శ్రీసభ యువతకు అండగా నిలవాలి - పోప్
జోసెఫ్ అవినాష్
28 May 2026
యువతలో పెరుగుతున్న ఆధ్యాత్మిక వెలితి విశ్వ కతోలిక శ్రీసభకు ఒక పెద్ద సవాలుగా మారిందని,ఈ పరిస్థితిలో క్రైస్తవ సమాజాలు మరింత ఉత్సాహంతో సువార్తను ప్రకటించాల్సిన అవసరం ఉందని విశ్వ కాపరి పోప్ లియో XIV పేర్కొన్నారు. మే 27న ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన సువార్త ప్రచార విభాగం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ సందేశాన్ని ఇచ్చారు.ప్రస్తుతం చాలా మంది యువకులు జీవితానికి అర్థం ఏమిటో తెలియక,ఒంటరితనం,నిరాశ, విశ్వాసలేమి మధ్య జీవిస్తున్నారని పోప్ అన్నారు.ఈ “ఆధ్యాత్మిక పేదరికం”ను చూసి శ్రీసభ భయపడకుండా, ప్రేమతో మరియు ఆశతో వారిని చేరుకోవాలని పిలుపునిచ్చారు.నిజమైన సువార్త ప్రచారం అంటే కేవలం మాటలతో కాకుండా,మన జీవితం ద్వారా క్రీస్తు ప్రేమను చూపించడమే అని ఆయన వివరించారు.ప్రతి కతోలిక సమాజం యువతను అర్థం చేసుకొని, వారికి తోడుగా నిలబడి, దేవునితో సంబంధాన్ని మళ్లీ కనుగొనేలా సహాయం చేయాలని పోప్ సూచించారు.
