ప్రతి కుటుంబం తిరు కుటుంబం కావాలి

కె.జయశ్రీ
29 May 2026
సాధారణంగ మన కుటుంబాలలోని వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలకంటే పరిశుద్ధ కుటుంబంలోని సమస్యలు చాలా ఎక్కువనే చెప్పాలి.కన్యకగా ఉన్నపుడే మరియతల్లి గర్భం ధరించడం, యోసేపు మరియమాతను రహస్యంగ విడిచిపెట్టాలనుకోవడం,దూత చెప్పిన తరువాత మరియమాతను ఇంటికి తీసుకొని వెళ్ళడం, నిండు చూలాలైన మరియమాతతో బెత్లహేంకు వెళ్ళడం,బాలయేసు జన్మించడానికి సరియైన స్థలం దొరకకపోవడం, హేరోదురాజు శిశువును చంపబూనటం,ఐగుప్తుకు పలాయన, తిరిగివచ్చి నజరేతులో భయంభయంగ స్థిరపడటం,మూడు దినాలు బాలయేసు కనిపించకపోవడం, యేసు సిలువను మోయడం, సిలువపై మరణించడం, ఆయన పార్థివ దేహాన్ని భూస్థాపితం చేయడం, ఇదంతా తల్లికి కడుపుకోత అవడం, ఒకటా రెండా ఎన్నెన్నో బాధలు.ఇన్ని సమస్యలున్నా ఈ కుటుంబం పరిశుద్ధంగానే జీవించింది.అష్టకష్టాలు ఎదురైనా,పరిశుద్ధ కుటుంబం వాటన్నింటిని భరించి, నిలద్రొక్కుకొని ఉందంటే కారణం - వారు దేవునియొక్క చిత్తాన్ని నెరవేర్చ మనసు కలిగుండడమే! యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చడాని కొస్తే, తల్లి మరియమాత, “నేను ప్రభు దాసురాలను" అని చెప్పడం,యోసేపు గారు దైవదూత ప్రేరణకు తలయొగ్గి జీవించడం గమనార్హం.ఈ విషయాలన్నిటా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు ఎంత శ్రమను అనుభవించారో మనకు అర్ధమౌతుంది.అంతేగాక, వారిలో - వారి మధ్యన తాండవించే ప్రేమ కూడా కారణమే! మరియతల్లి అభిషిక్తుడైన యేసుక్రీస్తు అనుసరిస్తే, యోసేపు గారు మరియమాతను బాధలలో కూడా ఆమెను విడిచిపెట్టలేదు.తిరు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి జీవించారు. మన కుటుంబాలు కూడా ఇలానే ఉండాలి.
