నిండైన జీవితం - త్రిత్వైక దైవం

Fr. Sesetti Mariadas M.S.F.S.

30 May 2026

నేడు మనం పరమ పవిత్ర త్రీత్వ దేవుని ఆదివారాన్ని కొనియాడుతున్నాం. త్రీత్వదేవుడు క్రైస్తవ విశ్వాస సత్యాలలో కీలకమైన విశ్వాస సత్యము. క్రైస్తవ విశ్వాసానికి, జీవితానికి కేంద్రబిందువు. దేవుని గూర్చిన నిగూఢ సత్యం. విశ్వాస సత్యాల క్రమంలో అత్యంత మౌలికమైన, ప్రధానమైన ఉపదేశం. దేవుడు తనలో ఏమైవున్నాడో తెలియపరచు విశ్వాస సత్యం. అయితే, దేవుడు మనకు అంతగా తెలియని మర్మం. మనకు అందనివాడు దేవుడు. స్వయాన మన బుద్ధిశక్తులనుపయోగించి ఆయనను తెలుసుకొనలేము. ఒక చిన్న జీవి, చీమ, మనిషిని గూర్చి గ్రహింపలేదు. చీమ మనిషి అవ్వాలి లేదా మనిషే దయదలచి చీమ అవ్వాలి. అప్పుడే చీమ మనిషిని గ్రహించగలగుతుంది. దేవుని అర్థం చేసుకొనువిషయంలో మనిషి గతీ అంతే !

భక్త అగస్తీను మహా మేధావి, వేదాంతి. సుమారు 21 సం||లు సుధీర్ఘ ధ్యానం చేసి 'దేత్రినిలౌస్' అనే ఉపగ్రంథాన్ని వ్రాసాడు. తను ధ్యానం చేస్తు ఒక రోజు సముద్ర తీరాన నడుస్తున్నాడు. ఒక చిన్న అబ్బాయి చేస్తున్న పనిమీద అతని దృష్టి మళ్ళింది. ఆ అబ్బాయి, తన చిన్న చేతిలో ఒక చిన్న సముద్ర గవ్వను పట్టుకొని సముద్రం లోనికి వెళ్ళి గవ్వనిండా నీరు పట్టుకొని వచ్చి తను త్రవ్విన చిన్న రంధ్రంలో వేస్తున్నాడు. అగస్తీను అబ్బాయి పిచ్చితనాన్ని చూసి నవ్వుకొన్నాడు. “అంత పెద్ద సముద్రాన్ని నీ చిన్న గవ్వతో ఈ రంధ్రంలోనికి ఎలా మోస్తావు?” అన్నాడు. అగస్తీనుని చూస్తూ, “నీవు కూడా చేస్తున్నది ఇదే!” అన్నాడట. అప్పుడు అగుస్తీనుకు కనువిప్పు కలిగింది. తన బుద్ధి బలంతో దేవున్ని గ్రహించడానికి ప్రయత్నంచడం ఎంత అవివేకమో తెలుసుకొన్నాడు. దేవుని మర్మం మనకు అతీతం.

దేవుని అంతరంగ జీవితం మహా మర్మం. ఒకే దేవుడు, ఆయనలో ముగ్గురు వ్యక్తులు. వారు స్వభావంలోను, వైభవంలోను సరిసమానులు. వ్యక్తిత్వంలో భిన్నమైన వారు. ఏకత్వము, మాటల గారడీలా వుంది. అయినా, అనాధిగా, విశ్వాసుల సంఘం దీనిని మనసార నమ్మింది. ఈ విశ్వాస సత్యం గూర్చి మనకు తెలిసింది గోరంతే. తెలియనిది కొండంత. వాస్తవానికి, తెలిసింది మర్మమే కాదు. దేవుడు మర్మమయితే మనకు ఆయన అంతరంగ అస్థిత్వం తెలియదనే చెప్పాలి. కాని అర్థం కాని విషయాన్ని నమ్మడం ప్రయోజనమేమోగానీ, దాని ప్రభావం తక్కువగా వుంటుంది. మర్మాలు వివరణకు అందనివి. వాటిన హత్తుకోవాలి. అదే మనం చేయగలిగేది. మర్మాల్ని సమస్యలుగా గుర్తించి శోధించదలిస్తే, దాని వలన ఫలితం లేదు. అవి పజిల్స్ గానే మిగిలిపోతాయి. కాని వాటిని అంగీకరించి హత్తుకొంటే, ఆనందమయ జీవితానికి బాటలు వేస్తాయి. మనిషికున్న మేధో అహంకారం వలన సర్వం తన బుద్ధి శక్తికి జోహారు కావాలనుకొంటాడు. అన్నీ స్పష్టంగా, తేటతెల్లంగా నుండాలను కొంటాడు. సమస్తం తన ఆధిపత్యం క్రింద నుండాలనుకొంటాడు. సందేహంతో నుండడం, సందిగ్ధతతో నుండడం, చీకట్లో నుండడం మనకు కొరకుపడదు. కాని వాస్తవం దీనికి భిన్నం.

శోధించే కొద్ది మరిన్ని మర్మాలు బయలుపడుతున్నాయి. విషయం ఏమిటంటే, మన చుట్టూ మర్మాలున్నాయి. మనమే ఒక మర్మం. మానవ స్వభావం ఒక మర్మం. ఎంత సన్నిహితంగానున్నను, ఇతరులు మనల్ని అర్థం చేసుకోలేరు. మన పరిస్థితీ అంతే! మర్మాన్ని అంగీకరించకపోతే వచ్చే ప్రతిఫలం మానసిక సమాధానాన్ని కోల్పోవడం మాత్రమే. నిజానికి, మర్మాల్ని అంగీకరించడమే సమాధానానికి చక్కని సోపానం. అలాగని, మనం మర్మాన్ని అర్థం చేసుకొనడానికి ప్రయత్నించకూడదని కాదు. సాధ్యమైనంతగా తెలుసుకోవాలి. కాని ఎంత తెలుసుకొన్నా చివరకు మిగిలేది మర్మమే. దీనిని గూర్తించాలి. అది వివేకం.

దేవుడు బయలుపరిస్తేనే తప్ప, దేవునిలో దాగియున్న మర్మాలు ఏనాటికీ తెలీవు. సాక్షాత్తు దేవుడే మన మధ్య యేసుని రూపంలో వెలిసి, తన తత్వాన్ని జీవించి చూపాడు, చెప్పాడు, నేర్పాడు. యేసు కనిపించని దేవుని అచ్చమగు రూపం. కొలొస్సీ 1:15. ఆయన నైజాన్ని కలిగినవాడు. హీబ్రూ 1:3. దేవుని, తండ్రి కుమార పరిశుద్దాత్మలుగా శిష్యులకు పరిచయం చేసాడు. “పరమందున్న తండ్రి పరిపూర్ణుడు. మీరును పరిపూర్ణులుకండు” అని అన్నాడు. మత్త. 5:48. ఆయన కనికరాన్ని గూర్చి బోధించుట తనకు తండ్రితోను సన్నిహితత్వంను గూర్చి బయలుపరచాడు. “తండ్రీ నాయందును, నేను తండ్రియందును ఉన్నాము”, “నన్ను చూచువాడు తండ్రిని చూచు చున్నాడు”. ఆయన తండ్రి నుండి వచ్చియున్నాడని తెలియపరచాడు. తన్ను స్వీకరించువాడు ఆయనను పంపిన వానిని స్వీకరించుచున్నాడన్నాడు. ఆ తండ్రి అడిగిన వారికి ఆత్మను దానం చేస్తాడన్నాడు. ఆత్మ సమాధానకర్త. సర్వం తేటతెల్లం చేసేవాడు. సహవాసం చేసేవాడు. ఈ విధంగా యేసు తండ్రిని, ఆత్మను పరిచయం చేసి, తనను కుమారునిగా బయలు పరచుకొన్నాడు. యోధాను నదిలో బాప్తిస్మ సంధర్భంగా, తండ్రి వాణి యేసుని కుమారునిగా తెలియ చేసింది. ఆత్మ పావుర రూపాన దిగివచ్చింది. పునరుత్థాన క్రీస్తు శిష్యులను, పిత పుత్ర పవిత్రాత్మల నామముల జ్ఞానస్నాన మిచ్చుచు సర్వులను తన శిష్యులను చేయుమని కర్తవ్య బోధ చేసాడు.

యేసుని బోధను స్వీకరించిన శిష్య సంఘం త్రీత్వ తత్వాన్ని జీవించ ప్రయత్నిం చింది. త్రిత్వం ప్రేమబంధం. ఈ ప్రేమ బంధాన్ని అన్యోన్య ప్రేమద్వారా జీవించ ప్రయత్నించారు. కొన్ని శతాబ్దాల తరువాత సంఘ విశ్వాసాన్ని వేదాంతులు స్పష్టీకరించడానికి ప్రయత్నాలు చేసారు. ఈ ప్రయత్నంలో బుద్ధి తర్కాలు ఎక్కువగా వినియోగించబడ్డాయి. దేవుడు తర్కాలనకు చిక్కని వాడు కదా! అయినా మొదటి 5 శతాబ్దాలలో అనేక వేదాంత మహా సభలలో త్రీత్వంను గూర్చిన సిద్ధాంతీకరణలు ఊపందుకున్నాయి. దేవుడు ఒక్కడే, ఒంటరి కాదు, ఆయనలో వ్యక్తులున్నారు. వారు వేరువేరు. తండ్రి కుమారుడు కాదు. కుమారుడు తండ్రి కాదు. తండ్రి, కుమారుడు పవిత్రాత్మ కాదు. దివ్యత్వంలో ఏకత్వం. త్రియేకం అఖండం, అవిభాజ్యం. అందువలన కుమారునిలో, పవిత్రాత్మలో తండ్రి సంపూర్ణంగా వున్నాడు. తండ్రిలో, పవిత్రాత్మలో కుమారుడు సంపూర్ణంగా నున్నాడు. తండ్రిలో, కుమారునిలో పవిత్రాత్మ సంపూర్ణంగా నున్నాడు. మానవరక్షణ, నరావతారం మున్నగు దివ్యకార్యాలన్నింటిలోను ముగ్గురు వ్యక్తులు సమిష్టిగా పాల్గొంటారు. ఉమ్మడిగా చేస్తారు. ఈ సృష్టి జాలమంతా పవిత్ర త్రీత్వంలోని సంపూర్ణ యేకత్వంలో ప్రవేశిస్తుంది. ఇది దివ్యకార్యకలాపాల అంతిమ ధ్యేయం. మన మందరం త్రీత్వం నివాస మందిరాలుగా తయారు కావచ్చును. అలాంటి వానిని నా తండ్రి ప్రేమించును. మేము వచ్చి అతనితో నివసిస్తాం” అని యేసు చెప్పాడు గదా!.

ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలు దేవుని అంతరంగాన్ని గూర్చి ఆయన తత్వాన్ని గూర్చి తెలుపుచున్నాయి. యావే కటాక్షించి, మోషేకు తనగూర్చి తాను బయలు పరచాడు. యావే కరుణాళుడు. దయాళుడు, సులభంగా కోపగించుకొనువాడు కాడు. ప్రేమ విశ్వాసాల అనంతుడు. ప్రజలను కృపతో చూచువాడు దోషాలను మన్నించు వాడు. ప్రేమాదరణలను దండిగానున్నవాడు. తన జనాన్ని పట్టించుకొనేవాడు. ఆదరించే గుణం గలవాడు. యేసు ప్రకటించిన దేవుడు హృదయమున్నవాడు. పిచ్చి ప్రేమతో మానవాళిని ప్రేమించేవాడు. లోకం కలంతకాలం నిలవాలని కాంక్షించి, తన కుమారుని త్యాగం చేసాడు. ఆ ప్రేమమయునితో యేసుని అభిమానించే వారందరూ బంధం పెంచుకొనే భాగ్యాన్ని తెరచివుంచాడు. త్రీత్వ దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించే శిష్య సంఘం, త్రీత్వ దేవుని అంతరంగ జీవితాన్ని అనుసరించాలి. సంపూర్ణతను అనుభవించాలి. పౌలు కొరింతు సంఘానికి ఇచ్చి ఆహ్వానం ఇదే. సంఘస్టులు ఏకీభావం కలిగి, ఏక త్రాటిపై నడిచి, త్రీత్వదేవుని సహవాస జీవితాన్ని ప్రతిబింబించే జీవితాన్ని జీవించాలి. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథ పఠనాలు త్రీత్వ దేవుడు వారిలో వారే బంధాలను కలిగివుండక, మనతో బంధాన్ని ఏర్పరచుకొన డానికి సిద్ధంగా వున్నారు అని తెలుపుచున్నాయి. బాప్తిస్మం ద్వారా ఆ దేవునితో బంధం పెంచుకొన్నాము. ఆయనలోనికి ప్రవేశించే భాగ్యం పొందాం. దానిలో పరిణత నొందాలి. ఈ బంధమాధుర్యతను అనుదిన జీవితంలో ప్రతిబింబించాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN