నేటి పునీతులు: పునీత జాన్ క్లయిమాకస్ (క్రీ.శ.525-605)

ఫాదర్ ఆకుల ప్రసాద్
29 Mar 2026
సుగుణం: 'జ్ఞాన తపస్వి'
పుట్టుకతో సిరియాదేశస్థులైన జాన్ గారు తోలా అడవిలోని సినాయి పర్వతం దిగువన ఉన్న ఒక గుహలో తపోజీవితాన్ని కొనసాగించిన ఋషి. మంచి విద్యావేత్త, గొప్ప పండితులైన వీరు క్రీస్తునందు ధన్యతనొందిన పునీతుల జీవితాల్ని అధ్యయనం చేసేవారు. వీరు 75సం!ల ప్రాయమప్పుడు, సినాయి పర్వతం వద్ద వివిధ గుహలలో నివశించే మునులందరూ కలసి ఒక మఠంగా ఏర్పడి జాన్ గార్ని తమ అధిపతిగా ఎన్నుకున్నారు. సినాయి మఠాధిపతిగా జాన్ గారు ఎంతో నేర్పుతో పాలన చేశారు. అప్పటి పోపుగారైన పునీత గ్రెగోరి ది గ్రేట్ గారు జాన్ గారి జ్ఞానాన్ని, పవిత్ర జీవితాన్ని గురించి తెలుసుకొని సీనాయి పర్వత సందర్శనకై వచ్చు యాత్రికుల నివాసం మరియు ఆసుపత్రి నిర్మాణం కోసం కొంతధనాన్ని జాన్ గారికి పంపి, దానిని స్వీకరించి తమకోసం తమ ఆశయసిద్ధి కోసం ప్రార్థించమని విజ్ఞప్తిచేశారు. 4సం!రాలు సినాయి మఠాధిపతిగా సేవలందించిన పిమ్మట ఆ పదవికి రాజీనామా చేసి, మంచిమరణం పొందు ఉద్దేశంతో పూర్వం తాను సాగించిన ప్రార్థన, తపోజీవనం లోనికి వెళ్ళిపోయారు. పండితులైన వీరు పలుగ్రంధాలను వ్రాశారు. వాటిలో 'పరిపూర్ణత యొక్క పరాకాష్ఠ" అనే పుస్తకం చాలా గొప్పది. మఠవాసులు ఆధ్యాత్మికంగా సిద్దపడుటకుగాను 30 నిచ్చెనమెట్లు అని 30 అధ్యాయాల్ని జాన్ గారు క్రీస్తుప్రభువు బహిరంగ జీవితానికి ముందు గడిపిన 30సంల కనబడని జీవితంకు పోల్చి ఎంతో హృద్యంగా వ్రాశారు. వీరి రచనలన్నీ ఋషులు, సన్యాసులకోసం వ్రాయబడిన గొప్ప విశ్వాస సూచనలు. అద్భుతాల వ్యక్తియైన జాన్ గారు క్రీ.శ.605లో క్రీస్తునందు కన్నుమూశారు.
పునీత జాన్ క్లయిమాకస్ గారా మాకొరకు ప్రార్ధించండి!
