సమృద్ధి జీవన మార్గం - యేసు స్వరం

Fr. Sesetti Mariadas M.S.F.S.

25 Apr 2026

పాస్కా నాల్గవ ఆదివారం
అపో.చ. 2:14, 36-41,
1 పేతు. 2:20-25,
యోహాను 10:1-10

పాస్కా కాలంలోని నాలుగవ ఆదివారం మంచి గొల్లవాని ఆదివారం. ఈనాడు మూడు అర్చన సంవత్సరాలలోను సువార్త భాగం యోహాను సువార్త 10వ అధ్యాయం నుండి గ్రహించబడతాయి. నేటి సువార్త భాగంలో (10:1-10) యేసుని రెండు ఉపమానాలతో పోల్చి చెప్పుచున్నారు. యేసు గొర్రెల ద్వారం, గొర్రెల కాపరి. కపట కాపరులు, నిజకాపరులకు బేధాన్ని చూపిస్తుంది. కపట కాపరులు వెనుక నుండి ప్రవేశిస్తారు. ద్వారం నుండి కాదు. వారు దొంగలు, దగాకోరులు, నిజకాపరి ద్వారం ద్వారా ప్రవేశించి, గొర్రెలను పేరుతో పిలుస్తాడు. గొర్రెలు కూడా ఆయన స్వరాన్ని గుర్తిస్తాయి. ఈ విధంగా నిజమైన కాపరి, నిజమైన గొర్రెను గూర్చి వారి మధ్యనున్న సంబంధంను గూర్చి చెప్పబడింది. ఈ భాగంలో పరిసయ్యుల అపనమ్మక పాపాన్ని యేసు ఉపమానంల ద్వారా పరోక్షంగా ఉటంకించి వారి బోధను ఆలకించ వద్దని శిష్యులను హెచ్చరిస్తున్నాడు. యోహాను దృక్పదంలో యేసు మాత్రమే నమ్మశక్యమైన రక్షణ దారి. ఆయన ద్వారానే రక్షణ సిద్ధిస్తుంది. ఆయనకు ముందు బోధనా సాంప్రదాయాన్ని కొనసాగించిన పరిసయ్యులు, ఇతర బోధకులు దొంగలు. సాదా జనాన్ని మోసగించినవారు, వీరిద్వారా రక్షణ సిద్దించాడు. (చూడు ఎజేకియేలు 34వ అధ్యాయం) అందుకే యేసు వచ్చాడు. ఆయన జీవం ఇవ్వడానికి, సమృద్ధిగా నివ్వడానికి వచ్చాడు.

ఈ సువార్త భాగంలో గమనించదగ్గ కొన్ని అంశాలున్నాయి:
1. మాదిరి కాపరిగా, యేసు మనకోసమేం చేస్తాడు? ఉత్తాన క్రీస్తు ఉత్తమ కాపరి, మనలను ఆయన సన్నిహితంగా ఎరుగును. భద్రంగా నడిపిస్తాడు. సమృద్ధి జీవాన్ని స్తాడు. (వచనాలు 3, 4, 10).
2. కాపరి స్వరాన్ని ఆలకించాలా? వద్దా? మన ఉ త్తమ కాపరియగు క్రీస్తుని నమ్మక పాత్రమైన గొర్రెలంగా మనముండాలంటే ఆయనను అనుసరించాలి, ఆయన స్వరాన్ని ఆలకించాలి. ఇతరుల స్వరాన్ని ఆలకించరాదు.
3. యేసుని ముఖ్య ప్రేషిత కార్యం : సమృద్ధి జీవాన్ని ఇవ్వడం.
4. కాపరి యిచ్చు ఆధ్యాత్మిక పోషణ : ఉత్థాన క్రీస్తు, వాక్యం, జీవాహారంలతో తన గొర్రెలను పోషిస్తాడు.

"వేద పఠనాల ఈ ధ్యానం మహిమాన్వితుడు మృత్యుంజయుడు అయిన యేసుని నూతన ఇశ్రయేలు సంఘాలలోనికి ప్రవేశించి, ఆయన ఆత్మను పొందడానికి “మేము ఏం చేయాలి?” అని పేతరుని ప్రసంగానికి స్పందించారు. (మొదటి పఠనం) దిక్కుతో చని స్థితిలోనున్న జనానికి దిక్కు యేసే. ఆయన మీద నమ్మకాన్ని వుంచి జీవిత ప్రయాణంలో ఓపికతో సాగాలి (రెండవ పఠనం) కాపరత్వపు ఉత్తమ మెళకువలను తెలిసిన యేసు జీవ సమృద్ధిని కలిగిస్తాడు. (సువార్త పఠనం) ఆయనను ఆలకించాలి, ఆయన వద్దకు రావాలి. ఈ అంశాన్ని మరింత లోతుగా ధ్యానిద్దాం.

పుట్టుట.... గిట్టుట, ఉత్పత్తి చేయుట... వినియోగించుట, సంపాదించుట... ఖర్చు చేయుట, పని... నిద్ర ప్రతి మనిషి చేసే సాధారణ పనులు. రోజూ చేసేవి కాబట్టి యాంత్రికత ఉంటుంది. ఇవి ఓ చిన్న వలయంగా ఏర్పడతాయి. మనిషిని ఆ చిన్న వలయంలో బందీని చేస్తాయి. ఈ పనుల వలయంలో యాంత్రికత, అసంతృప్తి, అలసటలు దైనందిన అనుభవాలుగా కలుగుతాయి. గతించేంత వరకు ఈ వలయంలో తిరుగాడు తుండాల్సిందే. ఈ నిరాశక్తకర అనుభవాల పోటులో నిర్జీవంగా బతుకు బితుకు మంటూ, ఇష్టం లేని జీవితాలను, నిర్లిప్తంగా నెట్టుకుంటూ రావాల్సిందే. ఈ వలయానికి అంతే లేదా ? దీనినుండి విమోచన మార్గమే లేదా ? తప్పించుకొనే వేరే మార్గమేమైనా ఉందా ? ఏం చేయాలి ? ఎటు వెళ్లాలి? అని చింతనాపరుడైన వ్యక్తి వెదుకుతుండగా బయటపడే మార్గాన్ని మేము చూపిస్తాం అని నేడు ఎందరో కాపరుల స్వరాలు వినబడుతున్నాయి.

జిడ్డు కృష్ణమూర్తి, ఓషో రజనీష్ లవంటి తాత్విక స్వరాలు, స్వామి సుందర చైతన్య, స్వామి సుఖ బోధానందలి వంటి ఆధ్యాత్మిక స్వరాలు, స్వామిరాందేవ్ వంటి యోగా స్వాముల స్వరాలు, ఇంకా ఎందరో ఉపన్యాసకుల స్వరాలు, యోగుల స్వాముల స్వరాలు, ధ్యాన కేంద్రాల చింతనా శిక్షణ కేంద్రాల కాపరి స్వరాలు, దివ్య చింతన ఉ ద్యమాల సంఘాల మేపరి స్వరాలు... జీవ చైతన్యంను మేము కల్గిస్తామంటే, మేం కల్గిస్తామని యాంత్రిక వలయంనుండి బయటపడే దారిని చూపిస్తాం, రమ్మని పిలుస్తున్నాయి. గొప్ప గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. వీరికంటే బలంగా, ఆకర్షణీయంగా ఆధునిక సాంకేతిక కాపరి స్వరాలు – టీవీ చానెల్స్-స్వేచ్చను, సంతృప్తిని అనుభవించడానికి, విరామాన్ని విశ్రాంతిని, ఉత్తేజాన్ని, ఉద్దరణను పొందడానికి బలమైన కాపరి స్వరం అడ్వరటైజుమెంటు రంగం - రంగుల్ని పులిమి, తళుకులను కల్పించి మెప్పించే విధంగా వినిమయ వస్తు ప్రపంచాన్ని చూపించి ఈ వస్తువులు, ఈ స్టెల్లు, ఈ వ్యాయామాలు, ఈ ఆహార పదార్ధంలు మీకు తృప్తినిస్తాయి. మీ ఆర్తిని తీరుస్తాయి రండి.... పొందండి అని కమ్మని స్వరాలతో పిలుస్తున్నాయి. రాజకీయ నాయకుల పార్టీలు స్వరాలు జనజీవనాన్ని సుఖమయం చేస్తాం రమ్మని పిలుస్తున్నాయి. ఎన్ని స్వరాలు? టెక్నిక్కుల్ని, చిట్కాలను, మంత్రాన్ని, యంత్రాల్ని, నిర్యాణాలను, నిర్వాహకాలను, తాయత్తులను మనకు సుఖాన్ని, సౌఖ్యాన్ని జీవాన్ని ఉత్తేజాన్ని, ఆర్తిని ఆశక్తిని కల్పిస్తామని పిలుస్తున్నాయి. ఇన్ని స్వరాలు గందర గోళంలో మనకు స్పష్టంగా కనిపించేది స్వార్ధమే. కాసులు పండాలి. జేబులు నిండాలి. అంతేగాని, నీవు బాగుపడాలి, ఆనందించాలి అనిగాదు. ఇవేవి మన యాంత్రికత నుండి, నిరాశక్తతనుండి బయటపడేసే మార్గాలు కావు.

మనలను బయట పడవేసే స్వరం శ్రీయేసే. 'నా గొర్రెలు నా స్వరంను ఆలకించును”. ఆయనే ఉత్తమ కాపరి, మేపరి, మనం ఆనందంగా నుండాలని, క్షేమంగా నుండాలని మనసారా కాంక్షించి పనిచేసే కాపరి. ఆయన స్వరంను ఆలించడంలోనే మనం జీవించగలుగుతాం. ఆలించమంటే విధేయించడం. ఆయన నడుపుదలలోనికి రావడం, అదే జీవ చిట్కా, మనలను బయటపడేసే మార్గం శ్రీయేసే. “నేనే ద్వారంను!” అన్నాడు ప్రభువు. “ద్వారం” అనునది బైబిల్ లో ఓ భావ చిత్రం. ఎడారిలో యాకోబు ఒక నిచ్చెనను చూసాడు. ఆ నిచ్చెన స్వర్గానికి దారి. (ఆది. 28:17). న్యాయం, శాంతి స్థితులకు నడిపించే మార్గాలను స్వర్గ దారులుగా, దేవుని నివాసానికి దారులుగా వర్ణించారు (చూడు యెషయా 11, కీర్త. 122:2, 118:19-20). దారులు క్రొత్త ప్రాంతాలకు చేరుస్తాయి. యేసు ఖచ్చితమైన దారి. ఆయన గుండా మనం దైవ వాతావరణంలోనికి ప్రవేశ పెట్టబడతాం. రాకెట్టు ఉపగ్రహాన్ని రోదసీలోనిక ప్రవేశపెట్టేటట్లు, క్రీస్తు ద్వారం, క్రీస్తు అనుచురులను దైవ వాతావరణంలోనికి ప్రవేశపెడుతుంది. అనంత జీవలోకం లోనికి ప్రవేశ భాగ్యాన్నిస్తుంది క్రీస్తు ద్వారం.

ఈ అనంత జీవ లోకంలో ప్రవేశించు క్రీస్తు అనుచరుడు మొదటగా, స్వేచ్చా సమృద్ధిని సొంతం చేసుకొంటాడు. అతడు విడుదలను అనుభవిస్తాడు. “అతడు వచ్చుచు, పోవుచు ఉండును” యోహా. 10: 9. రెండవదిగా, అనంత జీవలోకంలోనికి యేసు ద్వారం గుండా ప్రవేశించువారికి ఆయన యందు మేత లభించును. సర్వరకాల ఆకలి, కోరికలు సంతృప్తి పరచబడును. ఆయనలో జీవాన్ని ఉద్దీపనం చేసే మేత దొరుకుతుంది. స్వేచ్చా స్వాతంత్ర్యాలు, ఆకలిని దీర్చే మేత, యేసునియందు లభిస్తాయి. యేసే క్రొత్త జీవన ప్రాంత మవుతాడు. ఆయనే దేవుని అనంత నివాస ప్రాంతం. ఆయన ద్వారా మన ముందుంటుంది. మనం క్షేమకరంగా, ఆనందకరంగా, సుఖ కరంగా మన జీవితాన్ని గడపడానికి కావలసిన పరిస్థితులన్నీ ఆయనలో నున్నాయి.

ఆయనలో సమృద్ధి జీవముంది. అందుకే తన ప్రేషిత కార్యంగూర్చి ఆయన అన్నాడు. నేను జీవంను యిచ్చుటకును, సమృద్ధిగా నిచ్చుటకును వచ్చియున్నాను” (యోహా. 10:10) యోహాను సువార్తంతా యేసుని జీవ ప్రదాతగా పరిచయం చేసారు. ఆయన నామమున జీవం పొందుటకు సువార్త వ్రాయబడింది. దానిని విశ్వాసం ద్వారా పొందుతారు. యోహా. 20:31. ఈ జీవం, కుమారునిగా యేసు తండ్రితో పంచుకొనిన జీవం. దానిని మానవాళి కందించ వచ్చాడు ప్రభు యేసు. యోహా. 5:16. తండ్రి ఆ జీవాన్ని నిత్య జీవాన్ని మనతో పంచుకోవాలని ప్రేమతో ఉవ్విళ్లూరి, యేసుని అంచెలంచెలుగా యేసుని రక్షకునిగా, దైవ కుమారునిగా, జీవ ప్రధాతగా పరిచయం చేసాడు గ్రంధ కర్త, యేసే నిత్య జీవమార్గం, యేసే దివ్య జీవాష్కరణ. యోహా. 14:6.

సంపూర్ణత నుండి మాత్రమే సంపూర్ణత సిద్ధించగలదు. సంపూర్ణత అసంపూర్ణ తకు జన్మనివ్వదు. యేసునిలో జీవం సమృద్ధిగా నుండడం వలన ఆయన సమృద్ధిగా నిస్తాడు. కానాపల్లెలో ద్రాక్షారసం తక్కువపడగా ఆయాబానాల రసాన్ని.... సమృద్ధిగా ఇచ్చాడు. అందరూ పంచుకోగా, ఇంకా మిగిలింది . యోహా. 2:6-7. దాహార్తిని తీర్చుకోడానికి నీటి కోసం బావి కడకు వచ్చిన సమారియా స్త్రీకి, ఇక దాహం పొందకుండా నుండడానికి జీవజలాల బావినే ఇచ్చాడు. యోహా. 4:14. ఆకలిగొన్న సాదా జనానికి 5 రొట్టెలను 5 వేల మందికి పంచి, మిగిలినవి 12 గంపల కెత్తేటట్లు సమృద్ధిగా ఇచ్చాడు. యోహా. 6:10-12. శిష్యులు రాత్రంతా శ్రమపడగా ఏమీ చేపలు పడ్డాయి. సమృద్దిగా నిచ్చుట యేసుని గుణం. కొరతలేని జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని, అనంత జీవాన్ని, స్వచ్ఛమైన జీవాన్ని, సమృద్ధియైన జీవాన్ని, నిత్యం బ్రతికింపచేసే జీవాన్ని..... దివ్య జీవాన్ని..... జీవ చైతన్యాన్ని యేసు దయచేస్తాడు. మనలను దివ్యజీవ మూలలకు కలుపుతాడు. ఆ భాగ్యానికి నోచుకోవాలంటే మనం చేయవలసిందల్లా ఒకే ఒక పని. ఆయన స్వరం వినాలి. ఆయన దగ్గరకు రావాలి. ఆయన స్వరం వినడమనగా ఆయన నడిపింపును విధేయించడం. ఆయన దగ్గరకు వచ్చుట అనగా యోహాను సువార్తలో ఒక సాంకేతిక పదం. దాని అర్థం విశ్వసించుట. విశ్వాసం ద్వారా యేసుకు అంకితమవుట వలన పరస్పర బంధమేర్పడుతుంది. ఈ బంధం ప్రేమ మార్గాన మనలను నడుపుతుంది. ఆ విధంగా విశ్వాస ప్రేమ మార్గాల ద్వారా సమృద్ధి జీవాన్ని పొందగలుగుతాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN