క్రీస్తే మార్గం సత్యం జీవం

Fr. Sesetti Mariadas M.S.F.S.

02 May 2026

పాస్కా అయిదవ ఆదివారం
అపో.చ. 6:1,7,
1 పేతు. 2:4-9,
యోహాను 14:1-12

యోహా. 13:17 అధ్యాయాలలో యేసుని కడరా భోజన బోధ ఉంది. ప్రభుని గుర్తుంచుకోదగ్గ మాటలు అందులో ఉన్నాయి. ఈ కడరా భోజన బోధ తొందరలో జరగనున్న ప్రభువు శిష్యుల్ని వీటిపోవడం, ఆత్మ రావడం ఉన్నాయి. యేసుని నిజ స్వభావాన్ని, శిష్యులు ఎట్టి సంఘంగా రూపొందవలసివుందో ఆత్మ, ఆదరణ కర్త వివరిస్తుంది. ఈ అధ్యాయాలలో ప్రభుని బోధలు చెప్పిందే మరలా చెప్పడం జరిగింది. ఉదాహరణకు 14వ అధ్యాయంలో చెప్పబడింది మరలా 16వ అధ్యాయములో చెప్పారు.

కడరా భోజన సంఘటన తరువాత శిష్యుల్ని ఓదార్చుతూ, తండ్రిని తనను విశ్వసించమని కోరాడు. తను వెళ్ళుచున్న స్థలాన్ని ప్రస్తుతం శిష్యులు వెళ్లలేరు. కాని తరువాత వెళ్లగలరు. ఇందులో యోహానుని అచ్చటకు ప్రస్తుతం వారు వెళ్ళలేరు. కానీ తరువాత వారు యేసుకోసం శ్రమలు అనుభవించు సంసిద్ధతను పొందుతారు. తోమా ప్రభు వెళ్ళుమార్గాన్ని అడుగుతాడు. ఇది సువార్తీకుడు యోహానుని రచనా శైలి మరో లక్షణం. తప్పుగా అర్థం చేసుకోవడం వలన బోధకు ఒక అవకాశాన్ని సృష్టించి, బోధను చేయిస్తాడు. శిష్యులు ప్రభు మార్గాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వలన మార్గం యొక్క అంతరార్థాన్ని ప్రభు వివరించాడు. తానే “మార్గం, సత్యం జీవము” అని ప్రకటించాడు. సత్యం, జీవం, భావాలు యోహాను సువార్త అంతటా కన్పిస్తాయి. పిలాతు ముందు యేసు నిలిచేటపుడు, ఈ భావాలు తారాస్థాయికి చేరు తాయి. పరిపూర్ణతను పొందుతాయి. “సత్యమనగానేమి” పిలాతు ప్రశ్నిస్తాడు? పిలాతుకు తెలియదు. సువార్తను చదువు చదువరులకు తెలుసు. పిలాతుపై ఆధిపత్యం గల సత్యం యేసు.

ఈ సువార్త భాగంలోని మరో అంశం : తండ్రితో యేసుకున్న బంధం. వారు అన్యోన్యంగా ఒకనియందు ఒకరుంటారు. అందువలన యేసునియందు శిష్యులు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగివుండాలి. యేసు తండ్రి దగ్గరకు పోవుటవలన శిష్య సంఘం మరింత బలపరచబడుతుంది. శక్తివంతమవుతుంది. ఆత్మ, ఆదరణకర్త, దిగివస్తుంది. ఆత్మ శిష్య సంఘంలో యేసుని సాన్నిధ్య కొనసాగింపు యేసు ఆదర్శాన్ని అనుసరిస్తూ, ఆత్మశక్తితో గొప్ప కార్యాలు - విశ్వాస క్రియలు, ప్రేమ క్రియలు-చేయాలి.

బారశాల, పోలికలు వెదకడం మనకు అలవాటు. రత్నం ఇంట్లో పుట్టిన అమ్మాయి ఉయ్యాలలో వేయడం సంబరానికి ఆత్మీయులు, బంధువులు వచ్చారు. అమ్మాయిని ఉ య్యాల్లో వేసిన తరువాత చూడడానికి వచ్చిన ఒక్కొక్కరు "ముక్కు అచ్చం వాళ్ళ నాన్నదే” అని ఒకరు “ఆ కళ్ళు అచ్చం వాళ్ళ అమ్మమ్మవే” అని ఇంకొకరు “ఆ ముఖం వాళ్ళ తాతయ్యదే అని వేరొకరు, చెపుతూ కుటుంబ పూర్వులను తలంచు కొన్నారు. కుటుంబపు తరాలను గుర్తుకు తెప్పించారు. శిశువులో కుటుంబీకుల పోలికలను చూస్తారు పోలికలు చూడడం మనకు అలవాటు.

మానవులంగా దేవుని పోలికలను లక్షణాలను కూడా వెదుకుతుంటాం. దేవుడు ఎలా వుంటాడోనని అనుకుంటాం. మన సృజనను, ఊహను ఉపయోగించి దేవుని రూపాన్ని, ముఖాన్ని ఊహించుకొంటాం. మన మంచి తాతయ్యలా వుంటాడని మనలో కొందరు ఊహించుకొంటే, మరికొంతమంది రూపాతీత శక్తిగా, తేజంగా ఊహించు కొంటారు. చాలాసార్లు మన మానసిక పరిస్థితికి అనుగుణంగా ఊహించుకొంటాం. ఇవన్నీ సమర్థనీయమైనవి కాకపోవచ్చును. కాని మన స్వేచ్ఛగా ఊహించుకొంటాం. మనలో దేవుని పైనున్న ఆశక్తి అంత గొప్పది. తీవ్రమైనది.

నేటి సువార్తలో ఫిలిప్పు అపోస్తలుడు చాలా ఆశక్తితో “మాకు తండ్రిని చూపు” అని యేసుని కోరుతున్నాడు. దేవుని ప్రతిబింబించు అద్దంగా తనను తాను యేసు పరిచయంచేసుకొన్నాడు. “నన్ను చూచువాడు నా తండ్రిని చూచుచున్నాడు” నేను తండ్రి యందును, తండ్రి నాయందును ఉన్నాము” యేసు దేవుని స్వగతావిష్కరణం. యేసునిలో దేవుడు తనను తాను. రూపుదిద్దుకొన్నాడు. ఆయనే తండ్రి. తండ్రిని చూడడమంటే యేసుని చూడడమే. క్రీస్తుని చూడడం తండ్రిని చూడడమే. తండ్రి పోలికే క్రీస్తు అందుకే “నేనే మార్గం, సత్యం, జీవం' అన్నాడు, తండ్రి దరికి మార్గం క్రీస్తు. ఇది చాలా అసాధారణ ప్రకటన. ఈ గొప్ప ప్రకటన చేయడానికి ఆయనలో నున్న తాహతు - ఆయన 'అబ్బా' అనుభవం. అత్యంత సన్నిహితంగా దేవునితో మెలిగాడు చారిత్రక యేసు, ప్రార్థనలో వ్యక్తిగతంగా ముచ్చట్లులో నమ్మకాన్ని, పరస్పర బార్ల తెరచివుండే గుణాన్ని ప్రదర్శించాడు. చంటిబిడ్డ వాలకాన్ని కలిగి తండ్రితో బంధం పెంచుకొన్నాడు. తండ్రిని ఆప్యాయంగా 'అబ్బా!” అని పిలిచాడు. తనను ఒక చంటిబిడ్డగా, చేసుకొని తండ్రి మాటకు, పనికి, పిలుపుకు అనంత గౌరవాన్ని నిచ్చాడు.

విధేయతను, మరణం వరకు విధేయతను చూపాడు. తండ్రి విశాల గుణాన్ని పెద్ద మనస్సును, బుద్ధిని, హృదిని' ప్రేమ కరుణ ప్రవర్తనను అనుసరించాడు. తన ప్రాధమిక అబ్బా అనుభవం వలన ఎన్నడూ లేని విధంగా, క్రొత్తగా తనపట్ల తనకున్న అవగాహనను, ఇతరులపట్ల నున్న అవగాహనను పొందాడు, క్రొత్త దృష్టిని, క్రొత్త దృక్పధాన్ని పొందాడు. ఈ అనుభవ ప్రాబల్యం వలన తండ్రికి హత్తుకు పోయాడు. తీగలో రెమ్మలా, పూవులో తావిలా, రాగంలో నాదంలా, మెరుపులో తళుకులా తండ్రిలో లీనమైపోయాడు. మమేకమైపోయాడు. నిత్య బంధంలో తండ్రిలో మునిగిపోయాడు, తన దివ్య అనుభవంలో కలిగిన కనువిప్పును కరుణగా జీవించాడు. కరుణను మాటలో బతికించాడు. తన ప్రక్కన శిలువకు వ్రేలాడుతున్న దొంగవానితో, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో, కుష్ఠరోగితో కరుణ పూరితంగా మాట్లాడాడు. కరుణను చేతలలో చూపాడు. ఆకలి తీర్చాడు. స్వస్థత నిచ్చాడు. ఈ విధంగా అనుభవం-అనుబంధంఅనురాగం అను మూడు అంశాలు కల తన మార్గంలో జీవించడం వలన దివ్యత్వాన్ని తన జీవితాన నిర్వచించాడు. ఆయనను చూచినవారు దివ్యత్వాన్ని అర్థం చేసుకొన్నారు. దేవుని పోలికను చూసారు. ఆయనే దేవుని రూపం, ప్రతిబింబం అనుకొన్నారు. ఆయన ముఖాన్ని చూసినవారు ఏదో విధంగా దేవుని చూచిన అనుభూతిని పొందారు. అలౌకిక ఆనందాన్ని పొందారు.

తన వ్యక్తిగత మార్గం-అనుభవం, అనుబంధం అనురాగంవలన యేసు తండ్రి దరికి దారి అయ్యాడు. యేసు మార్గం అంటే ఏమిటి ? అది ఇంటికి దారి లాంటిది కాదు. అది ఒక పర్వతాన్ని ఎక్కించే మార్గంలాంటిది. పర్వతాన్ని ఎక్కించే మార్గం, పర్వతం యొక్క అందాన్ని, గంబీరత్వాన్ని, వైభవాన్ని చూపిస్తాది. అలానే, యేసు దేవుని స్వాగత ఆవిష్కరణగా, దేవుని జీవంగా, దేవుని అచ్చమగు ముఖంగా మన మధ్యనుంటూ, మనం దేవుని అనుభవపూర్వకంగా గ్రహించు అవకాశంను కల్పించు చున్నాడు. ఆయన సత్యం, జీవం, మార్గం. ఖచ్చితమైన మార్గం - ఆయన మార్గంన నడిచిన గమ్యమదిశను గూర్చిన సందేహం లేదు. అనుభవం, అనుబంధం, అనురాగం మార్గాన సాగిన విశ్వాసి గమ్యం చేరుతాడు. అదే సత్యమగు మార్గం. జీవిత పరమార్గాన్ని చూపించే మార్గం. దేవుడు మనిషిలో నిండడమే సత్యం. మనిషి పరమార్థం, ఆ దేవుని సత్యాన్ని, సారాన్ని అందరికి అన్నివేళల్లో కరుణ అందించడం - జీవితాన నింపుకొనమని నేర్పించే మార్గం. జీవమగు దేవునితోగల బంధంవలన, చేతనను, శక్తిని పొందుతూ, జీవితానికి ప్రేరణను, స్ఫూర్తిని నిండుగా నిచ్చు మార్గం. ఈ విశ్వాసులమగు మనకు ఉత్థాన క్రీస్తు సత్యం, జీవం, మార్గం.

ఉత్తాన క్రీస్తుని గూర్చి నేటి వేదగ్రంథ పఠనాలు చెప్పుమరో విషయం : క్రీస్తు సజీవ శిల. 1 పేతురు 2:4-9. ఆయన ప్రధాన రాయి. మూలరాయి. భవన నిర్మాణంలో మిగిలిన రాళ్ళకు ఆధారాన్ని బలాన్ని ఇచ్చే రాయి. దేవుడు నిర్మిస్తున్న క్రైస్తవ సంఘం అనుభవానికి ఆధారం క్రీస్తు. సంఘానికి బలాన్నిచ్చేది క్రీస్తే ఆయనను ఆధారంగా చేసుకొన్నవారు సజీవ శిలలుగా మారుతారు. క్రీస్తు సజీవ శిలగా మన దాహాలన్నింటిని తీర్చగలడు. రాతి నుండి నీటిని పొంది దప్పికను తీర్చుకొన్న ఇశ్రయేలు జనంలా (నిర్గమ 17:6) ఐహిక దప్పికలను తీర్చు సజీవ శిల యేసే. అందుకే “దప్పికగొన్న వారు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుడు” (యోహా. 7:37-39) అని ఆహ్వానిస్తున్నాడు. మన ఆత్మ వెలితిని పూడ్చగల మహత్తు ఆయన దగ్గర మాత్రమే వుంది. ఆయన వద్ద మాత్రమే సమృద్ది జీవం (యోహా. 10:10) వుంది. దీనిని మనం నమ్మాలి. ఆయనను మనం నడవవలసిన బాటగా చేసుకోవాలి. (ఎఫె. 5:2)

మనం క్రీస్తు మార్గంలో నడవాలి. క్రీస్తు తండ్రితో చంటిబిడ్డలా నిత్యబంధంలో నున్నట్లు, క్రీస్తుని మనం కలవాలి అనుభవించాలి. అనుభవసారం - ప్రేమ కరుణలు - ఇతరులకు పంచాలి. తండ్రిని చేరడానికి క్రీస్తు పెద్దదారి అయితే, మనం ఆయన బాటలో నడుస్తూ, పిల్లదారులంగా మారాలి. అందుకుగాను, మొదటిగా ఆ ప్రభువే సత్యమని, దేవుని గూర్చిన సత్యమని, దేవుని ముఖమని మనసావాచా నమ్మాలి. ఆయన మార్గాన్ని అవలంభించాలి. నిత్యం ఆయన సాంగత్యంలో దేవుని అనుభవిస్తూ, దేవుని నైజాన్ని అనుభవం ద్వారా నేర్చుకొంటూవుండాలి. క్రీస్తు దేవుని ముఖమైనట్లు, మన ముఖాలు క్రీస్తు ముఖాలు కావాలి. క్రీస్తుతో బంధం పెంచుకుంటే ఆయన రూపురేఖలు మన కొస్తాయి. ఆయనలా సజీవ శిలలంలా మనం ఇతరులకు ఆధారాన్ని బలాన్ని చేకూర్చగలుగుతాం. ఇతరుల దాహాన్ని తీర్చడానికి, అవసరాలను, కొరతలను తీర్చడానికి ప్రయత్నించాలి. పేతురు బోధించునట్లు, సజీవ శిలలుగా సిద్ధంగా నుండాలి. క్రీస్తు కృపలు ఇతరులకు చేరు కాలువలుగా పనిచేయ సిద్ధపడాలి. క్రీస్తు బాట సేవా బాట. అందువలన డీకను (సేవక, సహాయక) స్వభాన్ని కలిగి అందరి అవసరాలను తీర్చు ఔదార్యం కలిగివుండడానికి ప్రయత్నించాలి. క్రైస్తవ్యం వట్టి పరలోక ప్రవేశ చిట్కా కాదు. క్రీస్తులో తెలియపరచబడిన దేవుని తెలుసుకొని, ఆయన అచ్చమగు రూపం క్రీస్తు అని నమ్మి, బ్రతుకుబాటలో ఆ సత్యాన్ని, జీవాన్ని మన సాక్షీభూత జీవితాల ద్వారా పెంపొందిచడానికి ప్రయత్నించాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN