క్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు

ఫాదర్ పూదోట జోజయ్య
02 Apr 2026
ప్రభువు సిలువ మీద ప్రాణాలు విడిస్తూ ఏడు మాటలు చెప్పారు .వాటిని సప్త వాక్యలని కూడా పిలుస్తారు.తపస్సు కాలములో మరిముఖ్యంగా పవిత్ర వారములో మనమంతా కూడా క్రీస్తు ప్రభువు సిలువ పై పలికిన ఏడు మాటలను మననం చేసుకుంటూ ఉంటాము.
పరిశుద్ధ గ్రంథం చనిపోయిన వారి చివరి మాటలను క్రీస్తువికాక మరో ముగ్గురివి మాత్రమే ఉదహరించింది.వారే మోషే,యాకోబు,స్తెఫను మనుషులు చనిపోతూ చెప్పే మాటలను వినాలంటే మనందరికీ కుతూహలం గానే ఉంటుంది. మన ప్రాణ స్నేహితులు, మన దగ్గరి బంధువులు, మన కుటుంబీకులు చెప్పిన చివరి మాటలను మనం మన జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం.
క్రీస్తు భగవానుడు సిలువ పీఠమెక్కి ఏడు మాటలను ఏడు సందేశాల్లాగ వినిపించారు. రెండు వేల సంవత్సరాల నుండి క్రైస్తవ ప్రపంచం ఈ ఏడు మాటలను భక్తిపూర్వకంగా మననం చేసుకుంటూ వస్తుంది. వాటిలోని లోతైన భావాలను తరచి తరచి చూస్తూ వస్తుంది. క్రీస్తు లాంటి బోధకుడు లేడు. ఏడు మాటల్లాంటి ప్రసంగము లేదు.క్రీస్తు సిలువ పై పలికిన ఏడు మాటలలో దాగి ఉన్న లోతైన భావాలను గూర్చి మనమంతా ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం-:
1.“తండ్రీ! వీరు చేయునదేమో వీరెరుగరు. వీరిని క్షమింపుము"
(లూకా సువార్త 23 : 34)
క్రీస్తు పూర్వం "మీ శత్రువులను ప్రేమించండి", "మిమ్ము ద్వేషించే వాళ్లకు మంచిని చేయండి" అని బోధించారు. కానీ ఇప్పుడు క్రీస్తు కాళ్లు చేతుల్లో శత్రువులు చీలలు దిగగొట్డారు. క్రీస్తును సిలువ మీద అర్ధనగ్నంగా వేలాడదీశారు. కనుక ఈ బాధలో అతడు ప్రబోధించిన క్షమ, దయ, ప్రేమ గుణ సిద్ధాంతాలను గాలికి వదిలేస్తారని అనుకొని పరిసయ్యులు,సద్దూకయూలు, ధర్మశాస్త్ర బోధకులు, అక్కడ గుమికూడిన శత్రువులు క్రీస్తును ఇంతలా బాధ పెడుతున్నాము కదా ఆవేశంతో కచ్చితంగా ఇతని నోటినుండి పరుష వాక్యాలు వెలువడతాయని అనుకున్నారు. కానీ వారి ఊహలు అంచనాలు విఫలమయ్యాయి..
క్రీస్తు నోటినుండి కటువైన దూషణ వాక్యాలు కాక మృదువైన క్షమా వాక్యాలు వెలువడ్డాయి. ఒక మంచి గంధపుచెట్టు తన్ను నరికే గుడ్డలను సైతం ఏ విధముగా సుగంధము పూసి సత్కరిస్తుందో అలాగే క్రీస్తు కూడా తను హింసించిన వారిని పల్లెత్తు మాట అనలేదు పైగా వాళ్లు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించమని తండ్రికి ప్రార్థించారు.
నరులు సామాన్యంగా శత్రువులను క్షమించరు క్షమాగుణం ఒక దేవునికి చెల్లింది. క్రీస్తు సిలువ మీద నుండి శత్రువులను క్షమించిన తీరు తొలినాటి క్రైస్తవ భక్తులను చాలా చాలా ప్రభావితం చేసింది .ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. స్తెఫను ప్రభువు నేర్పిన క్షమాగుణాన్ని మనసులో పెట్టుకొని తన విరోధులను క్షమించాడు. పైగా ఈ పాపాన్ని వాళ్ళ మీద మోపవద్దు అని ప్రార్ధించాడు.(ఆ.కా 7:60).
రొములో చెరలో ఉన్న పౌలును స్నేహితులందరూ వదిలివేయగా అతడు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు ప్రభువు వారి తప్పిదాన్ని మన్నించి గాక అని వ్రాశాడు-: 2 తిమోతి 4:16 మన కాలంలో జాతిపిత మహాత్మా గాంధీ సైతం క్రీస్తు క్షమా వాక్యాలకు ముగ్దుడై పోయాడు. నూతన నిబంధనలో పర్వత ప్రసంగం లాగే క్రీస్తు సిలువపై పలికిన మొదటి మాట గాంధీ గారిని చాలా ప్రభావితం చేసింది.ఆయన ఈ మాటను పాటించారు. శత్రువులను క్షమించటం వారికోసం ప్రార్థించటం క్రైస్తవ ధర్మం . మనం పరిపూర్ణమైన క్రీస్తు బిడ్డలం కావాలి అంటే క్షమా ధర్మాన్ని పాటించాలి ఈ రోజుల్లో ఎంతమంది క్షమాధర్మాన్ని పాటిస్తున్నారు? ఆత్మపరిశలన చేసుకోవాలి. క్షమాగుణాన్ని పాటించక శత్రువులను ఏదొకటి చేయాలన్న ఉద్దేశంతో చాలమంది హత్యలు చేస్తున్నారు. జీవితాలను నశనం చేసుకుంటున్నారు. క్రీస్తు సిలువపై పలికిన ఈ మాటను మనమంతా మన హృదయాలలో పెట్టుకొని మన శత్రువులు కొరకు ప్రార్థన చేయాలి. వారిని క్షమించాలి అందుకు కావాల్సిన శక్తిని అనుగ్రహించమని పవిత్రాత్మ సర్వేశ్వరుని వేడుకోవాలి..
2." నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశిస్తావు"-: (లూకా 23:43)
క్రీస్తుకు ఇరువైపులా ఇద్దరు దొంగలను కూడా సిలువ వేయటాన్ని మనం గమనించవచ్చు. క్రీస్తు భగవానుడితో పాటు సిలువ మరణం పాలైన రెండవ దొంగను మంచి దొంగ అని పిలవటం ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఆ మంచి దొంగ పేరు "డెస్మస్" ఇతనిని శ్రీ సభ పునీతుడిగా కూడా సత్కరించింది.
ఈ పవిత్రమైన సమయములో మనమంతా కూడా "పునీత డెస్మస్" గారి గురించి ఆయన యొక్క జీవితాన్ని గురించి కొద్దిసేపు ఆలోచన చేద్దాం-:
వాస్తవానికి మంచి దొంగ కూడా మారుమనసు పొందక ముందు ఒక నేరస్తుడే. క్రీస్తు భగవానుడి ఆవలివైపు వేలాడుతున్న చెడ్డ దొంగ మాదిరిగా ఇతడు కూడా ఎన్నో ఘోరమైన పాపాలు, హత్యలకు పాల్పడిన వాడే, పాపపు అంధకారంలో బ్రతుకుతూ ఎందరినో వేధించిన వాడే, హింసించిన వాడే కానీ తన జీవిత యాత్రలో చివరికి తాను చేసిన పాపాలన్నిటికీ మారుమనసు పొంది. దైవ తనయుడు అయినటువంటి క్రీస్తు భగవానుడుతో కలిసి సిలువ మరణం పొంది తన యొక్క పాపాలకు పరిహారం చెల్లించుకున్నాడు.
తన తోటి దొంగ సిలువ క్రింద శత్రువులు క్రీస్తు భగవానుడిని అపహాస్యం చేస్తూ, హేళన చేస్తున్న వారితో కలిసి క్రీస్తు భగవానుడిని నీవు నిజముగా దైవకుమారుడువి అయితే నిన్ను నీవు కాపాడుకొని నన్ను కూడా కాపాడు అని సవాలు విసురుతుంటే! మంచి దొంగ ఊరుకోలేక పోయాడు. క్రీస్తును చూస్తూ క్రీస్తు పక్షాన ఒక న్యాయవాదిగా నిలబడి తన తోటి దొంగ వైఖరిని,వ్యక్తిత్వాన్ని బహిరంగంగానే ఖండించాడు. ఒరేయ్ నీకు దైవ భయం కూడా రవ్వంత లేదా? నువ్వు కూడా శిక్షను అనుభవిస్తున్నావు? సిగ్గు లేదా ఒరేయ్ మనం అంటే హత్యలు, నేరాలు చేశాము కాబట్టి శిక్షను అనుభవించటం న్యాయం. కానీ ఆ దైవ తనయుడు క్రీస్తు భగవానుడు ఒక్క నేరము కూడా చేయకుండా మన కొరకు సిలువను ఎక్కిన మహానుభావుడు రా అని తన తోటి దొంగను గద్దిస్తూ చివరి క్షణాలలో క్రీస్తుని తెలుసుకొని క్రీస్తు సాక్షిగా నిలబడ్డాడు
చదవండి (లూకా 23:40-41)
సిలువపై వ్రేలాడుతున్న మంచి దొంగ క్రీస్తు కారుణ్యాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదిస్తూ తన యొక్క నేర చరిత్రను నెమరువేసుకుంటూ పరితపించాడు. అప్పటివరకు ఇష్టానుసారంగా పాపపు అంధకారంలో జీవించిన మంచి దొంగ తల ఎత్తి ఎన్నో పాపములు చేసిన మంచి దొంగ తను చేసిన పాపములకు సిగ్గుపడి తల దించుకున్నాడు. తనలోని తప్పును తెలుసుకొని తన యొక్క పాపపు స్థితిని మార్చుకుని నర నరాల్లో క్రీస్తు కారుణ్యాన్ని నింపు కున్నాడు. మరణము చాలా నొప్పితో కూడుకున్నటువంటి విషయం అటువంటి ఘడియలలో కూడా క్రీస్తు భగవానుడిని పరి పూర్తిగా విశ్వసించి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది క్షమను అర్ధించి హృదయ పరివర్తన పొందాడు, క్రీస్తు భగవానుడి అనుగ్రహానికి ఆయన యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు మంచి దొంగ.
మంచి దొంగ ఏ క్షణమైతే మారుమనసు పొంది క్రీస్తును అయ్యా నేను నా తప్పులు తెలుసుకున్నాను నీవు పరలోకానికి వెళ్లిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని వినయ హృదయముతో అడిగినప్పుడు ప్రభువు తప్పక ఈనాడే నీవు నాతో పాటు పరలోకానికి చేరుకుంటావు అని వాగ్దానం చేశారు ప్రియా సహోదరి సహోదరులారా
చదవండి (లూకా 23:43)
మన జీవిత యాత్రలో చెడ్డ దొంగ వలె మనం చాలా సార్లు ప్రవర్తిస్తూ ఉంటాము దేవుని ఒక అవసరంగా భావిస్తూ. అనవసరమైన వాటిని ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉంటాం కొద్దిపాటి శ్రమలు వస్తే చాలు దేవుణ్ణి తిడుతూ ఉంటాము. పునీత డిస్మస్ గారు ఏ విధంగా అయితే తన జీవితపు చివరి క్షణాలలో క్రీస్తును తెలుసుకొని హృదయ పరివర్తనం చెంది పరలోకానికి చేరుకున్నారో మనము కూడా అనవసరమైన విషయాలను పక్కన పెట్టి మన పాపాలను ఒప్పుకొని హృదయ పరివర్తన చెంది క్రీస్తు తో ఐక్యంగా జీవించాలి.పునీత డిస్మస్ గారికి క్రీస్తు ఏవిధంగా పరలోక భాగ్యాన్ని అనుగ్రహించారో ఆయన అడుగు జాడల్లో నడిచే ప్రతి ఒక్కరికి పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తారు..
3. "స్త్రీ "! ఇదిగో నీ కుమారుడు" ఇదిగో నీ తల్లి( యోహాను 19:27)
గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు శుభవార్తను చెప్పినప్పుడు సంతోషంగా స్వీకరించి ప్రభువును కన్నారు, ఆయనను సంరక్షించి, కాచి కాపాడి, పెంచి పోషించారు. సిమియోను ప్రవక్త మరియతల్లితో పలికిన మాటలను ఓ మారు గుర్తు చేసుకుందాం-:
"ఒక ఖడ్గము నీ హృదయమయను దూసుకొని పోనున్నది" (లూకా 2:35)
క్రీస్తు సిలువను ఎక్కిన నాటికి తన వయసు కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే 30 సంవత్సరాల పాటు ఆయన మరియతల్లితో పాటు జీవించారు. కడపటి మూడేళ్లు ఆయన సంచార బోధకుడిగా జీవిస్తూ సామాన్య ప్రజలకు సద్భోధలు చేశారు, ఎన్నెన్నో సత్కర్యాలు చేశారు బాధితులను ఓదార్చారు, పీడిత ప్రజలను చైతన్య పరిచారు. ప్రేమగా పెంచుకున్న తన ప్రియ కుమారుని శత్రువులు కొడుతుంటే, ఆ దివ్య దేహంలో నుండి రక్తం ధారాళంగా కారుతుంటే, ఆ దివ్య మొఖం గాయాలపాలై గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటే. ఏ తల్లి మాత్రం తట్టుకోగలదు.ఈ దుఖ: పూరితమైన స్లీవ మార్గంలో కచ్చితంగా మరియతల్లికి సిమియోను పలికిన మాటలు గుర్తొచ్చి ఉంటాయి.ఆ తల్లి హృదయాన్ని గాయపరచి ఉంటాయి.
హృదయాంతరంగాలు తెలిసిన ప్రభువుకు తల్లి హృదయంలో దాగి ఉన్న బాధను అర్థం చేసుకొని, మరణావస్థలో సైతం తన బాధ్యతను మరవక, తన తల్లిని విడువక తన తల్లి బాగోగులను చూడమని తన ప్రియ శిష్యుడు యోహాను గారికి తన తల్లిని అప్పగించారు. మన క్రైస్తవులలో చాలామంది మంచిగా స్థిరపడిన తరువాత. ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులను రోడ్లమీద, అనాధ శరణాలయాలలో విడిచి పెడుతూ ఉన్నారు. అట్టి స్వభావం కలవారు ఒక్కసారి ఈ మూడవ మాట ద్వారా ప్రభువు ఇస్తున్న సందేశాన్ని ఆలకించాలి. వైఖరిని మార్చుకుని తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి..
4."ఎలోయీ! ఎలోయీ! లామా సబక్తాని" ( మత్తయి 27:46)
క్రీస్తు భగవానుడు సాక్షాత్తు దైవ కుమారుడు కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు తండ్రి అని సంబోధించేవారు. కానీ ఇప్పుడు స్వరం మారింది దేవా అని సంబోధిస్తున్నారు."లేమా లేమా సబక్తాని" ఇది అరబిక్ పదం ఈ పదానికి అర్థం ఏమనగా దిక్కులు పిక్కటిల్లేలా చావు కేక వేశాడు అని అర్థం. పూర్వం ప్రభువు అర్ధరాత్రి సమయంలో బెత్లెహేములో జన్మించినప్పుడు అద్భుతంగా వెలుగు ప్రకాశించింది. కానీ ఇప్పుడు అతడు కల్వరి మీద మిట్టమధ్యాహ్నం అర్థనగ్నంగా అవమానకరంగా సిలువపై మరణించబోతున్న తరుణంలో ఆకాశం చీకట్లు విరజిమ్మింది చాలా ఏళ్ల క్రితమే ఆమోసు ప్రవక్త "ఆ దినం నేను మధ్యాహ్నమే సూర్యుడు అస్తమించేలా చేస్తాను, పగటిపూటే చీకట్లు కమ్మేలా చేస్తాను అని నుడివాడు"- (ఆమోసు 8:9)
నరుల పాప భారాన్నంతటినీ తన భుజస్కంధాలపై మోస్తూ ఉండటం వలన కొన్ని క్షణాల పాటు తన తండ్రి దర్శనం స్పష్టతను కోల్పోయింది. ఆ తండ్రితో ఐక్యమై ఉండటం వలన కలిగిన ఆనందం మరుగై పోయిందా అనిపించింది. కనుక ఇక్కడ క్రీస్తు తండ్రిని ఉద్దేశించి " నా దేవా, నా దేవా" అని విలపించాడు. తండ్రిచే చేయి విడువబడినట్లు , తండ్రి నుంచి తాను వేరైపోయినట్లు , ఏకాకిణపోయినట్లు భావించాడు .
5. "నాకు దాహం వేస్తున్నది"(యోహాను 19:28)
ప్రభువు దాహానికి శారీరకంగా అలసట పొందటం ఒక కారణమైతే ప్రవచనాలు నెరవేరవలసి ఉండటం మరోక కారణం. గాయాల వలన క్రీస్తుని శరీరంలోని రక్తం చాలావరకు కారిపోయింది. ఈదురు గాలి సోకి దేహంలో మిగిలి ఉన్న నెత్తురు కూడా కరుడుకట్టుకొనిపోయేలా చేసింది. ఇంకా సిలువ మీద వ్రేలాడే ప్రభు శరీరం కాళ్లు చేతులు మీద ఆధారపడి ఉండటం వలన ఘోరమైన బాధను అనుభవిస్తుంది దీని ఫలితంగా కలిగిన తలనొప్పి నరముల వాపు మూలాన ప్రభువుకి తీవ్రమైన దాహం కలిగింది.
క్రీస్తుకు దాహం కలగడం వింత కాదు అతడు తనకు దప్పిక కలిగిందని చెప్పటం వింత ఆకాశంలోని గోళాలను వాటి పరిధిలో నిలిపినవాడు సముద్రాలను వాటి ఎల్లలు దాటి పొంగి కూడదని శాసించిన వాడు. మోషే బెత్తంతో చరిచినప్పుడు రాతి చట్టు నుండి నీటి పాయను వెలువరించిన వాడు. నేను ఇచ్చే నీటిని తాగే వారికి మరల దప్పిక కలుగదని సమరయ మహిళతో చెప్పినవాడు ఇప్పుడు నాకు దాహం వేస్తుంది అని పలకటం వింత కదా?
ప్రభువుని సిలువ వేసినప్పుడు మొదటిసారి చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారు .కానీ క్రీస్తు దాన్ని స్వీకరించలేదు-:మార్కు 15:22-23. ఎందుకనగా ఈ పానీయాన్ని సేవిస్తే మైకం కమ్ముకొని ఇక బాధలు గుర్తుండవు. కనుక ప్రభువు దీనిని తిరస్కరించారు. ఇక రెండవ మారు అతనికి ఇచ్చినది పులిసిన ద్రాక్షసవం ఇది చౌక రకం పానీయం.
ప్రభు సిలువ మీద ఈ పానీయాన్ని సేవించింది కేవలం దప్పికను తీర్చుకోవటానికి మాత్రమే కాదు. ప్రవచనాలను నెరవేర్చటానికి కూడా కీర్తనకారుడు ఇలా వ్రాశాడు
" ఎవరైనా నన్ను కరుణించి ఓదారుస్తారేమో ననుకొన్నాను
కానీ అలాంటి వాళ్ళు ఎవరూ నా కంట పడలేదు
వాళ్లు నాకు చేదుని తినిపించారు
దప్పికైనప్పుడు నాచే పులిసిన రసాన్ని తాగించారు" - 69:21-22
ఈ ప్రవచనాన్ని నెరవేర్చటానికి ఇక్కడ ప్రభువు ఈ పులిసిన రసాన్ని సేవించారు.
ప్రభుని దాహం శారీరకమైనది మాత్రమే కాదు ఆత్మీయ మైనది కూడా ఆయన ప్రధాన లక్ష్యం తన తండ్రి ప్రేమను నలుగురికి వ్యక్తపరచటం నలుగురిని ఆ ప్రేమ మార్గంలో నడిపించటం. కానీ ప్రజలు ఎవరూ కూడా ఆయనను పట్టించుకోలేదు పైగా సిలువను వేయమని కేకలు వేశారు. ఆయన దాహార్తి తీరాలంటే మనమంతా కూడా ఆయన చిత్తానుసారం నడవాలి, పవిత్ర జీవితాన్ని జీవించాలి..
6. అంతా సమాప్తమైనది-:(యోహాను 19:30)
క్రీస్తు జీవితంలో ప్రతి ఘట్టము తండ్రి నిర్దేశించినట్లే జరిగింది. అతడు ప్రతి అంశంలోనూ తండ్రి చిత్తానికి బద్ధుడై జీవించాడు. కనుక అతని యందు తండ్రి ప్రణాళిక పరిపూర్తిగా నెరవేరింది. పూర్వ వేదములో ప్రవక్తలు పలికిన ప్రవచనాలు కూడా అక్షరాల నెరవేరాయి. కనుక క్రీస్తు సమస్తము సమాప్తమైనది సమస్తము నెరవేరింది అని పలికి తన తండ్రి ఇచ్చినటువంటి బాధ్యతను పరిపూర్తిగా నెరవేర్చి ప్రాణాలను విడిచాడు.
అవును క్రీస్తు తండ్రి చిత్తాన్ని పూర్వ-వేద ప్రవచనాలను నెరవేర్చి సిలువ మీద చనిపోయారు. అలా చనిపోయి మన పాపాలకు విమోచనం చేశాడు. అతనిలాగే మనము కూడా తండ్రి చిత్తానికి బద్ధులై జీవిస్తే అతని రక్షణని సంపూర్ణంగా పొందుతాం...
7." క్రీస్తు తండ్రి నా ఆత్మను నీ చేతుల్లో కి అప్పగిస్తున్నాను అని పలికి ప్రాణం విడిచాడు"- లూకా 23:46
ఆది తల్లిదండ్రులు చేసిన తొలి పాప ఫలితం మరణం. ఆదాము తన పెద్ద కుమారుడు కయూను చిన్న కుమారుడు హేబేలును చంపగా చూచాడు. అదే లోకంలో తొలి మరణం. మరలా కయీను సంతతి వారిని చెప్పదగిన యూదులు హేబేలు లాగా నీతిమంతుడైన క్రీస్తును వధిస్తున్నారు.
క్రీస్తు సిలువపై పలికిన ఆరవ మాట కిందికి చూస్తూ ఉచ్చరించాడు. కానీ సిలువలో పలికిన ఆఖరిమాటను పైకి చూస్తూ ఉచ్చరించాడు. అనగా అతడు ఈ భూమ్మీద నుండి తండ్రి చెంతకు వెల్ల గోరాడు కాలాన్ని దాటి అనంతంలో అడుగిడ గోరాడు.
దుడుకు చిన్న వాడు దూర దేశం నుండి తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. యూదులు ఐగుప్తు ప్రవాసము నుండి బాబి లోనూ ప్రవాసము నుండి వాగ్దాత్త భూమికి తిరిగి వచ్చారు. అలాగే క్రీస్తు కూడా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోక ప్రవాసంలో పరిశుద్ధముగా జీవించి తండ్రి ఇంటికి తిరిగి వెళుతున్నాడు. అలా వెళుతూ అతడు పలికిన ఆఖరి మాట ఇది తండ్రి! " నీ చేతుల్లోకి నా ఆత్మను అప్పగిస్తున్నాను"
మరణం అందరి జీవితాల్లో ఒక భాగం .ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనమంతా కూడా మరణించక తప్పదు. మన అనుదిన జీవితాలలో పాపపు అంధకారం లోనికి మనం పయనిస్తూ దేవుడిచ్చిన స్వచ్ఛమైన ఆత్మను చేజేతులారా పాడు చేస్తున్నాము. మనమంతా క్రీస్తుని చూసి నేర్చుకుందాం క్రీస్తు తండ్రి ఇచ్చిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చి. మంచి మరణాన్ని పొందారు. స్వేచ్ఛ పరుడైన నరుని చిట్టచివరి కార్యం మరణం. క్రీస్తు తన మరణాన్ని దేవునికి అర్పించి నట్లు మనం కూడా మన మరణాన్ని క్రీస్తు ద్వారా తండ్రికి అర్పించాలి.
కాబట్టి ప్రియ సహోదరీ, సహోదరులారా పవిత్ర వారం లో క్రీస్తు సిలువ పై నుండి సర్వజగత్తుకు అందించిన ఈ సప్త సందేశాలను భక్తిశ్రద్ధలతో ధ్యానించి.ఆ ప్రభువు కోరిన జీవితాన్ని జీవిద్దాం పునరుత్తాన క్రీస్తు వెలుగులో భాగం పంచుకుందాం ఆమెన్...
