"భయపడకుడి... నేనే!"

Father gopu praveen
17 Apr 2026
పాస్కా 2వ శనివారం
అ.కా 6:1-7
కీర్తన 33:1-2,4-5,18-19
యోహాను 6:16-21
ధ్యానం:
"భయపడకుడి... నేనే!" మనకు అస్సలు పరిచయం అక్కరలేని పదం 'భయం'. పరిశుద్ధ గ్రంథంలో 365 పర్యాయాలు 'భయపడకుము' అనే పదంతో కూడిన వాక్యాలు దేవుడు ఎల్లాప్పుడు మనకు అత్యంత సమీపంలో ఉన్నాడని ధైర్యాన్నిస్తుంటాయి. ఈ లోక జీవనం కన్నా పరలోక జీవితం శాశ్వతమైనది.నేను దాని కొరకే పరితపిస్తాను, శ్రమిస్తాను అని నిశ్చయించుకొని తదనుగుణంగా జీవితాన్ని మలచుకుంటే కొంత వరకైనా భయం గుప్పిట నుండి బయటపడగలం.
కొద్దీ గంటల ముందే ఐదు రొట్టెలు రెండు చేపల్లా అద్భుతాన్ని తిలకించారు. అందరు భుజించిన పిదప మిగిలిన ముక్కలను వారే పండ్రెండు గంపలకు నింపారు. అయినా సరస్సు మీద చెలరేగిన అలలకు భయపడకపోయినా యేసు సముద్రంపై నడుస్తూ వారిని సమీపించడం చూచి అమితంగా భయకంపితులయ్యారు. భూతం అని తలపిస్తున్న వారితో 'నేనే భయపడకుడి' అని పలికి వారికి కావలసిన ఉపశమనాన్ని కలిగించాడు. చివరికి వారిని పవిత్రాత్మ వరాలచే నింపి వారిలోని పిరికితనాన్ని పారద్రోలి సువార్తకు సాక్షులుగా నిలిపాడు.
భయం గుప్పిట నుండి బయటబడ్డ అపోస్తలులు ధైర్యంగా బహిరంగంగా బోధించారు,సాక్ష్యమిచ్చారు. సందేశాన్ని వ్యాపింపజేసారు. వారిలోని ధైర్యం,వారి బోధనా విధానం ఎంతో మందిని సంఘంలో చేరేలా చేసింది. సంఘవ్యాప్తికి నాందిగా నిలిచింది.సంఘం అభివృద్ధిచెంది కొద్దీ సమస్యలు చుట్టుముట్టినా,ఆ సమస్యల పరిష్కారానికై సరైన నిర్ణయాన్ని తీసుకునేందుకు వారికి కావలసిన సమయస్ఫూర్తిని అనుగ్రహించింది.తమను ఏ కార్యార్థం పిలిచాడో ఆ కార్యాచరణలోనే సాగేలా చేసింది.అందుకే అనుదిన పరిచర్యలో కొందరు నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలిసినపుడు ఆ బాధ్యతలను కూడా తమ మీదే వేసుకొని వాక్యపరిచర్యను నిర్లక్ష్యం చేయకుండా ఆత్మపూరితులైన ఏడుగురు సహాయకులను నియమించేలా చేసి, తాము మాత్రం తమ సహాయమంతా ప్రార్థించుటలో, వాక్యపరిచర్య చేయడంలో నిరంతరాయంగా గడిపేలా చేసింది.మనం కూడా భయం గుప్పిట నుండి బయట పడుదాం. మనతో ప్రభువు కలిసి ప్రయాణం చేస్తున్నాడని గుర్తించి ప్రార్థనలో వాక్యపరిచర్యలో జీవిద్దాం.
