ఉత్థాన క్రీస్తు మన జీవితాలకు గమ్యాన్ని, నిండుదనాన్ని ఇస్తాడు

Rev. Fr. Sesetti Mariadas M.S.F.S.

18 Apr 2026

పాస్కా మూడవ ఆదివారం
అపో.చ. 2:14,22-28,
1 పేతు. 1:17-21,
లూకా 24:13-35
ఉత్థాన క్రీస్తు మన జీవితాలకు గమ్యాన్ని, నిండుదనాన్ని ఇస్తాడు. ఆయన శిష్యులుగా మనం ఆయన వెనుక నడువగలగాలి. ఆయనతో నుండగలగాలి. ఆయనతో నుండుటకు గల మార్గాలను గ్రహించి మన జీవితాలను ఆయనతో నడిపించుకొన్న మన జీవిత యాత్ర ఆనందమయం అవుతుంది. ఇదే నేటి దివ్యగ్రంథ పఠనాల సందేశం. ధ్యానిద్దాం.

1. అపో.చ. 2:14, 22-28 : పెంతెకోస్తు పండుగనాడు అపోస్తలులపై ఆత్మ దిగిరాగ, వారు అన్యభాషలలో మాట్లాడారు. యెరూషలేం వారంతా గుమికూడగ, పేతురు ప్రసంగించాడు. యేసుని దేవుడు రూఢీపరచిన విధానాన్ని గూర్చి చెప్పాడు. యేసునియందు అప్పగించారు. వారు యేసుని చంపించారు. పాపంను మూటకట్టు కున్నారు. యేసుని విషయంలో ఈ మానవ దుష్ట క్రియలు, దైవ సంఘటనలు దేవుని సంకల్పానికి దుష్టక్రియలు, దైవ సంఘటనలు దేవుని సంకల్పానికి అనుగుణంగా నున్నవని వేదగ్రంథ భాగాలు బలపరుస్తున్నాయి. దేవుడు యేసుని మృత్యుంజయునిగా దీవించాడు. మరణం ఆయనపై ఆధిపత్యాన్ని కలిగి లేదు. దావీదుని ప్రవక్తగా చేసే సాంప్రదాయం యూదులలో ఉంది. ఆయన కీర్తనలను వ్రాసాడను సాంప్రదాయం వారిలో నుంది కనుక దావీదు మాటలుగా కీర్తన వాక్యాలను తీసుకొని, యేసు సజీవుడని జీవోద్దారకుడని రూఢీపరచాడు. అపోస్తలుల చర్యలు గ్రంధకర్త. యూదులు కుట్రతో చంపబడిన యేసు మరణం నుండి లేచినవాడు. ఆయన సజీవుడు.

2. 1పేతురు 1:17-21 : పేతురు మొదటి లేఖ హింసలవలన బెదరిపోయిన క్రొత్త క్రైస్తవులను ఉద్దేశించి వ్రాయబడింది. వారి కష్టకాలంలో ప్రోత్సహిస్తూ, ఓపిక పట్టమని, వారి శ్రమలద్వారా క్రీస్తుని శ్రమలలో పాలుపంచుకొంటున్నారని లేఖకుడు ప్రోత్సహిస్తున్నాడు. ఈ లేఖలోని మొదటి భాగంలో (1:3-2:10) క్రైస్తవ పిలుపు ఔన్నత్యంను, దాని బాధ్యతలను లేఖకుడు తెలియచేస్తున్నాడు. తండ్రి కాంక్షించిన మన రక్షణను యేసు సాధించగా ఆత్మ దానిని విశదపరచింది. (1:3-12). రక్షించబడిన విశ్వాసులందరు పవిత్ర జీవనానికై పిలువబడ్డారు. వారు పరిశుద్ధతలో పెరగడానికి కృషిచేయాలి. సిద్ధపడాలి. మెలకువతో ఉండాలి. పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక పిలువబడిన వారందరు పరిశుద్ధతకు కృషిచేయాలి. రక్షణవలన దేవుడు పరిచయమయ్యాడు. ఆ దేవుడు మనకు సన్నిహితుడు. ఆయన మన తండ్రి. ఆ తండ్రితో దగ్గరి సంబంధముందని అశ్రద్ధతో కూడిన నడవడికను, నడతను పాటించలేము. చట్టవిరోధులుగా ప్రవర్తించలేము. (4:47) అందరితో పాటు మనలను కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక ఈ జీవితాన్ని భయభక్తులతో గడపాలి. కారణమేమనగా వారు క్రీస్తు విశ్వాసులు, క్రైస్తవులు గొప్ప వెలయిచ్చికొనబడి విమోచింపబడినవారు. నిష్కళంకమైన పాస్కాబలిగొర్రెపిల్ల వంటి క్రీస్తు ప్రాణార్పణ ద్వారా విమోచింపబడినవారు, నూతన జన్మను పొందియున్నారు. నిత్యుడగు తండ్రికి బిడ్డలయ్యారు. ఈ రక్షణ కార్యం క్రీస్తు ద్వారా సిద్ధించింది. మానవులను తన సంతానంగా చేసుకొనడానికి అనాది నుండి దేవుడు పధకాలను వేసి, యేసుని ఎన్నుకొన్నాడు. ఆ పధకాలను కడరోజులలో తెలియపరచాడు. తన రక్షణ పధకాన్ని ప్రాణార్పణ ద్వారా సాకారం చేసిన క్రీస్తుని దేవుడు మృత్యుంజయుని చేసాడు. వైభవాన్ని ప్రసాదించాడు. ఆ దేవునియందే మన విశ్వాసము, నమ్మిక, నిరీక్షణ, ప్రేమ వున్నాయి.

3. లూకా 24:13-35 : ఈ భాగం లూకా సువార్త చివరి భాగంలోనిది. లూకా సువార్త మొత్తం దేవుడు విశ్వసనీయుడు, ఆయన వాగ్దానాలను నెరవేర్చువాడు అని చెప్పబడింది. ఇశ్రయేలును ఎన్నుకొని వాగ్దానం చేసిన దేవుడుగనే యెరూషలేం సర్వనాశనమైంది. ఇంక అన్యుజాతులనుండి పిలువబడిన వారికి ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాడా? అన్న విశ్వాసుల అంతర్మధనానికి లూకా రచయిత జవాబు చెపుతూ, యేసుని కధనాన్ని చెప్పాడు. ఆయన జన్మలో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. చివరకు ఆయనను మృతులనుండి లేవనెత్తుటలో దేవుని వాగ్దా నాలు నెరవేరాయి. లోక నలుమూలలనుండి వచ్చి యేసుని అనుసరిస్తున్న శిష్యరిక ప్రయాణంలోనున్న వారందరి విషయంలో దేవుడు విశ్వసనీయుడుగా నిలుస్తాడని లూకా భరోసా యిచ్చాడు.

క్రీస్తుని సిలువ మరణంతో డీలా పడిపోయిన శిష్యులకు, క్రీస్తు పునరుత్థానుడై దర్శనమిచ్చి వారి దుఃఖం నుండి ఆనందానికి, సందిగ్ధతనుండి అవగాహనకు, అవిశ్వాసం యేసు ద్వారా దేవుడు చేయునున్న మహత్కార్యాన్ని చూచేటట్లు వారి కళ్ళను విప్పించాడు. (28:56-53). ఇందులో భాగంగా నేటి సువార్త పఠనంలో (24:13-35) ఎమ్మావు గ్రామ మార్గంలో ఇరువురు శిష్యులకు ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చాడు.

లూకా సువార్తలో మాత్రమే చెప్పబడిన ఈ ఎమ్మావు సంఘటన కథనంలో లూకా సువార్తలో ప్రధానంగా కనబడే ప్రయాణం, వీక్షించుటే విశ్వాసం మరియు ఆతిధ్యం మున్నగు ధ్యానాంశాలున్నాయి. యేసు ఇద్దరు శిష్యులు, వారి ఆశలు నెరవేరలేదని, వారు ఆశించిన ప్రకారం యేసు సాధించలేదని నిరుత్సాహపడి ప్రభు మార్గాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. వారి అవిశ్వాస్యత స్త్రీల విశ్వాస్యతతో, ప్రామాణికతతో పోల్చబడింది. (23:49-24:12). ఈ ఇరువురు శిష్యులకు ఉత్థాన క్రీస్తు నచ్చచెప్పి, కళ్ళు తెరిపించగా, వారు శిష్య సంఘంతో చేరడానికి యెరూషలేం ప్రయాణమయ్యారు. మరోక విషయం చూడడం అన్నా అంశం లూకా సువార్త మొత్తం అల్లుకొనివుంది. (9:45; 18:34, 23:8, 35,47:49). ఈ సువార్త పఠన భాగంలో కూడా ఈ భావనను పట్టి చూపాడు సువార్తీకుడు. (22:23,31,32,35). దేవుని పధకాలలో ఆయన చూడడానికి ఉత్థాన క్రీస్తు శిష్యుల కళ్ళను తెరిపించాడు. అనామకునికిచ్చిన ఆతిధ్యంతో వారికి కనువిప్పు కలిగింది.

