కతోలిక సంఘంలో బాలయేసు భక్తి నేపద్యం

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
08 May 2026
ఈ మధ్య కాలంలో బాలయేసు మీద భక్తి ప్రజలలో విరివిగా పెరుగుతూ ఉంది.చాలాచోట్ల బాలయేసు పుణ్యక్షేత్రాలు వెలిశాయి. నవదిన జపాలతో పండుగలు చేస్తున్నారు.ఈ భక్తి నేపథ్యమేమిటి,అన్ని ప్రశ్న వేసుకుంటే దాని వెనుకనున్న చరిత్ర కొంచెం తెలుసుకోవాలి. గొప్ప పునీతులైన చిన్నతెరేసమ్మ, అస్సిసీపుర ప్రాన్సీస్, పునీత అంతోని, పునీత అవిలాపురి తెరేసమ్మ వీరంతా బాలయేసు మీద ఆచంచలమైన భక్తిభావం కలిగిఉంచేవారు. జెక్రి పబ్లిక్ రాజధాని ప్రాగ్లో 17వ శతాబ్దంలో ఈ భక్తి మొదలైంది. ఈ పట్టణానికి బాలయేసు స్వరూపాన్ని తీసుకువచ్చారు. బొహేమియాలోని ఒక మఠం నుండి ఈ స్వరూపం వచ్చిందని కొందరి నమ్మకం. అక్కడే ఈ స్వరూపం నిర్మితమై ఉండాలి. అక్కడి కార్మలైట్ సభవారికి ఈ స్వరూపం అందజేయబడింది.అప్పటి నుండి వేలకొలది భక్తులను ఈ స్వరూపం ఆకర్షిస్తోంది.అక్కడ వెలసిన పుణ్యక్షేత్రం ద్వారా దైవానుగ్రహాలను,స్వస్థతలను భక్తులు పొందగలగుతున్నారు. కాలక్రమేనా యుద్ధం వల్ల ఈ స్వరూపం మరుగున పడినా, అద్భుత విధంగా వెలుగులోకి వచ్చి ప్రజలకు అందుబాటులో వుంది.యుద్ధకారణం వల్ల ఒక చేయి విరిగి పోవడం,దానిని సరిచేయటానికి వీలుగాక అలాగే ఉంచడం జరిగింది. అప్పుడు స్వరూపాన్ని సంరక్షించే ఫాదర్ సిరిల్ గారికి, దీనిని గుడి తలుపు దగ్గర ఉంచితే ఒక వ్యక్తి వచ్చి సరిచేస్తాడని బాలయేసు సందేశమిచ్చాడు.ఫాదర్ గారు అలా చేయగా ఒక వ్యక్తి వచ్చి ఈ విరిగిన చేతిని సరిచేస్తాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో ఎవరికి తెలియదు.అప్పటి నుండి ఆ స్వరూపం వేల కొలది భక్తులకు అద్భుత విధంగా ఆశీర్వాదాలు అందిస్తూనే ఉంది.అదే పోలికలున్న బాలయేసు స్వరూపము పలు పుణ్యక్షేత్రాలలో వెలిశాయి.ఈ రోజు ఆ పుణ్యక్షేత్రాలలో బాలయేసుకు కృతజ్ఞతగా దివ్య పూజాబలులు, విన్నపాలు సమర్పించడం జరుగుతోంది.నవదిన జనములతో తిరుణాలలు జరుపుతున్నారు.అద్భుత బాలయేసు మాట ఇచ్చిన విధంగా వారు ఆయనను ఆరాధిస్తున్నారు.ఆయన ఆశీస్సులు కూడా గొప్పగా పొందుతున్నారు.
బాలయేసు స్వరూపంలో గమనిస్తే ఆయన కుడిచెయ్యిని పైకి చూపుతూ ఆశీర్వదించినట్లు ఉంటుంది. ఒక చేతిలో భూగోళాన్ని పట్టుకొని ఉంటాడు.ఆయన ఈ విశ్వానికి రాజని దీని అర్థం. ఆయన రాజ్యం న్యాయము, ధర్మముల సమ్మేళనము, పవిత్రత-దైవకృపలతో కూడిన రాజ్యము,శాంతి,ప్రేమ,ధర్మం వెల్లివిరిసే దైవరాజ్యము. ఒక చిన్న బాలుడు ఒక కుటుంబానికి ఏవిధంగా ప్రేమను,ఆత్మీయతను తీసుకవస్తున్నాడో,అలాగే బాలయేసు మనందరి జీవితాలలో ఆనందాన్ని, ప్రేమను తీసుకువస్తున్నాడు. దైవానుగ్రహము,జ్ఞానము, మంచి వ్యక్తిత్వముతో పెరిగిన బాలయేసు మన పిల్లలందరికీ ఆదర్శప్రాయుడు (లూకా 2:52), తన తండ్రి చిత్తం నెరవేర్చాలన్న అకుంఠిత దీక్ష చిన్నతనం నుండే ఆయన అలవర్చుకున్నాడు (లూకా 2:49). అలాంటి లక్ష్యం మన యువతీయువకులకు ఎంతో అవసరం.
