నిత్యజీవం వైపు అందరిని నడిపిద్దాం
.jpg)
Father gopu praveen
14 Apr 2026
పాస్కా 2వ బుధవారం
అ.కా 5:17-26
కీర్తన 34:2-9
యోహాను 3:16-21
ధ్యానం:
పవిత్ర గ్రంథమంతా మానవులపై దైవానికి గల అపారమైన ప్రేమను సూచిస్తుంది.తన పోలికతో, తన రూపకారాలతో,తన స్వహస్తాలతో సృజించిన మనలను ఆయన ఎన్నడూ చేయి విడువడు.మనం ఆయన చేయి విడిచినా, ఆయన నామాన్ని ఉచ్చరించడం మరచినా ఆయన మాత్రం మన చేయి విడువడు,మనలను మరువడు.
ఇదే సందేశాన్ని 'దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎవరు నాశనం కాకుండా నిత్యజీవము పొందడానికి అలా చేసాడు' (యోహాను 3:16). ఆదాము ఏవలు దైవ ధిక్కారం చేయక ముందు ఎలాగైతే దైవంతో సంభాషిస్తూ,దైవాన్ని చూస్తూ గడిపారో అదే విధంగా మన జీవితాలను గడిపేందుకు ఆయనతో సంచరిస్తూ,ఆయన ప్రేమాలయాలుగా మనలను మార్చేందుకు మన స్థాయికి దిగివచ్చాడు.ఒక్క పాపం మినహా అన్నిటిలో మనతో సరిసమానుడై మానవ జీవిత ఔన్నత్యాన్ని,దైవసృష్టి గొప్పదనాన్ని చాటి చెప్పాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది తండ్రికి మన మీద గల ప్రేమను చాటి చెప్పేందుకే.ఆయన రాక విశ్వసించే వారందరికీ నిత్యజీవాన్ని ప్రసాదించడానికే అని తెలుసుకున్న వారు తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు.ఆయనకు ప్రియమైన సైనికులుగా తయారయ్యారు.
'తినగ తినగ వేము తీయనుండు' సామెత చందాన 'ప్రేమించగ ప్రేమించగ జీవితాలు ధన్యమగును' అని తెలుసుకున్న వ్యక్తులు హింసలకు భయపడలేదు. కారాగారానికి వెనుకాడ లేదు. బెదిరింపులకు లొంగలేదు. నాయకుడు యేసును తుదముట్టించాం,ఆయన అనుచరగణం చెల్లాచెదరవుతుందని భావించిన మత పెద్దల ఆలోచనలను తలక్రిందులు చేస్తూ 'మీరు ఆయనను అన్యాయంగా సిలువకు వ్రేలాడదీసారు. దైవం ఆయనను జీవంతో లేపాడు. ఆయన దైవ తనయుడు. దైవానికి మనపై గల ప్రేమకు నిదర్శనం. ఆయన నామాన తప్ప మరే పేరున రక్షణ లేదు. దీనికి మేము సాక్షులం.' అని ధైర్యంగా పలికారు. శ్రమలకు వెరవక నిలిచారు.అనేకులలో ప్రేమను నింపారు.నేడు ఈ సందేశాన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. నిత్యజీవాన్ని సొంతం చేసుకునే కార్యాలను ఆచరిస్తూ నిత్యజీవం వైపు అందరిని నడిపిద్దాం.
