పేతురువలే ప్రభుని మహిమను ప్రకటించుదాం

జోసెఫ్ అవినాష్
08 Apr 2026
పస్కా 1వ గురువారం
అపో.కా 3:11-26
కీర్తన 8:3,5-9
లూకా 24:35-48
యేసు చేసే అద్భుతాలు బోధనలు అనేకులను ఆయన వైపు ఆకర్షితులను చేస్తుంటే ఓ వైపు ఆయన పదేపదే తాను సేవ చేయడానికే వచ్చాను... శత్రువుల చేత మరణించి మూడవనాడు మృత్యుంజయుడనై లేస్తాను' అని పలికినా అపొస్తలులు ఆ సందేశాన్ని పెడచెవిని పెట్టారు. ఆయనను రోమా సామ్రాజ్యాన్ని జయించి తన అధికారంతో ప్రజలను పరిపాలించే రాజుగా ఊహించుకున్నారు.ఆ ఉహల పల్లకిలో ఊరేగారు.అందుకే బేస్తవారం రాత్రి తమ కళ్ళ ముందే ఆయన బందీ అయితే మొదట అర్థం చేసుకోలేదు. జరిగే సంఘటనలు అర్ధమయ్యేసరికి ఆందోళన చెందారు.కలవరపడ్డారు.తమ ఆశలసౌధం కూలుతుంటే భయకంపితులై పారిపోయారు.
ఆయన మరణంతో అంతా చీకటయ్యింది అని భావించే వారికి అయన లేచాడు, కనిపించాడు అనే సందేశం చీకటిలో చిరుదీపంగా మారింది.అయినా భయాన్ని వీడలేదు.నాలుగుగోడల మధ్య నుండి వెలుపలికి రాలేదు. తమను ఆయన శిష్యులుగా గుర్తించి ఎక్కడ బంధించి చిత్రహింసలకు గురిచేస్తారో లేక తమను కూడా సిలువపై వ్రేలాడదీస్తారో అని భావించి తమను తాము గదిలో బంధించుకున్నారు.అలజడికి, అశాంతికి నిలయాలుగా ఆయారైన శిష్యులకు 'మీకు శాంతి కలుగును గాక!' అని పలుకుతూ తన దర్శనాన్ని ప్రసాదించాడు ప్రభువు. వారిలోని భయభ్రాంతులను సందేహాలను మటుమాయం చేసి సువార్త పరిచర్య సైనికులుగా తీర్చిదిద్దాడు.
అశాంతి స్థానంలో శాంతిని నింపుకొని శిష్యులు ఇక వెనుదిరిగి చూడక క్రీస్తు సందేశాలను తమ మాటల ద్వారా ప్రకటించారు.పేతురు, యోహానులు యెరూషలేము. దేవాలయ ద్వారం చెంత బిక్షం అడుక్కునే పుట్టు కుంటివానిని స్వస్థపరిచి ప్రభు మహిమను బహిర్గతం చేసారు.శాంతి సౌధాలుగా మారిన వారి ద్వారా పవిత్రాత్మ అనేక గొప్ప కార్యాలను చేయించాడు. కుంటివాని వృత్తాంతంలో అందరు తమను గొప్పగా భావిస్తుంటే వారు మాత్రం యేసు గురించి ఆయన మరణ ఉత్థానల గురించి ధైర్యంగా ప్రకటించారు.అనేకులు మారుమనస్సు పొందేందుకు దోహదం చేసారు.
మనం కూడా పలు పర్యాయాలు అశాంతికి అలజడికి గురవుతుంటాం. ఉత్థాన క్రీస్తు పదేపదే మనతో కూడా 'మీకు శాంతి కలుగుగాక!' అని పలుకుతూనే ఉన్నాడని. గుర్తిద్దాం.ఆయన శాంతిని మన హృదయాలలో నింపుకొని పేతురువలే ప్రభుని మహిమను ప్రకటించుదాం.
