నేటి పునీతులు: పునీత కేథరిన్ ఆఫ్ స్వీడన్

ఫాదర్ ఆకుల ప్రసాద్
23 Mar 2026
సుగుణం: "పరిశుద్ధ అర్పణ జీవితం"
స్వీడను రాజైన ఉల్ఫ్ గుడ్ మార్శను మరియు పునీత బ్రిజిత దంపతులకు కలిగిన 8మంది సంతానంలో నాలుగవ వ్యక్తి పునీత కేథరిన్ గారు. వీరు రైజ్ బెర్గు నందలి కాన్వెంటులో విద్యనుపొంది తండ్రి మాటపై తన 14వ ఏట జర్మనీకి చెందిన భక్తిమంతుడైన ఎగ్గర్డు గారిని వివాహం చేసుకున్నారు.ఈ దంపతులిద్దరూ క్రీస్తునందలి విశ్వాసంతో, ఒకరినొకరి అంగీకారంతో బ్రహ్మచర్యవ్రతాన్ని స్వీకరించారు.కేథరిన్ గారు క్రీస్తుకు తనజీవితాన్ని సంపూర్ణంగా సమర్పిస్తూ మఠకన్యలాగా విశుద్ధ జీవితం జీవించారు.ఎగ్గర్డు గారు మరణించడంతో కేథరిన్ గారు ఇటలీలోని రోమునందున్న తన తల్లి బ్రిజితగారి వద్దకు వెళ్ళి ఆమెకు చేదోడువాదోడుగా ఉంటూ భక్తికార్యక్రమాల్లో పాల్గొంటూ,తన తల్లి ఒనరించే దానధర్మాలు,జపతపాలు,ఆధ్యాత్మిక కార్యాల్లో సేవలందిస్తూ తననుతాను వానినన్నింటిలో రాటుదేల్చుకున్నారు.తల్లిబిడ్డలిద్దరూ యెరుషలేమును సందర్శించిన తరువాత రోజుకు నాలుగు గంటలపాటు ప్రభు శ్రమలైన పద్నాలుగు స్థలాలను ధ్యానించేవారు. క్రీ.శ. 1373లో తన తల్లియైన బ్రిజిత గారు మరణించగా ఆమె దేహాన్ని కేథరిన్ గారు స్వీడన్ కు తెచ్చి తనతల్లి స్థాపించిన రక్షకుని సభ కాన్వెంటు ఆవరణంలో భూస్థాపితం చేశారు.అటుతరువాత రక్షకుని సభమఠశ్రేష్ఠురాలుగా బాధ్యతలు చేపట్టి 6వ అర్బను పోపుగారిచే రక్షకుని సభకు కడపటి గుర్తింపును తెచ్చి సమర్థవంతగా సభ విస్తరణకు, అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారు. క్రీ.శ.1381 మార్చి 24న కేథరిన్ గారు పరలోకప్రాప్తినొందారు.వీరు "ఆత్మ ఊరడింపులు” అనే పుస్తకాన్ని వ్రాశారు.కేథరిన్ గారు చేసిన సేవలను,జీవించిన ధన్యజీవితాన్ని గుర్తిస్తూ క్రీ.శ. 1484లో 8వ ఇన్నోసెంటు పోపుగారు ఆమెను పునీతురాలుగా ప్రకటించారు.కేథరిన్ అనగా పరిశుద్ద,పవిత్ర,నిర్మల అని అర్థం.
పునీత కేథరిన్ గారా మాకొరకు ప్రార్ధించండి!
బంగారు మాట:
నీవు వుండే రీతిలో ఉన్నట్లయితే
ఈ ప్రపంచంలో మార్పును
తెగలవు. సత్యాన్ని నీ
సొంతం చేసుకొని
అందరికి ఆమోదయోగ్యంగా
దానిని ప్రకటించు.
(పునీత కేథరిన్ ఆఫ్ స్వీడన్)
