అపోస్తులవలె సువార్తను ప్రకటిద్దాం

Father gopu praveen
12 Apr 2026
పాస్కా 2వ సోమవారం
అ.కా 4:23-31
కీర్తన 21:3-4,7-9
యోహాను 3:1-8
రాత్రి సమయంలో వెలుగును (యేసును) వెదుకుతూ వచ్చాడు నికోదేము.అతనికి సంఘంలో పరపతి ఉంది..
అధికారం ఉంది.అయినా ఏదో వెలితి.ఆ వెలితే అతన్ని చీకటి నుండి వెలుగు చెంతకు నడిపించింది. ఆ వెలుగులో సేదదీరేలా చేసింది.దైవ రాజ్యంలో ప్రవేశించాలంటే తప్పని సరిగా నీటి వలన, ఆత్మ వలన జన్మించాలని తెలియజేసింది.వెలుగులో నడిచేవారు ఎలా అయితే తొట్రుపడరో,అలాగే నిజమైన వెలుగు యేసుతో నడిచేవారు పడిపోరు.బలహీనతలు బానిసలైనారని అర్థం చేసుకునేందుకు దోహదపడింది.యేసు బోధనలు కొందరిని ఆకర్షిస్తే,చేసిన అద్భుతాలు మరికొందరిని ఆయనను అనుసరించేలా చేసాయి.అయితే ఆయన దేవుని వద్ద నుండి వచ్చాడని,అందుకే ఎన్నో సూచక క్రియలు చేస్తున్నాడన్న నమ్మకం నికోదేమును ప్రభువు చెంతకు చేర్చింది.దైవ రాజ్యం గురించి దైవ ప్రణాళిక గురించి కూలంకషంగా చర్చించేందుకు
పురికొల్పింది.
యేసులో నడిచేవారు తమకు ఎదురయ్యే సమస్యలకు, కష్టాలకు,ఇబ్బందులకు భయపడుతూ మరల చీకటిలోకి జారుకోరు. నికోదేము మనకు ఇదే సందేశాన్ని అందిస్తున్నాడు.ఆయనను అనుసరించిన శిష్యులు ఈ లోక వ్యామోహాలకు,అధికార దాహానికి, పేరు ప్రఖ్యాతులకు బానిసలుగా జీవించినంత వరకు భయం,అభద్రతా, అలజడి, అశాంతి వారిని పెనవేసుకున్నాయి.కానీ ఎప్పుడైతే ప్రభు శాంతిని గుండెలలో నింపుకొని ఆత్మదేవునికి తమ హృదయాలను ఆలయాలుగా మలచుకొని భయాందోళనలకు స్వస్థి పలికారో అప్పటి నుండే వారు సంపూర్తిగా వెలుగులోనే, వెలుగుతోనే పయనించారు. ధైర్యంగా సాక్ష్యమిచ్చారు.
వారు కనులారా గాంచింది, చెవులారా ఆలకించింది బోధించడం ఆరంభించగానే కొందరు ఆ వెలుగుకు శిష్యులయ్యారు.మరి కొందరు శిష్యులయ్యారు. శిష్యులైన వారు ఒకటిగా సమావేశమౌతూ వాక్యపరిచర్య,రొట్టె విరుచుటలో సమయం గడుపుతుంటే శత్రువులైన వారు ఆ వెలుగుకు సాక్షులుగా నిలుస్తున్న అపోస్తులను భయభ్రాంతులకు గురిచేసి శాశ్వతంగా తొలిగించాలని, అందరిని చీకటిలోకి నడిపించాలని ప్రయాసపడ్డారు.అయినా ఆ బెదిరింపులను లెక్కచేయక, అవమానాలకు కృంగిపోక, ప్రార్ధన అనే ఆయుధం ద్వారా ముందుకు సాగారు.నీటి వలన, ఆత్మ వలన జన్మించే వారిలోని సుగుణాలకు ఐక్యతనురాగాలకు,ప్రార్ధనా శక్తికి సాక్షులుగా నిలిచారు. నికోదేము వలె మనం కూడా నిత్యం వెలుగులోనే నడుద్దాం. అపోస్తులవలె సువార్తను ప్రకటిద్దాం.శిష్యులవలె ధైర్యం కొరకు, క్రైస్తవ విలువల కొరకు ప్రార్థిద్దాం.
