నడిపించు దేవా నీ మార్గంలో

సిస్టర్ అండ్ర రాజకుమారి CSA

04 Apr 2026

కనులున్న కనలేని, చెవులున్న వినలేని
ఈ లోకంలో కనులున్నా కనలేని
వారు ఎంతోమంది ఉన్నారు.
వారు వెలుగును చూస్తారు
కానీ సత్యాన్ని చూడలేరు.
చెవులున్నా వినలేని
వారూ కొదవలేదు.
వారు శబ్దాలను వింటారు
కానీ దేవుని స్వరాన్ని గ్రహించలేరు.
మన దైనందిన జీవితంలో
కూడా ఇదే నిజం కనిపిస్తుంది.
మన పక్కన ఉన్న వారి
బాధను చూస్తూ కూడా
మనం గమనించము.
వారి నొప్పి మన కళ్లకు
కనిపించినా,మన హృదయానికి తాకదు.
వారి ఆర్తనాదం మన చెవులకు
వినిపించినా, మన మనసు స్పందించదు.
శుక్రవారం సిలువపై
యేసుప్రభువు తన ప్రాణాన్ని
అర్పించాడు.
ఆయన బాధను చాలామంది
చూసారు, కానీ ప్రేమను గుర్తించలేదు.
ఆయన పలికిన క్షమా వాక్యాలను
విన్నారు, కానీ హృదయంలోకి
తీసుకోలేదు.
శనివారం నిశ్శబ్దం మనకు
ఒక గొప్ప ఆహ్వానం.
బయటి కోలాహలాన్ని వదిలి
మన అంతరంగంలోకి
వెళ్లమని పిలుపు.
మనలోని అంధత్వం
కళ్లలో కాదు, హృదయంలో
ఉందని గుర్తు చేస్తుంది.
మనలోని చెవిటితనం
చెవుల్లో కాదు, ఆత్మలో
ఉందని తెలియజేస్తుంది.
దేవుని ప్రేమను నిజంగా అనుభవించాలంటే,
మన హృదయం తెరుచుకోవాలి,
మన మనసు మారాలి.
ఇతరుల బాధను చూడగల
కళ్లను, వినగల చెవులను
మనం పెంపొందించుకోవాలి.
అప్పుడు మాత్రమే మనం
కనులున్న కనబడే వారమవుతాం.
చెవులున్న వినగలిగే వారమవుతాం.
దేవా, మా కళ్లను తెరిచి
నీ సత్యాన్ని చూపించు.
మా చెవులను తెరిచి
నీ స్వరాన్ని వినే
కృపను ప్రసాదించు.
మా హృదయాన్ని మార్చి,
ప్రేమతో నిండిన జీవితాన్ని
నడిపించు.ఆమెన్

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN