సహాయకునికి సహాయం

Father gopu praveen
19 Apr 2026
పాస్కా 3వ సోమవారం
అ.కా 6:8-15
కీర్తన 119:23,24,26-30
యోహాను 6:22-29
నేను యువత డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో ఎంతోమంది విద్యార్థులకు యువతీయువకులకు పలు సమావేశాలు నిర్వహించాను. అనేకసార్లు వారితో నేను నమ్మిన సిద్ధాంతం "ఆకలితో నిన్ను ఆశ్రయించిన వ్యక్తికి చేపను ఇస్తే ఆ సమయంలో అతని ఆకలిని తీరిస్తే,ఆ చేపను ఎలా పెట్టాలో నేర్పితే తానే పది మంది ఆకల్ని తీరుస్తాడు" అని బోధించాను. నిజమే! మన ఆకలిని తీర్చుకుంటూనే పదుగురి ఆకలి తీరుస్తున్నపుడు లభించే సంతృప్తి,సంతోషం అనన్యసామాన్యం.
తన వాక్యాలను ఆలకించుటకు,శారీరక స్వస్థత పొందుటకు ఆయన చెంత చేరిన జనులు అడగకపోయినా మార్గమధ్యనే అలసి సొలసి పడిపోకుండా వారికి సంతృప్తిగా భోజనాన్ని సమకూర్చాడు.అందరు సమృద్ధిగా భుజించిన పిదప మిగిలిన రొట్టె ముక్కలను పండ్రెండు గంపలకు నింపారు. చేరిన ప్రజలు మాత్రం ఆనందంగా తమ తమ ఇళ్లకు వెళ్లారు.అలా వెళ్ళిన వారు తమ ఇరుగుపొరుగు వారికి కూడా యేసు చేసిన అద్భుతాన్ని తెలియజేసి మరునాడు వేకువనే అందరు కలిసి మరో మారు శారీరిక భోజనాన్ని అందుకోవాలని తమ పితరులు ఎడారిలో మన్నా భోజనాన్ని భుజించినట్లు యేసు ఒసగే రొట్టెలు,చేపల భోజనాన్ని సంతృప్తిగా భుజించాలని ఆయన కొరకు వెదికారు. అయితే తన దరిచేరే వారిని లోతైన జలాల వైపు నడిపిస్తాడని. ప్రశస్తమైన ఉన్నతమైన ఆహారంకై శ్రమించమని పిలుపునిస్తాడని వారికి తెలియదు.
తన చెంత చేరిన ప్రతి ఒకరిని యేసు అదే విధంగా నడిపించాడు.సాధారణ విషయాలతో ఆరంభించి ఆధ్యాత్మిక రుచుల వైపు ఆకర్షించాడు.అందుకే మరునాడు తన చెంత చేరిన ప్రజలతో నిర్మొహమాటంగా "నిన్న నేనొసగిన రొట్టెలు తిని నేడు నన్ను వెదకుచున్నారు. నిత్యజీవాన్ని చేకూర్చు శాశ్వత భోజనానికి శ్రమించండి." అని పిలుపునిచ్చాడు.నికోదేము ఆ పిలుపులోని అర్థాన్ని గ్రహించాడు.శాశ్వత భోజనంతో సంతృప్తి చెందాడు. సమరయ స్త్రీ ఆయనలోని దైవత్వాన్ని గుర్తించింది. జీవజాలాలను సొంతం చేసుకుంది.అపోస్తలులు అలస్యంగానైనా ఆయన శరీర రక్తలను స్వీకరించారు.తమ జీవితాలను సువార్త సేవకు అంకితమొనర్చారు.భోజన సదుపాయాలు సంఘస్థులందరికి సమకూర్చే పరిచర్యలో ఏ ఒక్కరు ఎలాంటి నిర్లక్ష్యానికి గురికాకుండా ఉండడానికి ఎంపికైన స్తెఫను తనకు అప్పగించిన బాధ్యతల ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ఆధ్యాత్మిక భోజనం గురించి బోధించాడు.బోధిస్తూ క్రీస్తుకు సాక్షిగా నిలిచాడు.ధైర్యంగా నిల్చొని మతపెద్దలకు సహితం పెను సవాలుగా మారాడు.
