క్రీస్తు తత్వాన్ని అందరికి చాటుదాం

Father gopu praveen

16 Apr 2026

పాస్కా 2వ శుక్రవారం
అ.కా 5:34-42
కీర్తన 27:1,4,13-14
యోహాను 6:1-15
దైవం అందరికి సరిపడు ఆహారాన్ని అందిస్తూనే ఉన్నాడు.కానీ స్వార్థంతో పరులది కూడా దోచుకోవడం, దోచుకొని దాచుకోవడం మన అలవాటుగా చేసుకున్నాం. అందుకే అనేకులు పస్తులుంటున్నారు.ఈ సృష్టికి అందరి ఆకలి తీర్చే శక్తి ఉంది. కాని కొందరి అత్యాశకు గురై కొడిగట్టిన దీపంలా అల్లాడుతోంది.

దైవ ప్రజలు రమారమి ఆరులక్షల మంది (స్త్రీలు పిల్లలు కాక) ఐగుప్తును వీడి స్వేచ్ఛాజీవులుగా ఎడారిలో ప్రవేశిస్తే దైవం వారందరిని 40 సంవత్సరాలు 'మన్నా' భోజనంతో సంతృప్తి పరిచాడు. కష్టాలు ఎదురవగానే దైవంపై భారం వేయక,ఆయనకే వ్యతిరేకంగా నినాదాలు చేసినా,ఆయన ప్రతినిధులు మోషే,అహరోనులను దూషించినా దైవం వారి చేయి విడువలేదు,వాగ్దాన నేలను చేరే వరకు వారికి ఆహారం అందించడం ఆపలేదు.

యేసుప్రభువు సువార్తా పరిచర్యలో భాగంగా పాస్కా పండుగ సమీపించినప్పుడు. ఐదు రొట్టెలను,రెండు చేపలను ఆశీర్వదించి ఐదువేల మంది సంతృప్తిగా భుజించేందుకు పంచిపెట్టాడు.ఆ పిదప మిగిలిన ముక్కలను పండ్రెండు గంపలకు నింపారు.వారిని శారీరక పోషణతో సంతృప్తి పరచి ఆధ్యాత్మిక భోజనానికి పరితపించేందుకు,రాబోవు .. పాస్కాపండుగ సమయంలో తన శరీర రక్తాలనే భోజన పానీయాలుగా స్వీకరించేందుకు మార్గం సుగమం చేసాడు.ఈ అద్భుత కార్యంలో దైవానికి అసాధ్యమైనది ఏదీ ఉండదని ఋజువు చేసాడు.మరోవైపు తనను బలవంతంగా రాజును చేయాలని తలపోసే మూక నుండి వైదొలిగి తాను సేవ చేయడానికే వచ్చానని చాటి చెప్పాడు.

యేసుప్రభువు ఒసగిన ఆధ్యాత్మిక భోజనంతో అపోస్తలులు సంతృప్తి చెందారు.శక్తిని పొందారు. ఆయన చివరి ఆజ్ఞను నెరవేర్చడం ఆరంభించారు. ఆయన ప్రతినిధులుగా నిలిచినందుకు మత పెద్దలు వారిని చంపాలని నిశ్చయించినా గమలియేలు సందేశం ద్వారా తన శిష్యులను రక్షించాడు.కొరడా దెబ్బలు వారి శరీరాలను ఛిద్రం చేసినా సంతోషంతో విచారణ సభ నుండి వెళ్ళిపోతూ అక్కడ చేరిన పెద్దలందరికి తన ప్రేమ సందేశం అందేలా చేసాడు. దైవం మన జీవితాలకు కూడా చక్కని ప్రణాళిక తయారుచేసాడు.కనుక ఆయన ప్రణాళికకు బద్ధులమై జీవిద్దాం.క్రీస్తు తత్వాన్ని అందరికి చాటుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN