పవిత్ర శుక్రవారం ప్రత్యేక వ్యాసం

Father gopu praveen

02 Apr 2026

ఈ రోజు పవిత్ర శుక్రవారము. నేడు మనం “శరీరధారియైన దేవుని వాక్కు” అగు క్రీస్తు సిలువ మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. సువార్తల ప్రకారం, గురువారము రోజు రాత్రి సమయములో యూదా ఇస్కారియోతు యేసు ప్రభువును శత్రువుల చేతికి అప్పగించాడు. ఉదయం ‘అన్నా’ అను యూదుల మతాధి దగ్గరకు తీసుకొని వచ్చారు. యేసు దైవదూషణ చేసాడని ఖండించారు. ఆ తరువాత రోము గవర్నరు అయిన పిలాతు వద్దకు తీసుకోని పోయారు. పిలాతు యేసును ప్రశ్నించి, ఆయనలో ఏ దోషము లేకపోవుటచే, “మీరే ఇతనిని తీసికొని వెళ్లి మీ చట్ట ప్రకారము విచారణ చేయండి” అని యూదులకు చెప్పాడు. రోమనుల పాలన కింద యూదులకు ఎవరికిని మరణదండన విధించు అధికారము లేనందున, యేసుకు మరణ శిక్షను ఆజ్ఞాపించమని పిలాతును కోరారు. పిలాతు యేసును హేరోదు వద్దకు పంపాడు. ఆయనలో ఏ దోషము లేనందున, హేరోదు తిరిగి మరల యేసును పిలాతు వద్దకు పంపాడు. చివరికి, ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణ శిక్ష విధించాడు. వారి యిష్టానుసారముగా చేసికొనుటకు యూదులకు అప్పగించాడు.

ఈ రోజుని “గుడ్‌ ఫ్రైడే” అని అంటున్నాము. యేసు ప్రభువు శ్రమలను పొంది మరణించిన రోజును మనం ఎందుకు ‘మంచి రోజు’, ‘పవిత్రమైన రోజు’ అని అంటున్నాము? ఎందుకనగా, క్రీస్తు మరణం మనకు సంపూర్ణ విజయాన్ని సంపాదించి పెట్టింది. మన రక్షణ కార్యం విజయవంతమైనది లేదా సంపూర్ణమైనది. ఆయనను విశ్వసించు వారందరికి జీవమును, అనుగ్రహమును, రక్షణను, విముక్తిని సంపాదించి పెట్టింది. యేసు క్రీస్తు తన మరణము ద్వారా, మనలను పాపదాస్యమునుండి విముక్తిని చేసాడు, “నిష్కళంకమైన గొర్రెపిల్లవంటి అమూల్యమైన క్రీస్తు బలిద్వారా మీరు విముక్తి కావింప బడితిరి” (1 పేతు. 1:19). అలాగే, నేడు మనకోసం పరలోకం తెరువబడింది.

పవిత్ర గురువారమున, క్రీస్తు శిష్యులతో కలసి, ‘పైగది’లో ప్రవేశించి, దేవుని గొప్పవరమైన దివ్యసత్ప్రసాద భోజనమును స్వీకరించియున్నాము. క్రీస్తు ప్రభువుని నిజమైన శరీరరక్తములు, ఆత్మ దైవత్వమును మనం పొందియున్నాము. ఈనాడు పవిత్ర శుక్రవారమున, మన శ్రీసభకు తల్లియైన మరియమ్మతో కలసి క్రీస్తు సిలువచెంత నిలుస్తున్నాము. పవిత్ర శుక్రవారమున, గొప్ప నమ్మకముతో, ఆశతో, క్రీస్తు సమాధిపై కప్పబడిన రాయి దొరలు సమయము కొరకై వేచి చూస్తున్నాము. ఆ క్షణమున, క్రీస్తు ఉత్థాన ఉజ్వలముతో మన హృదయాలు దేదీప్యమవుతాయి. ఆక్షణమున పరలోకములో పునీతులతో, మన తోటి సహోదరి, సహోదరులతో కలసి, “లెమ్ము, ప్రకాశింపుము. నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగుచున్నది” (యెషయ 60:1) అని ఎలుగెత్తి స్తుతించెదం.

ఈ రోజు క్రీస్తు సిలువ చెంత నిలచియున్నాము. మరియ తల్లివలె, నిర్మల హృదయాలతో సిలువ చెంతకు వచ్చియున్నట్లయితే, దైవప్రేమ పరమ రహస్యాలలోనికి ప్రవేశిస్తాము. సిలువను గాంచుదాం. సిలువలో వ్రేలాడుచున్న క్రీస్తును గాంచుదాం. ప్రేమగల మన ప్రభువు మనకోసం తన ఇష్ట పూర్తిగా ఈ సిలువ మరణాన్ని పొందాడు. తన సిలువ వేదన, మరణముద్వారా మనలను రక్షించి యున్నాడు. మరణమునుండి మనలను రక్షించాడు.

ఈ రోజు మనం పాస్కా పరమ రహస్యాన్ని ప్రత్యేక విధముగా కొనియాడుచున్నాము. క్రీస్తు సిలువ మరణం ఒక బలి. అది మన పాపాలను పరిహరించే బలి. యావత్‌ ప్రపంచానికి విమోచనాన్ని, విముక్తిని కలిగించినటువంటి బలి. ఈ బలిలో గురువు క్రీస్తే, బలి వస్తువు కూడా క్రీస్తే. కలువరి కొండపై అర్పించిన బలి, తండ్రి దేవుని చిత్తాను సారముగా జరిగి యున్నది. అందుకే, క్రీస్తును మహిమ పరచి మహోన్నత స్థితికి హెచ్చించాడు దేవుడు. మనము కూడా తండ్రికి పూర్తిగా విధేయులై బాధామయ సేవకుడగు క్రీస్తు ప్రభువుతో కలసిపోవాలి. మన దు:ఖాలు, కష్టాలు, శోధనలు, వేదనలన్నింటిని క్రీస్తు బలితో ఒకటిగా చేసి తండ్రి దేవునికి సమర్పించాలి. అప్పుడే సిలువ మార్గములో ప్రభుని అనుసరించే వారందరికి విమోచనం కలుగుతుంది.

ఈ రోజు మనం ప్రత్యేక విధముగా ప్రభువు సిలువ మరణాన్ని స్మరిస్తున్నాము. మన కోసం ఆయన ఎన్నో శ్రమలను, బాధలను అనుభవించాడు. అవమానాలను భరించాడు. సిలువపై ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొందాడు.

సిలువ మరణం: ఆనాడు, అన్ని శిక్షలలోకెల్ల సిలువ మరణం చాలా క్రూరమైనది, ఘోరమైనది. ఇది బానిసలకు విధించే అతి నీచమైన మరణదండనగా పిలువబడేది. యేసు చాలా అవమానకరమైన, అమానుషమైన, అతిభయంకరమైన, హేయమైన, బానిస మరణాన్ని, నేరస్థుని మరణాన్ని పొందియున్నాడు.

సిలువ: 1కొరి 1:23లో పౌలుగారు అంటున్నారు, “సిలువ యూదులకు ఆటంకం, అన్యులకు అవివేకము.” కాని, సిలువ క్రీస్తు శ్రమలు, మరణమునకు, ఆయన అర్పించిన బలికి, రక్షణ విజయానికి చిహ్నము. సిలువను చూసినప్పుడెల్ల ఈ పరమ రహస్యమును ధ్యానించాలి. యేసు క్రీస్తు సిలువను మనం అర్ధంచేసుకోవాలంటే, సిలువ సాధించిన ఫలాలను లేదా విజయాలను మనం ధ్యానించాలి [అంతేగాని, సిలువ మరణానికి గల కారణాలను కాదు]. సిలువ ఫలితం ఏమిటో రోమీ 5:1లో చూడవచ్చు: “విశ్వాసము వలన మనము నీతిమంతులుగా చేయబడి, యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితిమి.” ఇంకో ముఖ్యమైన విజయం ఏమిటంటే, క్రీస్తు సిలువ మన సకల [శారీరక, మానసిక...] శ్రమలకు, ఓ నూతన అర్ధాన్ని చేకూర్చింది. మన శ్రమలు ఇక ఎన్నటికి శిక్ష కాదు, శాపం కాదు. క్రీస్తు మనకన్న ముందుగా సిలువపై శ్రమల పాత్రను పానము చేసి, శ్రమల వెనుక మహిమ ఉన్నదని చూపించాడు. కేవలము విశ్వాసముగల వారి శ్రమలే కాదు, సర్వ మానవాళి శ్రమలు ఎందుకన, ఆయన అందరికోసం మరణించారు. “నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరిని నా యొద్దకు ఆకర్షింతును” (యోహాను 12:32) అని ప్రభువు పలికారు. సిలువ ద్వారా మానవాళి శ్రమలు కూడా రక్షణకు మార్గముగా చేయబడినందులకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం.

ఆయన సిలువ మరణాన్ని మనకోసం, మనపై ప్రేమకోసం అంగీకరించాడు, “తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయువానికంటె ఎక్కువ ప్రేమకలవాడు ఎవడును లేడు” (యోహాను 15:13). “క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది” (1యోహాను 3:16). కనుక, సిలువ ప్రేమకు గుర్తు. దేవుని ప్రేమకు చిహ్నం. ప్రభువు అందరి కోసం మరణించాడు. సిలువ పరలోక ద్వారము. సిలువ గురుతు ఒక వరం. దీని ద్వారా దేవుని ఆశీస్సులను, అనుగ్రహాలను పొందుచున్నాము. అందుకే పౌలుగారు, “యేసు క్రీస్తు సిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును” అని గలతీ 6:14లో చెప్పుచున్నారు.

సిలువ ప్రేమకు చిహ్నం: సిలువ మరణం యేసుకు మనపైగల ప్రేమకు నిదర్శనం. పునీత పౌలు తన లేఖలలో, యేసు మరణాన్ని ప్రస్తావించినప్పుడెల్ల, యేసు/దైవ ప్రేమను గూర్చి చెప్తాడు, “క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే, దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను, మన కొరకై తన ప్రాణములను సమర్పించెను” (ఫిలిప్పీ. 5:2). యేసు మరణము ద్వారా, దేవుని ప్రేమకూడా వ్యక్తమగుచున్నది, “నీతి మంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశ, సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో! కాని మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై మరణించెనుగదా! ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు” (రోమీ. 5:7-8). “ఆయన తన స్వంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా?” (రోమీ. 8:32).

సిలువ ఆరాధన: ఈనాడు సిలువను ఆరాధిస్తున్నాము. ప్రతిమలో సిలువపై ఉన్న క్రీస్తు రూపము కొంతవరకు అందముగా ఉంటుంది. కాని, వాస్తవానికి ఇది అతీతం. ఈనాడు సిలువను ఆరాధించ గలగడానికి గల కారణం, అవమానానికి ప్రతీక అయిన సిలువ, క్రీస్తు సిలువపై మరణముతో మహిమకి సాధనముగా, జీవమునకు చిహ్నముగా మారియున్నది.

ఈ రోజు శ్రీసభ అనగా మనమందరం కలువరి కొండపై క్రీస్తు సిలువ వైపు చూస్తూ ఉన్నాము. ప్రతి శ్రీసభ సభ్యుడు, సభ్యురాలు, సిలువ మ్రానుద్వారా క్రీస్తు సాధించిన రక్షణ గూర్చి ధ్యానించును. మోకరిల్లి సిలువను ముద్దిడి ఆరాధించడము ద్వారా, సిలువ ద్వారా క్రీస్తు అందించిన రక్షణకుగాను కృతజ్ఞులమై ఉంటున్నాము. క్రీస్తును ఆరాధిస్తున్నాము, “క్రీస్తువా! మిమ్ము ఆరాధించి, మీకు స్తోత్రములు అర్పిస్తున్నాము. ఎందుకన, మీ సిలువచేత, ఈ లోకమును రక్షించితిరే.” సిలువ ఆరాధన ఎందుకనగా, సిలువ దేవుడైన క్రీస్తుకు ప్రత్యేకమైన గురుతుగా ఉన్నది. క్రైస్తవ జీవితములో కూడా సిలువకు, సిలువ గురుతుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.

దైవకార్య సాధనలో సిలువ మరణం: యేసు ఎందుకు మరణించ వలసి వచ్చినది? ఏ కారణం మరణానికి దారితీసింది? ఆయన దేవునితో మానవ సంబంధాన్ని పునరుద్ధరించడానికి వచ్చాడు. లోకమును నీతి న్యాయం, సోదరభావముతో కూడిన జీవితాన్ని స్థాపించడానికి వచ్చాడు. లోకమును రక్షించాలని వచ్చాడు. దేవుని ప్రేమను, కరుణను, శాంతిని బోధించాలని వచ్చాడు. ఈ కార్యసాధనలో ఆయన సిలువమరణాన్ని పొందాల్సి వచ్చినది.

క్రీస్తు శ్రమలు దైవచిత్తమేనా?: “నేను పరలోకము నుండి దిగివచ్చినది, నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటకేకాని, నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక, అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతీవాడు నిత్యజీవితమును పొందుటయే నన్ను పంపినవాని చిత్తము” (యోహాను 6:38-40). పతనమైన మానవున్ని ఔన్నత్యమునకు చేర్చుటయే దేవుని చిత్తం. దేవుడు ఆశించేది మానవుని సంరక్షణ, సౌభాగ్యమే కాని రక్తపాతము కాదు, వినాశనము కాదు. క్రీస్తు మానవునికి విముక్తిని, పాపక్షమాపణను, నూతన జీవాన్ని, మరణానంతరం శాశ్వత జీవాన్ని ప్రసాదించడానికి వచ్చియున్నారు.

లోతుగా ధ్యానించినట్లయితే, యేసు పొందిన శ్రమలన్ని, దైవ నిర్ణయమని అర్ధమగుచున్నది. ఆయన గుడ్డిగా శ్రమలను పొందలేదు. దానిలో దైవచిత్తం ఉంది. మనలను రక్షించాలనే ప్రేమభావం ఉంది. యేసు సిలువపై, “సమాప్తమైనది” (యోహాను 19:30) అని పలికాడు. గ్రీకు పదానికి “పూర్తిగా చెల్లించబడినది” అని అర్ధం. అనగా, క్రీస్తు తన శ్రమలు, మరణము ద్వారా పాపాన్ని, పూర్తిగా నిర్మూలించాడు. పాపము అనే మన అప్పును క్రీస్తు పూర్తిగా చెల్లించాడు. శ్రమలు, సిలువ, ముళ్ళకిరీటం అన్నీ కూడా ఈ లోకములో ఇమడ గలవు, లేనిచో వాటిని ప్రభువు అంగీకరించేవాడు కాదు. మరో మాటలో చెప్పాలంటే, పవిత్ర శుక్రవారము లేనిదే ఈస్టర్‌ ఆదివారము లేదు. మనం ఈ లోకమున మరణించినట్లయితేనే, దైవరాజ్యమున జీవించగలం. ముళ్ళకిరీటం ఉన్నచోటనే, దేవుని మహిమ ఉంటుంది. క్రీస్తుతో మరణించినప్పుడే, ఆయనతో ఉత్థానమవుతాం. ఇదే దేవుని చిత్తం.

క్రీస్తు సిలువపై, “దాహమగుచున్నది” (యోహాను 19:28) అని పలికాడు. క్రీస్తు దాహము మన రక్షణము. ఆయన దాహము దైవచిత్త పరిపూర్ణము. ఆయన దాహం మనపై సంపూర్ణ ప్రేమ (యోహాను 4:10-14, 6:54-56). ఈనాడు సిలువ చెంత ఉన్న మనం, సిలువపై ఉన్న క్రీస్తు మన కోసం ఎంత దాహమును కలిగియున్నాడో గుర్తించుదాం. దివ్యపూజా బలిలో తన శరీర రక్తముల ద్వారా, క్రీస్తు మన దాహాన్ని తీరుస్తున్నారు. మనలను మనం ఆయనకు సంపూర్ణముగా అర్పించుకొందాం.

మన కర్తవ్యం?: సిలువద్వారా క్రీస్తు మనకోసం సాధించిన రక్షణకు మన సమాధానం ఏమిటి? క్రీస్తు కడరా భోజన స్మరణ ద్వారా ఆయన మరణమును మనము జ్ఞప్తియందు ఉంచుకొన వలయును (1కొరి.11:24-25, 1పేతు.3:18). యేసు చేసిన పోరాటాన్ని, ఆయన ప్రసాదించే శక్తితో, ఆయన శిష్యులమైన మనం కొనసాగించాలి. సంఘములోని అవినీతి, అన్యాయాన్ని, పేదరికాన్ని, బానిసత్వాన్ని, వ్యాధిబాధలను నిర్మూలించాలి. శాంతిని, ప్రేమను, నీతి న్యాయాలను, సోదరభావాన్ని స్థాపించాలి. ఇది మన కర్తవ్యం, ధర్మం. ఈ కర్తవ్యంకోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహాత్ములు ఎంతమందో ఉన్నారు. మనము కూడా అన్నీ ఓర్పుతో సహించుదాం. ఓకే సంఘముగా ప్రేమతో జీవించుదాం. పరస్పర క్షమాపణ కలిగి జీవించుదాం. అదియే శ్రీసభ. నేడు క్రైస్తవులు ఎంతోమంది వారి విశ్వాసాన్ని కోల్పోవుచున్నారు. నేడు మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. ప్రేమగా జీవించుట వలన సిలువలోని క్రీస్తు మనపై చూపించే ప్రేమకు ప్రతిస్పందించుదాం.

నేడు మనం అనుభవిస్తున్న బాధలను, శ్రమలను, ముఖ్యముగా కరోన వైరస్ ద్వారా మనం పొందిన నష్టాన్ని, కష్టాన్ని క్రీస్తు శ్రమలతో ఏకం చేద్దాం. ఈ విపత్తు సర్వ మానవాళిని ఏకం చేసినదని చెప్పవచ్చు. కనుక, అందరము కలసి ఏక కంఠముతో దేవునికి మొరపెట్టుకుందాం. ఆయన తప్పక మన మొర ఆలకించును. ఇశ్రాయేలు ప్రజలు విష సర్పముల కాటుకు మరణించు చుండగా, కంచు సర్పమును ఎత్తమని, దానిని చూచిన వారందరు మరణించరు అనిదేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. అలాగే “విశ్వసించు వారు నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడు ఎత్తబడవలెను” (యోహాను 3:15) అని స్వయంగా ప్రభువే నికోదేముతో చెప్పడం జరిగింది. నేడు మనం కరోన వైరస్ అను విష సర్పముతో కాటు వేయబడినాము. సిలువలో ఎత్తబడిన క్రీస్తువైపుకు నేడు మనం చూడాలి. సర్వ మానవాళి తరుపున ఆయనను ఆరాధించుదాం. విశ్వాసముతో ఆయనను చూచువారు బ్రతికెదరు. ఒకవేళ ఆ వ్యక్తి మరణించినను నిత్యజీవము పొందును.

“మరణించిన మూడవ రోజున నేను పునరుత్థానుడగుదును” (మార్కు 9:31) అని యేసు ప్రవచించాడు. మనము కూడా క్రీస్తుతో సజీవులముగా లేపబడాలంటే, ఆయనను సంపూర్ణముగా విశ్వసించాలి...

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN