మన జీవితం ఏమిటో ఆయనకే బాగా తెలుసు
.png)
జోసెఫ్ అవినాష్
28 May 2026
సామాన్య 8వ శుక్రవారం
మార్కు 11:11-25
ధ్యానం-:
నేటి సువార్త పఠనం మనకు మూడు విషయాలను నేర్పిస్తుంది.
1. యేసయ్య రాకడను స్మరించుట (అంజూరము శాపము)
2. దేవుని సన్నిధి పవిత్రమైనది. అది అన్ని జాతులకు ప్రార్థనలయం.
3.నిస్వార్థ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు.దీని ద్వారా క్రీస్తుప్రభువు క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణాలను మూడు సంఘటనల ద్వారా చెప్పాడు.
అంజూరం: యేసు అంజూరపు ఫలాలను ఆశించాడు.కానీ దొరకలేదు. అందునా అది ఫలించు ఋతువు కాదు. చివరికి శపించబడినది. కానీ మనుషుల విషయంలో దేవుడు ఎల్లపుడు మన మంచి పనులకోసం,మంచి జీవితం కోసం ఎదురు చూస్తాడు. ఆయన వచ్చే సమయానికి మనం మంచి ఫలాల వంటి పనులలో నిమగ్నం కావాలి. లేకపోతే శపించబడతాము.
దేవాలయం: ఆధ్యాత్మిక విషయాలలో,కార్యాయాలలో శోభిల్ల వలసిన యెరూషలేము దేవాలయం అనేక వ్యాపారాలతో నిండి ఉంది. ఉండవలసిన రీతిలో కాకుండా ఊహించని స్థితిలో కనిపించింది.అందుకే యేసు ప్రభువు కోపోద్రిక్తుడై అందరిని వెళ్ళగొట్టాడు.మనం దేవుని ఆలయం.దేవుని ఆత్మకు నివాస స్థలం.మన హృదయాన్ని ఆలయంగా మార్చుకోవాలి.మంచి కార్యాలతో,గుణాలతో అలంకరించాలి.పగలు ప్రతీకారాలకు అతీతంగా ఉండాలి.ఈర్ష్యాద్వేషాలను దరిచేరనీయకూడదు.ఇహలోక వాంఛలను త్యజించాలి. అప్పుడే దేవుడు మనలో వసిస్తాడు.
ప్రార్థన: కల్మషం లేని ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. మనలోని వ్యామోహాలను మనస్పర్థలు తుడిచివేసి స్వచ్ఛమైన హృదయంతో ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు. హృదయాన్ని శుద్ధీకరించుకొని ఉన్నతంగా హుందాగా ఉండడానికి ప్రయత్నించాలి. కారణం మనం ఏమిటో మన జీవితం ఏమిటో ఆయనకే బాగా తెలుసు...
