దైవ మార్గంలో నడుద్దాం

జోసెఫ్ అవినాష్
09 Apr 2026
పస్కా 1వ శుక్రవారం
అ.కా 4:1-12
కీర్తన 118:1-2,4,22-27
యోహాను 21:1-14
ధ్యానం:
సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం గలిలీయ సరస్సులో చేపలు పట్టే పేతురు,అతని మిత్రులు రాత్రంతా శ్రమించినా ఒక్క చేప కూడా లభించక నిరాశానిస్పృహలతో వేకువ జామున ఒడ్డుకు చేరారు.ఆ సమయంలో తీరాన నిలిచిన వ్యక్తి మీ పడవను మరింత లోతుకు తీసుకొని వెళ్లి వల వేయమని చెప్పాడు.ఆలా చేసిన వారికి వల పిగులునంతగా చేపలు పడ్డాయి.సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలుతున్న వారిని మనుష్యులను పెట్టుటకు ఆహ్వానించాడు.
మూడు సంవత్సరాలు ఆయనతో గడిపారు.చేసిన అద్భుతాలను చూచారు. బోధనలు ఆలకించారు. ముఖ్యంగా పేతురు, యోహాను,యాకోబులు అందరికన్నా మిన్నగా నిలిచారు.నీవు రాయివి ఈ రాతి మీద నా శ్రీసభను నిర్మిస్తాను.నరక శక్తులు జయింపజాలవు.పరలోక రాజ్యం తాళపు చెవులను నీకిస్తాను అని యేసు మన్ననలను పేతురు అందుకున్నాడు పేతురు. ప్రభువు బందీ అయినపుడు ముమ్మారు బొంకినా వెంటనే పశ్చాత్తాపపడ్డాడు.ప్రభువు ఉత్థానమైన పిదప తన దర్శన భాగ్యాన్ని ప్రసాదించినా ఆశ్చర్యకరంగా పేతురు తిరిగి చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు.మీరు పెట్టాల్సింది చేపలను కాదు మనుష్యులను అని ప్రభువు వారికి తెలిపినా మరల తమ పాత వృత్తికే వెళ్లాలనినిశ్చయించుటకున్నాడు. అయితే అతనితో పాటు మరో ఆరుగురు శిష్యులు కూడా వెళ్లారు.రాత్రంతా శ్రమించినా చేపలు పడలేదు. మూడు సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశం పునరావృతమైంది.వారంతా నిరాశతో ఒడ్డుకు చేరారు కాని తీరాన నిలిచిన వ్యక్తి 'పడవకు కుడి వైపున వల వేయండి' అనగానే వల వేశారు.వల పిగులునన్ని చేపలు పొందారు.
ఈ వృత్తాంతంలో ప్రభువును తమను ఎందుకు పిలిచారో అర్థమైంది.అయితే మనకు అర్థం కావలసింది ఒకటుంది. యోహాను పేర్కొన్న ఏడుగురు శిష్యులలో ఐదుగురి పేర్లు మాత్రమే తెలుసు.మిగిలిన ఇద్దరినీ శిష్యులు అన్నాడు.ఆ ఇరువురు శిష్యులు 'నీవు నేను' అని మరువరాదు.మనం కూడా నేడు ఆ శిష్యులవలె దేవుడు మనకు ఏర్పరచిన మార్గాన్ని వీడుతుంటాం. అలాంటి సమయాలలో మనలను తిరిగి సరైన మార్గంలో ఆయన నడిపిస్తాడని ఈ దర్శన వృత్తాంతం తెలియజేస్తుంది.