ఈ సువార్త మన ధ్యానానికి మన ముందుంచే మరికొన్ని భావాలు:
1. ఉత్థాన క్రీస్తుతో నడచుట: మన జీవిత యాత్రలో ఉత్తాన క్రీస్తు మనతో పాటు నడుస్తున్నాడు. (15,28, 32 వచనాలు).
2. దివ్య సంస్కారంలలో, దివ్యవాక్కులో ఉత్థాన క్రీస్తుని గుర్తించుట : దివ్యవాక్కు పరమార్థాన్ని విరచిపంచుట ద్వారా, రొట్టెను విరచిపంచుట ద్వారా మనం ఉత్థాన నాధుని గుర్తించగలుగుదుము. (27,30-32 వచనాలు).
3. మన వ్యధా భవిత క్షణాలలో ఉత్థాన క్రీస్తునికి ఎదురుపడుట: మన దుఃఖంలో నున్నపుడు, డీలాపడి నిరుత్సాహంలోనున్నపుడు ఉత్థాన క్రీస్తు మనతో పాటు నడిచి, బలపరుస్తాడు, (13:17 వచనాలు)
4. పరిశుద్ధ గ్రంథ పఠనము : దివ్యగ్రంథ విశ్వాస ప్రాయ పఠనం, ధ్యానం మన హృదయాలను మండింప చేస్తుంది. (27, 32 వచనాలు).
5. మనతో నుండమని ప్రభుని ఆహ్వానించుట : మన జీవిత సంధ్యాసమయంలో మనతో నుండమని ప్రభుని ఆహ్వానించాలి. (28వ వచనం)

ఈ పఠనాలు నేపద్యంలో మనం క్రీస్తుతో నుండడానికి వున్న మార్గాలమీద ధ్యానం చేద్దాం.

నిశీధిలో నిరంతర యానం చేస్తున్నా యాత్రికులం మనం.

ఎమ్మావు అనుభవం - క్రీస్తుతో ఉండడానికి మార్గాలు :

నిశీధిలో నిరంతర యానం చేస్తున్న యాత్రికులం మనం. వెలుగు నీడలమధ్య, కరుకు, గరుకు మార్గాలగుండా, లోయలు లోతులు గుండా ఆనంద విచార అనుభవాలను మూటగట్టుకొంటూ సాగుతున్నా ఈ జీవితం ఓ యాత్ర. ఈ యాత్రలో తీరని వేదనలు సమస్యలు, విఫలమయ్యే ప్రయత్నాలు, నిరాశమిగిల్చే ఆశలు, బాధించే పాపాలు కానరాని పరిష్కారాలు మన కళ్లల్లోని కాంతిని హరించేసి మనలను బాగా కృంగతీస్తున్నాయి. మన జీవన పరిస్థితికి ఎమ్మావు గ్రామ శిష్యుల పరిస్థితికి చాలా సారూప్యతుంది. మనవి కల్లోలిత జీవితాలు. వారివి కూడా.

ఎమ్మావు శిష్యుల జీవితాలు విచారంతో నిండిన జీవితాలు పునరుత్థాన సత్యానికి దూరమైన జీవితాలు. వెలుగును వీడి చీకటికి చేరువ అవుతున్న జీవితాలు. కానీ విశ్వాస హీన జీవితాలు కావు. యేసుని నజరేతు ప్రవక్తగా, దైవ జనునిగా, శక్తిమంతు నిగా, శక్తిగలవాక్కును కలవానిగ, మహాత్కార్యాలు చేయు వానిగా, ఇశ్రాయేలు విమోచనను తేగల మెస్సియాగా నమ్మారు. వారి సమస్యల్లా వారు ఊహించిన ప్రకారం దేవుడు పనిచేయడం లేదు. దేవుడు ఆశ్చర్యకరుడను, ఆయన మార్గాలు ఆశ్చర్యకరమై నదని తెలుసుకోలేకపోయారు. కనువిప్పు కలగని జీవితాలను జీవిస్తున్నారు. యేసు వారితో నడుస్తున్నాడు. బోధిస్తున్నాడు. వారి హృదయాలను జ్వలింపచేస్తున్నాడు. అయినా ఆయన స్వరాన్ని గుర్తించలేని మందమతులుగా ప్రవర్తించారు.

కాని ఆ ఇద్దరు శిష్యులు గొప్పవారు. వారి విశ్వాసం అసంపూర్ణమైనదైనా, నిలకడ లేనిదైనా, వారు చీకటిలోనికి (సంధ్యవేళ) అడుగిడుతున్న, వారి గురుని బోధను వీడలేదు. ఆచరించారు. సహ ప్రయాణీకునికి ఆతిధ్యమందించారు. ఆ చిన్న ప్రేమపూరిత క్రియ వలన దేవుని గొప్ప కార్యాన్ని అనుభవించగలిగారు. ఆ అతిధ్యంలో ఉత్తాన యేసుని కనుగొనే భాగ్యం పొందారు. తద్వారా సాదాపనుల్లో దేవుని దర్శించు భాగ్యం దాగివుందను ఆధ్యాత్మిక సూత్రాన్ని బోధించారు.

ఇంకో విషయాన్ని మనం మననం చేసుకోవాలి. చారిత్రకంగా, లూకా సువార్త సంబోధించిన సంఘం నిరాశలో మునిగి వుంది. త్వరలో వస్తానన్న ప్రభు జాప్యం చేస్తున్నాడు. హింసలు పెచ్చు పెరుగుతున్నాయి. నెర్రలు బారుతున్నవారి విశ్వాసాన్ని తన బోధలో ప్రస్తావించాడు. నీ జీవిత సమస్యలు నీకు అర్థం కాకపోవచ్చు. నేటి జీవితం చీకటిలో నిండిపోవచ్చు. కాని ప్రభుని అనుసరణను వీడకు. వేద బోధల ఆచరణ మానకు. ఈ యాత్రలో నీవు ఒంటరివాడవు కావు. కనిపించని రీతిని ఆయన నీతో నడుస్తున్నాడు. నీకు తోడుగా నున్నాడు. ఊహించని రీతిని సహాయపడుచున్నాడు. దీనినే పేతురు నేటి రెండవ పాఠంలో చెపుతున్నాడు. మనం ఆయనకు దాసోహమవ్వాలి. సమర్పించు కోవాలి. నమ్మకాన్ని కొనసాగించి నమ్మక ప్రాయంగా నిలవాలి. అపోస్తలుల బోధల నాలకించటయందు, సంపు జీవితాభివృద్ధియందు, మరియు రొట్టె విరచుట యందు, ప్రార్ధనయందు శ్రద్ధను వహించినదని ధ్యానించాము. నేటి సువార్తలో ఎమ్మావు శిష్యులు కూడా అవే మూడు విషయాలను ఆచరించారు : దివ్యగ్రంథ ప్రవచనాలను యేసుని సహాయంతో చర్చించారు. యేసుని వారితో నుండమని ఆహ్వానించారు, కలుసుకొన్నారు. ప్రభుని కలుసుకోవడానికి మనకున్న మార్గాలు కూడా ఇవే. వాక్య పఠనం, వాక్యాచరణం, సత్ప్రసాద స్వీకరణ ఉ న్నవి తెంచుకోవడం మేడగదిలోని శిష్య బృందాన్ని (సంఘాన్ని) కలవనంతవరకు మనం ఉత్థాన క్రీస్తుని కలవలేము. అందుకే ఆదివార ఆరాధన అంతముఖ్యం. అది క్రీస్తుని కలిసే అవకాశాన్నిస్తుంది. మన వ్యక్తిగత క్రీస్తు అనుభవాలను సంఘ క్రీస్తు అనుభవంతో నిర్ధారించుకోవడం కూడా ముఖ్యమే. అందుకే ఎమ్మావు శిష్యులు యెరూషలేంకు తిరిగి వెళ్ళారు.

సూచనలు :
1. దివ్యపూజలో ఎమ్మావు శిష్యులు క్రియలన్నీ చేస్తున్నాం. మరి క్రీస్తుని కలువలేక పోతున్నాం. కారణమేమై ఉండవచ్చు. పూర్తి స్పృహతో పూజలో పాల్గొను ప్రయత్నం చేయు.
2. సంఘం యొక్క క్రీస్తు అనుభవాన్ని గూర్చి వివరంగా తెలుసుకోడానికి ప్రయత్నించు.
3. “మాతోవుండు” అని సుకృత జపంగా పదేపదే చెప్పుకో.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN