సందేహ నివృత్తి

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
12 Apr 2026
ప్రశ్న -:
ప్రభువు పేతురును "నీవు నన్నుప్రేమిస్తున్నావా" అని మూడుమార్లు అడిగాడు. అందుకు కారణం ?
సమాధానం-:
తన మీద పూర్తి నమ్మకం ఉన్నవాడు కాబట్టే పేతురుకు ప్రత్యేకమైన అప్పగింతలు కలిగించాడు ప్రభువు, నాటకీయంగా జరిగిన ఈ సంభాషణకు ఒకింత వివరణ అవసరం.ఈ సంభాషణ పేతురు మదిలో చిరకాలం నిలిచిపోయి ఉంటుంది.
1.మొదటిగా "యోహాను పుత్రుడవైన సీమోను ! నీవు నన్ను వీరందరికంటె ఎక్కువగా ప్రేమించుచున్నావా" అని అడిగాడు.ఈ ప్రశ్న రెండు విధాలుగా అర్థం చేసికోవచ్చు. ఒకసారి అక్కడి దృశ్యాన్ని మనకళ్ళముందుంచుకుంటే:
ఎ) పేతురుకు అన్నంపెట్టిన పడవ,వలలు, ఒడ్డునే పడి ఉండాలి.అతడు పట్టిన చేపలు కూడా అక్కడే ఉండాలి. ప్రభువు వాటిని తడుముతూ, వాటన్నిటికంటే పేతురు తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని అడిగి ఉండాలి.ఎందుకంటే శిష్యునికి ఈ ప్రాపంచిక విషయాలమీద ఎక్కువగా ధ్యాస ఉండకూడదు. తనకోసం వాటిని పూర్తిగా వదలిపెట్టడానికి పేతురు సిద్ధంగా ఉన్నాడా అని పరీక్షించుకొంటున్నాడు ప్రభువు.
బి)రెండవదిగా,ఇతర శిష్యులని చూసి, వారందరికంటె తనను పేతురు ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని కూడా అడిగినట్లు అర్థం చేసికోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల ముందే "ఎవరు నిన్ను వదలి వెళ్ళినా, నేను వెళ్ళను" అంటూ చెప్పుకున్నాడు పేతురు (మత్తయి 26:33). అయితే కష్టసమయంలో ప్రభువు తనకు తెలీదని మూడుమార్లు బొంకాడు. ప్రభువు మృధువుగా ఆ సన్నివేశాన్ని గుర్తుచేస్తూ, పేతురుకు ధైర్యం సడలిన వైనాన్ని కళ్ళముందుంచుతున్నాడు. ఈసారి పేతురు తన నమ్మకాన్ని ఎవరితోనూ పోల్చకుండా,ప్రభువుకు అన్నీ తెలుసునంటూ ఆయన మీదే భారం వేశాడు.
2.క్రీస్తు ఈ ప్రశ్నను మూడుమార్లు అడిగాడు. ఎందుకంటే మూడుమార్లు క్రీస్తెవరో తనకు తెలీదని పేతురు బొంకాడు. మూడుమార్లు తన ప్రేమను ధృఢపరచుకోవాలి.పై విధంగా పేతురును వెంటాడుతున్న ఆ పీడకలను శాశ్వితంగా మరచిపొమ్మని ప్రోత్సహిస్తున్నాడు క్రీస్తు ప్రభువు.
3.పేతురు ప్రేమ అతనికి కొన్ని బాధ్యతలు తీసుకొచ్చింది. "నీవు నన్ను ప్రేమిస్తే, నా మందను మేపుము" అన్నాడు ప్రభువు.ఈ ఆదేశంలో ప్రేమకు, బాధ్యతకు గల సంబంధం తెలిసిపోతోంది.తన ప్రజలను ప్రేమించడం ద్వారా ప్రభువు మీద తనకున్న ప్రేమను పేతురు ఋజువు చేసుకుంటున్నాడని దీనికర్ధం.
