుతో ఆ ఘడియ కోసం వేచి ఉండాలి. - ఇశ్రాయేలు ప్రజలు వారికిచ్చిన అవకాశాన్ని కలదన్నుకున్నారు. మరి క్రైస్తవులమైన మనం మనకిచ్చిన అవకాశాన్ని కలదన్నుకుంటే మనకు రావాల్సిన అనుగ్రహాలు వేరే వారికి అనుగ్రహించబడతాయి. మరి నీ పయనమెటు వైపు...
