సందేహ నివృత్తి

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

23 Apr 2026

ప్రశ్న -:
యేసుక్రీస్తు 'ఏమ్మావున్' దారిలో దర్శనమిచ్చినట్లు లూకా మాత్రమే వివరిస్తారు, అందుకు కారణమేమైనా ఉన్నదా?

సమాధానం -:
సువిశేషకులు మౌఖిక సంప్రదాయం ద్వారా తమకు లభించిన విషయాల మీద ఆధారపడినారని పండితుల అభిప్రాయం.ఈ క్రమంలో లూకాకు మాత్రమే ఈ సంఘటన దొరికి ఉండవచ్చు. ఇది ఇతరులకు తెలియకపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా ఎమ్మావుస్ వృత్తాంతం,పాఠకులు ఎదురు చూసే నిధిలా కనిపిస్తుంది. దైవజ్ఞానాన్ని వెదకే భక్తులకు పుట్టెడంత జ్ఞానాన్ని ప్రసాదించే సన్నివేశమిది.ఎమ్మావుస్ అనే గ్రామం యెరుషలేము పట్టణానికి పశ్చిమభాగాన ఉన్నట్లు చెబుతారు.అయితే ప్రస్తుతం ఈ గ్రామ ఆనవాళ్ళు కనపించవు.పునరుత్థాన క్రీస్తు కనుపించిన ప్రదేశంలో మాత్రం ఒక గుడి, శిథిలావస్థలో దర్శనమిస్తుంది.అప్పుడు జరిగిన అద్భుత దృశ్యానికి ఆ శిథిలాలే సాక్షాలు. శిష్యులిద్దరూ ఎమ్మావుస్ కు ప్రయాణమై పోయారంటాడు. లూకా.వారిలో ఒకరి పేరు మాత్రం చెప్పబడింది (క్లెయోఫా) రెండవ వ్యక్తి పేరు కనుపించదు.బహుశా ఆరెండవ వ్యక్తి పాఠకుడే కావాలని రచయిత కోరుకుంటున్నాడేమో! ఎందుకంటే ప్రభువు అనునయంగా భుజం మీద చేయివేసి,ఆయన అనుభవించిన శ్రమల పరమార్ధం,పునరుత్థాన మహిమ గురించి వివరంగా చెప్పడం జరిగింది.ఆ సమయంలో వారి హృదయాలు ప్రజ్వరిల్లాయి కదా! ఆ అనుభవం ప్రతిపాఠకునిదీ కావాలనే బహుశా రచయిత రెండవ వ్యక్తి పేరు ప్రస్తావించలేదేమో!.

ఆయన వారితో కలిసి భోజనానికి కూర్చున్నపుడు, రొట్టె విరిచినపుడు,ఆయన్ను వారు గుర్తించారు.వెంటనే ఆయన అదృశ్యమైపోయాడు. వారు యేసును గుర్తించగానే ఆయన అదృశ్యమైపోయాడు. ఆయన వారితో కొంతసేపు గడుపవచ్చును గదా! వారికి ఆనందాన్ని కలుగ జేయ్యోచ్చు గదా,అని మనం భావించవచ్చు కానీ ప్రభువు ఒకచోటే ఉండకూడదు.ఇంత వరకు ఆయన భౌతికంగా వారితో ఉన్నాడు.కానీ ఇప్పుడు తన పునరుత్థానంతో అంతటా ఉంటాడు.ఆయన తమ దగ్గరే ఉండమని వారు అడుగకూడదు.ఆయన భౌతికంగా వారిమధ్య లేకున్నా జీవించగలిగే శక్తి వారికి రావాలి.అది వారే నేర్చుకోవాలి. అందుకే ప్రభువు "నన్ను "ముట్టుకోవద్దు" అంటూ మరియమగ్దలేనను వారిస్తాడు. కారణం ఇక వీరు ఆయన్ను తమ వద్దే ప్రేమతోనూ, వాత్సల్యంతోనూ బంధించకూడదు.ఆయన అందరికీ చెందినవాడు. అంతటా ఉంటాడు. అందరివాడు.

ఈనాడు ఆయన వాక్యం ద్వారా, దివ్యసత్ప్రసాదం ద్వారా,గురువుల ద్వారా అన్నిచోట్లా ఉన్నాడు.ఆయన ప్రత్యక్షతను గురువులు ప్రజలకు తమ జీవితాల ద్వారా నిరూపించాలి. ఆయన వాక్యాన్ని బోధిస్తూ క్రొత్తవారికి ఆయన్ను పరిచయం చేయాలి. దివ్యబలిపూజ ద్వారా ఆయనను ప్రజల సమీపానికి తీసుకురావాలి.ఇదే గురువులు చేయవలసిన గురుతర బాధ్యత. -ఎమ్మావుస్ మార్గంలో అటు గురువులకు, ఇటు ప్రజలకు ప్రభువు అపూర్వమైన సందేశాన్ని ఇస్తూ, చైతన్యవంతులను చేయడం గమనించాలి. ఈ సంఘటన చదివిన ప్రతిసారి, భక్తి భావాలతో మనసు పులకించి పోవాలి..

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN