నేటి పునీతులు: పునీత ఆన్సెల్మ్

ఫాదర్ ఆకుల ప్రసాద్

20 Apr 2026

సుగుణం: “శ్రీసభ పండితుడు & పోరాట ధీరుడు”

పునీత ఆన్సెల్మ్ గారు ఇటలీలోని ఆల్ప్స్ పర్వతాలకు దగ్గరలో అవోస్తా ప్రాంతంలోని మంతువా గ్రామంలో క్రీ.శ.1033లో జన్మించారు. ఆన్సెల్మ్ గారి తల్లి ఫ్రాన్స్ దేశానికి చెందిన వనిత.మంచితనానికి, పరిశుద్ధత్వానికి ఆమె మారుపేరు. కానీ చిన్ననాడే ఆమెను కోల్పోయి కోపిస్టి యైన తండ్రి చేతులలో బాధలు పొందలేక తన తల్లి మాతృదేశమైన ఫ్రాన్స్ కు ఆన్సెల్మ్ గారు పారిపోయి అనేక సంవత్సరాలు కాలాన్ని వృదాచేశాడు. చివరకు జీవితం వ్యర్థం కానివ్వకూడదని గ్రహించి గురువు అవ్వాలని క్రీ.శ. 1060లో నార్మండిలోని బెక్ పట్టణంలో వున్న బెనెడిక్టు సభకు చెందిన మఠాలయంలో ప్రవేశించారు. తత్వవేదాంత శాస్త్రాలను నేర్చిన వీరు మంచి గురువై క్రీ.శ.1078లో మఠాధిపతిగా నియమించబడ్డారు. 'ఒకే సర్వేశ్వరుడు', 'ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు' అనే వేదసత్యాలపై మంచి వాదనలతో వీరు గ్రంధాలు వ్రాసి శ్రీసభ పండితునిగా గణుతికెక్కారు. క్రీ.శ.1093లో ఇంగ్లాండులోని కాంట్రబరీ ఆర్చిబిషప్పుగా ఎన్నికైనారు. అక్కడి విల్లియమ్ రూఫస్ రాజు, పీఠానికి వచ్చే ఆదాయాన్ని కాజేస్తూవుండటంతో అతని అదుపాజ్ఞల్లో ఉండటం ఇష్టంలేక ఆన్సెల్మ్ గారు అతనితో విభేదించారు. దానిఫలితంగా రాజ్య బహిష్కరణ చేయబడి రోముకు వెళ్ళి 1వ అర్బన్ పోపుగారి చెంతనే వున్నారు. రూఫస్ రాజు మరణానంతరం క్రీ.శ.1100లో తిరిగి కాంట్రబరీ పీఠానికి వచ్చిననూ 1వ హెన్రీ రాజు పేత్తనాన్ని విభేదించి తిరిగి క్రీ.శ.1103లో రోముకు వెళ్ళిపోయారు. చివరకు క్రీ.శ.1107లో తిరిగి ఇంగ్లాండు వచ్చి రాజుతో శాంతి చర్చలు జరిపి పీఠానికి మంచికాపరిగా శక్తివంచనలేక కృషి చేశారు. వీరు నిరంతరం సాధారణ ప్రజలకు అందుబాటులో వుండేవారు. శ్రీసభ ఆస్థిపాస్తులపై శ్రీసభకు మాత్రమే పూర్తి అధికారం, స్వేచ్చ వుండాలన్నది ఆయన అభిమతం. దానిని పోపుగారు కూడా సమర్థించారు. ఆన్సెల్మ్ గారు క్రీ.శ.1109లో కాంట్రబరీ నందు పరలోకప్రాప్తినొందారు. శ్రీసభ హక్కులకోసం, త్యాగంతో, ఓర్పుతో పోరాడిన బిషప్పుగా ఆన్సెల్మ్ గారు కీర్తిగడించారు.

బంగారు మాట:
క్రీస్తుతో సఖ్యత లేకుండా
మనం స్వేచ్ఛాజీవులం కాలేము,
క్రీస్తే మన సర్వస్వం"
పునీత ఆన్సెల్మ్

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN