నేటి పునీతులు: పునీత జీటా

ఫాదర్ ఆకుల ప్రసాద్
26 Apr 2026
సుగుణం: "ఉత్తమ విశ్వాస గృహసేవకురాలు"
పునీత జీటా గారు ఇటలీలోని 'మోంటే సగ్రతి' అనే గ్రామంలో ఓ పేదకుటుంబంలో జన్మించారు.వీరు కుటుంబ జీవనోపాధికై ఓ ధనవంతుని ఇంట పనిమనిషిగా ఎంతో క్రమశిక్షణతో,దైవభీతితో పనిచేశారు.ఇతర పనివారు తనపై అసూయపడిననూ తను మాత్రం వారిపై ప్రేమను చూపించేది. కుటుంబ యజమానులు కూడా జీటా గారిని తమ కుటుంభానికి ఒక వరంలా భావించి కుటుంబ బాధ్యతలు కొన్ని జీటాగారికి అప్పగించారు.వంట పనినుండి గృహనిర్వాహకురాలిగా పదోన్నతిపొందారు. గృహసేవికగా అన్నిపనులు చేస్తూనే తీరిక దొరికినపుడెల్లా పేదలకు, రోగులకు, వికలాంగులకు సహాయం చేస్తూ వారిలో క్రీస్తు ఎడల భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను నింపేవారు.ఓ క్రిస్మస్ రోజున పునీత ఫ్రెదియాస్ గారు జీటాగారిని పరీక్షించు నిమిత్తం భిక్షగాడిగా మారి జీటాగారి నుండి కోటును తీసుకొని అదృశ్యమై తిరిగి అద్భుతరీతిలో ఆమెకు అందించారు.అప్పటినుండి జీటాగారిని 'దేవదూత ద్వారం' అని పిలిచేవారు. చిన్న చిన్న పనులను కూడా అసాధారణరీతిలో చేస్తూ జీటాగారు అందరిచే కీర్తించబడ్డారు. జీటాగారు, యజమానుని ఇంట, స్వంత ఇంట్లో, గుడివద్ద, మరియు గ్రామంలో అందరి మన్ననలు పొందారు.యజమానుని ఇంట 48సం!రాలు తన మరణం వరకు అవిశ్రాంత సేవలను ఎలాంటి నిందరాకుండా నిబద్ధతతో చేశారు. వాటితో పాటు దైవకార్యాలను కూడా ఎంతో నిష్ఠతో నిర్వర్తించారు. బ్రహ్మచారిణిగా, మిక్కిలి ప్రార్థనాపరురాలుగా, దానదాతృత్వ మిత్రురాలుగా, ఉత్తమ గృహాసేవికగా తరించిన జీటాగారు క్రీ.శ.1278 ఏప్రిల్ 27న పరలోకప్రాప్తినొందారు. వీరి పవిత్ర దేహాన్ని లుక్కాపట్టణంలోని పునీత ఫ్రెదియానో దేవాలయంలో భూస్థాపితం చేశారు.జీటాగారి మధ్యవర్తిత్వాన అనేక స్వస్థతలు,అద్భుతాలు జరిగాయి. క్రీ.శ. 1696లో 12వ ఇన్నోసెంటు పోపుగారు జీటాగారిని పునీతురాలుగా ప్రకటించారు. వీరు గృహకార్మికులకు, సేవకులకు పాలక పునీతులు. జీటా గారి దేహం నేటికిని చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.
పునీత జీటా గారా మాకొరకు ప్రార్థించండి!
