జీవాహారం నేనే
జోసెఫ్ అవినాష్
21 Apr 2026
పాస్కా 3వ బుధవారం
అ.కా 8:1-8
కీర్తన 66:1-3,4-7
యోహాను 6:35-40
ధ్యానం:
"జీవాహారం నేనే"
మరియతల్లి దైవ తనయుని తొమ్మిది మాసాలు తన గర్భాన మోసి దైవ మందసంగా అలరారింది.అందుకే మరియతల్లి ఎలిజబెతును సందర్శించినప్పుడు "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భఫలం ఆశీర్వదింపబడెను" (లూకా 1:42) అని ఎలుగెత్తి స్తుతించింది.మరియ గర్భఫలముగా భువికరుదెంచిన క్రీస్తుప్రభువు తండ్రి రాజ్యస్థాపన గావిస్తూ "ఆ జీవాహారాన్ని మాకు ఒసగండి" అని ప్రాధేయపడు వారికి "నా వద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలిగొనడు.నన్ను విశ్వసించువాడు ఎన్నడూ దప్పిగొనడు" అని ప్రకటించాడు.అనగా అలనాడు తండ్రి ఎడారిలో తన ప్రజల శారీరక ఆకలి తీర్చేందుకు మన్నా భోజనాన్ని సమకూర్చినట్లే నేడు మానవుల ఆధ్యాత్మిక ఆకలి తీర్చిరేందుకు ఆయన ఏకైక కుమారుడైన తననే పంపించడాని పలికాడు.
తానే జీవాహారం,నిత్యజీవం పొందాలంటే తనను భుజించాల్సిందే అని పలికినపుడు చాలామంది అర్ధం చేసుకోలేదు.అర్థం చేసుకున్నవారు ఆయనను అంటి పెట్టుకొని ముందుకు సాగారు.కడరా భోజన సమయంలో ఆయన శరీర రక్తాలను స్వీకరించారు. ఆయన ఆజ్ఞానుసారం జీవాహారాన్ని ఆయన సంఘస్థులకు పంచుతూ వారి విశ్వాసాన్ని పెంచుతూ అపోస్తలులు,శిష్యులు, సంఘసభ్యులు తరించారు.ఆ దివ్య భోజనం వారికి ఒసగిన ఆధ్యాత్మిక శక్తిచే శ్రమలను ఆనందంగా స్వీకరించారు. కారాగారాలను,కొరడా దెబ్బలను కౌగలించుకున్నారు.
యేసు శరీర రకాలను స్వీకరిస్తూ కదలాడే దైవ మందసాలుగా రూపుదాల్చారు.తమతో పాటు ఆయనను తీసుకెళ్లి అనేకులు ఆ దైవతనయుని కొలిచేలా చేసారు.ఓ వైపు వేదహింసలు ప్రబలుతుంటే మరోవైపు యెరూషలేము వీడి పలు ఇతర ప్రదేశాలకు,సిరియా ప్రాంతానికి వెళ్లి సువార్తను ప్రకటించారు.సౌలు దైవ సంఘాన్ని హింసిస్తున్నా,తమ విశ్వాసాన్ని విడనాడక సువార్త నిమిత్తం శ్రమలు అనుభవిస్తూనే ప్రపంచ నలుమూలలకు సందేశాన్ని చేరవేశారు.
నేడు మనం దివ్యపూజలో పాల్గొన్న ప్రతిసారి ఆధ్యాత్మిక భోజనాన్ని స్వీకరించే భాగ్యాన్ని పొందాం.దైవమందసంలో వశమై ఉండే క్రీస్తుప్రభువును ఎంత గొప్పగా ఆరాధిస్తామో అంతే అధికంగా మన లోనికి వేంచేసి వచ్చే ప్రభువును ఆరాధించాలి.ప్రభు శరీర రక్తాలను స్వీకరించే మనం కూడా దైవ మందసాలుగా మారుతున్నామని, సమాజంలోకి దైవాన్ని మనతో పాటు తీసుకొని వెళ్తున్నామని మన మాట,సమాన ప్రవర్తన, మన జీవన విధానం ఆయననే ప్రతిబింబించాలని మరువరాదు.దివ్య పూజలో యోగ్యంగా పాల్గొనడం.దివ్య భోజనాన్ని భక్తియుతంగా స్వీకరిద్దాం.నడయాడే మందసంగా సమాజంలోకి పయనిద్దాం.రక్షణ పొందాలంటే ఈయన శరీర రక్తాలను గైకొనాల్సిందేనని ప్రకటిద్దాం.
