నేటి పునీతులు: పునీత లుడ్జెర్ (క్రీ.శ.744-809)

ఫాదర్ ఆకుల ప్రసాద్

25 Mar 2026

సుగుణం: “అవిశ్రాంత సువార్తా శ్రామికుడు"

నెదర్లాండ్ లోని ఉట్రెచ్ సమీపాన ఫ్రిజియను జాతీయులైన ఒక ధనిక కుటుంబంలో క్రీ.శ.744లో పునీత లుడ్జెర్ గారు జన్మించారు. ఉట్రెచ్ లో పునీత గ్రెగోరి గారు స్థాపించిన పాఠశాలనందు మరియు ఇంగ్లాండులోని యార్క్ నందు పునీత లుడ్జెర్ గారు విద్యను పొందారు. వీరికి పునీత అల్ క్వీన్ గారు ప్రాణమిత్రులు. క్రీ.శ. 777లో లుడ్జెర్ గారు గురువుగా అభిషక్తులై సువార్త సేవ నిమిత్తం ఫ్రీజ్ లాండ్ లోని తూర్పు ప్రాంతానికి పంపబడ్డారు. 7 సం!రాలు ఘనంగా క్రీస్తును ప్రకటించారు. క్రీ.శ.784లో విడుకైండ్ అనే దుష్టుడైన రాజు ప్రోత్సాహంతో శాక్సను సైనికులు దండెత్తివచ్చి దబ్బరదేవుళ్ళను తిరిగి ప్రతిష్ఠింపజేసి ప్రజలను మంత్రాలతో భయపెట్టి, క్రైస్తవ మిషనరీలను తరిమికొట్టారు.దేవాలయాలను తగులబెట్టి దైవప్రజలను భయభ్రాంతులను చేయగా వారు ప్రాణాలు గుప్పిట్లోపెట్టుకొని రహస్యంగా జీవించారు. అట్టి గడ్డు పరిస్థితులలో పునీత లుడ్జెర్ గారు ఇటలీకి వెళ్ళిపోయి అక్కడే 3 సం! రాలు దేవునిసేవలో గడిపారు. క్రీ.శ.787లో చార్లెమాగ్నే రాజు తనసైన్యంతో విడుకైండ్ పై యుద్ధం ప్రకటించి చిత్తుచిత్తుగా ఓడించి క్రైస్తవ మిషనరీలకు చేయూతనందించారు.పునీత లుడ్జెర్ గారు తిరిగి తన గురుమండలానికి చేరుకొని రెట్టింపు ఉత్సాహంతో క్రీస్తును ప్రకటించారు. క్రీస్తును వ్యతిరేఖించే శాక్సను ప్రజలు నివసించే పశ్చిమ ఫాలియాలో కూడా వీరు సత్యదేవుడైన క్రీస్తును వారికి చూపించగలిగారు. అంతేగాక తమ మఠ ఆశ్రమ ప్రధాన కేంద్రాన్ని మున్ స్టర్ నందు ఏర్పాటుచేసి పశ్చిమ ఫాలియా అపోస్తలునిగా పేరొందారు. మున్ స్టర్ నందలి బావినీటితో వీరు కొన్నివేలమందికి జ్ఞానస్నానాలిచ్చారు. వీరు లెక్కలేనంతమంది ఆన్యులను క్రీస్తులోనికి నడిపించారు. క్రీ.శ.804లో జర్మనీలోని మున్ స్టర్ పీఠానికి తొలి బిషప్పుగా అభిషేకించబడి ప్రభుగొర్రెల కాపరిగా విజయులయ్యారు. క్రీ.శ.809లో పునీత లుడ్జెర్ గారు పరలోకప్రాప్తినొందారు.

బంగారు మాట:
క్రీస్తు ఒక్కడే సత్య దేవుడు,
ఆయన తప్ప వేరే
దేవుడు లేడు.
పునీత లుడ్జెర్

TCBC CATECHETICS

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN