నేటి పునీతులు : జోన్ అఫ్ ఆర్క్
.jpg)
జోసెఫ్ అవినాష్
30 May 2026
జోన్ అఫ్ ఆర్క్ "ఆర్రియనుల వీరవనిత "ఫ్రాన్సుదేశ
విమోచకురాలు"గా గణుతికెక్కిన వీరకన్యామణి. క్రీ||శ|| 1412 జనవరి 6న ముగ్గురు జ్ఞానుల పండుగ రోజున ఈమె జన్మించింది. ఫ్రాన్సుదేశానికి ఈశాన్య ప్రాంతంలోని మ్యూజ్ నదీ తీరాన గలసారవంతమైన 'చంపాగ్ని' మండలంలోని 'దోమి' గ్రామం ఈమె జన్మస్థలం.వీరిది కేవలం ఒక వ్యవసాయక కుటుంబం.పేదరైతు జాక్వెస్ డి ఆర్మ్ అయిదుగురు సంతానంలో ఈమె కడపటిది,తల్లి దొడ్డ స్త్రీ గొప్ప విశ్వాసురాలు. తమ చివరి బిడ్డలిద్దరికి నూలువడకడం,బట్టలుకుట్టడంలో శిక్షణనిప్పించారు.దైవభక్తితో పెంచారు. కాని జోన్ ఆఫ్ ఆర్క్ కు చదవడం వ్రాయడం తెలీదు.
ఈమె చిన్నతనంలో తమదేశమైన ఫ్రాన్సుకు, ఇంగ్లాండుకు పడేది కాదు. గత నూరేళ్లుగా అడపాదడపా యుద్ధాలు జరుగుతుండేవి. దీనికి తోడు ఫ్రాన్సులోని ఆర్జియనులకు బర్గండియనులకు మధ్య వైరముండి అంతర్యుద్ధాలు చెలరేగు తుండేవి. ఇదే అదునుగా బ్రిటన్ శత్రు సైన్యాలు వీరవిహారం చేస్తూ ఒక్కొక్క ప్రాంతాన్నే హస్తగతం చేసుకుంటున్నాయి..
జోన్ కు తన 14వ ఏట ఆకాశంనుండి ఒక అదృశ్యవాణి విన్పించింది. ఆమె తోటలో పనిచేస్తుండగా మెరుపుల మధ్యనుండి వింతస్వరం పలికింది. ఆనాటి నుండే ఆమె తాను దైవాంకిత బిడ్డగా ప్రవర్తిస్తూ, కన్యకగా గడుప ప్రతిజ్ఞచేసుకుంది. మరోరెండు సంవత్సరాలు దొర్లిపోయాయి. జోన్ కు మునుపటి అదృశ్యస్వరాలు పదేపదే విన్నింపసాగాయి. ఎవరాఅని దేవుని ప్రార్థిస్తూ పరిశీలనగా చూసింది. ఆమెకు పునీత మిఖాయేలు, అలెగ్జాండ్రియా నగర (ఈజిప్టు) పునీత కత్తెరీనమ్మ మరియు పునీత మార్గరేటుగార్లు దర్శనమయ్యారు. జోన్ తరచూ ఆ పునీతుల త్రయం సందేశాలు సూచనలు తరచు వింటుండేది.
ఇలా ఉండగా ఆంగ్లేయుల సైన్యాలు విజృంభించి దాదాపు ఫ్రాన్సులోని అత్యధిక ప్రాంతాలు ఆక్రమించాయి. ఇట్టి దుస్టిలో 1428 మే నెలలో పునీత త్రయం పలుకులు అలించిన జోన్ దైవాదేశంగా భావించి దేశరక్షణ కోసం నడుంకట్టింది. మిగిలి ఉన్న ఒక ప్రాంత ఫ్రాన్సు సైన్యానికి నాయకత్వంచే వట్టింది. కదనరంగానికురికింది. తాను అబల, అమాయకురాలు, అవిద్యావంతురాలైనా దేవుని పై భారంమోపి సబలగామారింది. పరుషదుస్తులు ధరించి గుర్రం. పై స్వారీచేస్తూ కత్తిఝుళిపించింది. శత్రు సైన్యంలో గుబులు పుట్టించింది. పునీత త్రయంప్రోత్సాహం దేవభక్తి ఆమెను ముందుకు నడిపించింది. ధైర్యసాహసాలతో వీరోచితంగా పోరాడి శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించి తరిమివేసింది.
ఫ్రాన్సురాజైన ఏడవ చార్లెస్ జోన్లోని దైవశక్తి ఏపాటిదో పరీక్షింపనెంచి మారువేషంలో రాజోద్యోగులతో కలసిపోయి ఉండగా జోన్ ఆ రాజును గుర్తుపట్టి పలుకరించగా రాజు ఆశ్చర్యచకితుడై ఆమెను బహుగా ప్రశంసించాడు.మతాధికారులుకూడ ఆమెకు అందగాను సలహాదారుగాను ఉన్నారన్న పునీత త్రయుగూర్చి పలుమార్లు పరిశీలించారు. మరో సందర్భంలో కూడ ఆర్థియనుల నగరాన్ని శత్రుగుంపులు చుట్టుముట్టిరాగా జోన్ వారిని అవలీలగా ఓడించి విజయం సాధించింది.
క్రీ॥శ॥ 1429 జూలై 17న ఏడవ చార్లెస్ అధికారలాంచనాలతో ప్రజాసమక్షంలో కిరీటధారియై రాజ్యాధికారం చేపట్టిన పిమ్మట జోన్ కు ప్రత్యేక స్థానమిచ్చి గౌరవించాడు. ఆమె తన విజయ పతాకంతో సగర్వంగా నిలబడింది. ఆ జెండా పై తండ్రి దేవుని చిత్రపటం, క్రింద ఏసు మరియు నామధేయములు లిఖింపబడి ఇరువైపులా ఇరువురు దేవదూతలు మోకరిల్లి స్తుతులర్పిస్తున్నట్టు చిత్రీకరింపబడి దైవభక్తిని చాటుతోంది. సుందరమై ఆకారం, పరిపుష్టమైన శరీరం, మంచి ఆరోగ్యంతో నిగనిగలాడే నల్లనికురులు కురుచగా కత్తిరించుకొని ఉంది. చిఱుదరహాసంతో వీరధీరవనితలా చూపరులనిట్టే ఆకట్టుకొంది.
తర్వాత కాలంలో కూడ ఫ్రాన్సు పై జరిగిన పలుదండయాత్రల్లో జోన్ శత్రువుల నెదుర్కొంది. అయితే 1430 మే 23న బర్గండియనులపై జరిగిన పోరాటంలో గవర్నరు తప్పుడు అంచనాలవల్ల ఎత్తుగడల్లో పొరపాటు జరిగి దుండగులకు దొరికిపోయింది. జోన్ను గుర్రం పైనుండి క్రిందికి గుంజి బంధించి ఖైదుచేశారు. ఆమె తప్పించుకునేందుకు ఎత్తైయిన ఒక టవరు పై ఎక్కి క్రిందికి దూకింది. కాని తప్పించుకోలేక పోయింది. అయినా అంత పైనుండి దూకి నిక్షేపంగా ఉండడమే ఒక మహా అద్భుతం అనుకున్నారు.
జోన్ ను బంధించిన బర్గండియనులను దుండగులు తమకు అధిక ధనం ఇచ్చిన వారికి జోన్ను అమ్మివేస్తామని ప్రకటించారు. అయితే ఫ్రాన్సు రక్షణకు విశేషంగా కృషిసల్సిన జోను ఏడవ చార్లెస్ రాజు అంతగా పట్టించుకోలేదు. ఇదే అదనుగా ఆంగ్లేయులు అధికమొత్తంలో డబ్బుకుమ్మరించి 1430 నవంబరు 21న జోను క్రయంచేశారు. క్రిస్మస్. పండుగకు రెండు దినాలకు ముందుగా ఆమెను రౌయెస్ పట్టణ జైలుకు తరలించి ఒక బల్లపరుపు పలకంపై గొలుసులతో కట్టి కాపలా పెట్టారు. తర్వాత 1431 ఫిబ్రవరి 21న ఆమె కోర్టుహాలులోనికి విచారణ నిమిత్తం కొనితేబడింది.
న్యాయాధిపతులు న్యాయానికి కట్టుబడక జోన్ తమ శత్రువు
అనే అక్కసునే ప్రదర్శించారు.జోన్ ఒక మంత్రగత్తె, తంత్రశక్తులతో, మూఢనమ్మకాలతో,కుయుక్తులతో, బ్రిటిష్ వారిపై తలపడిందని నేరారోపణ చేశారు. ఆమెకు పునీత త్రయం ప్రోత్సాహం, దైవబలం ఉందన్న సంగతి వారి మూర్చపగ విద్వేషంవల్ల గ్రహించుకోలేకపోయారు. సైతాను ప్రేరణవల్ల వారి కళ్లు పొరలు కమ్మాయి. జోన్ ను సజీవంగా మండుతున్న మంటల్లో వేసి దహనం చేయాలని తీర్పునిచ్చి తమ కసితీర్చుకున్నారు.
తీర్పు ఇవ్వబడిన మరునాడు అనగా 1431 మే 30న బుధవారం ఉదయము 8గం||లకు రౌయెన్ పట్టణ మార్కెట్లు ప్రదేశాన జోన్ ను దహనబలికి గురిచేశారు. కట్టెపుల్లలచితికి నిప్పంటించగానే జోన్ కడపటి కోరిక ప్రకారము ఒక దోమినికను సన్యాసిని ఒక శిలువ స్వరూపమును ఆమెకండ్లకు కనబడేలా పైకెత్తిపట్టుకుంది. ఎగసి మండుతున్న మంటల్లో నుండి "ఏసూ !" అని జోన్ కంఠం పిల్చింది. బ్రిటిష్ రాజైన హెన్రీ కార్యదర్శి జాన్ ట్రెస్పార్ట్ కు ఈ పిలుపు స్పష్టంగా విన్పించింది. "మనం పోగొట్టుకున్నాం. ఒక పవిత్రురాలిని తగుల బెట్టాం" అని బిగ్గరగా పలికి పరితాపం చెందాడు. ఆమె అస్థికలు సియెన్ నదీజలాల్లో కలుపబడినాయి..
క్రీ||శ|| 1456లో అనగా జోన్ యొక్క మరణానంతరము
ఆమెయొక్క జీవితాన్ని పునః పరిశీలింపవలసిందిగా ఆమె కుటుంబసభ్యులు కోరిన మీదట 3వ కలిససు పోవుగారి అనుజ్ఞమేరకు కేసు తిరుగతోడబడింది. ఆమె పై వ్యతిరిక్తంగా ఇవ్వబడిన సాక్ష్యాలు పక్షపాతంతో కూడుకున్నవిగా తేల్చబడింది.తద్వారా తప్పుతీర్పు అన్యాయపు శిక్ష విధింపబడినట్లు అంచనావేయబడింది. జోతో బాల్యంలో ఆటలాడుకున్నవారు, సహగాములు, గురువులు జోన్ కు అనుకూలంగా చెప్పారు. జోన్ పవిత్రురాలు, ప్రార్ధనాపరురాలు. అనుదినం గుడిలో కనబడుతుంది.దివ్యసంస్కారాలయెడ భక్తి విశ్వాసాలు మెండు ఆమె వీరకన్య. పేదలు, రోగులు, బాటసారులయెడ ఎంతో ప్రేమకనబరచేది. వారికి తాను పరుండే మంచంకూడ కేటాయిస్తుండేది. "ఆమె చాలా మంచిది" "ఆమె గ్రామస్తులు ఆమెను అధికంగా అభిమానిస్తారు" అని ఉద్వేగంతో వాక్రుచ్చారు.
జోన్ పునీతుల త్రయం ఆదేశాలవల్ల ఆధ్యాత్మిక బలంపొంది సాహసకార్యాలు చేయకలిగిందని వెల్లడైంది. నాటి క్రైస్తవ సమాజంచేసిన ఘోరతప్పిదానికి పోవుగారు విస్తుపోయారు. "జోన్ భక్తి విశ్వాసాలుగల శ్రీసభ బిడ్డ" అని వారునమ్మారు.అప్పటికే ఫ్రాన్సులోని ఆర్గియను ప్రజలు ప్రతిసంవత్సరం మే నెల 8న ఆమెను కొనియాడుతూ పండుగ జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాన్ని 1920లో జాతీయ ఉత్సవంగా ఫ్రాన్సు గుర్తించింది. 1909లో జోన్ ధన్యతగాను 1919లో 15వ బెనడిక్టుపోపుగారిచే పునీతగాను ప్రకటింపబడింది.ఈమెను ఫ్రాన్సుదేశ పాలక పునీతురాలుగా శ్రీసభ పేర్కొంది. యువతకు కూడా ఆమె మార్గదర్శకురాలైంది. జాన్, జోన్,జోన్నా అంటే దేవుడు వరములఘని, దేవుడు ఆదరించెను అని అర్థం.
