నేటి పునీతులు: పునీత తొరిబియో దె మొగ్రోవెజో

ఫాదర్ ఆకుల ప్రసాద్

22 Mar 2026

సుగుణం: "వివక్ష నిర్మూలకుడు"

పునీత తొరిబియో గారు స్పెయిన్ లోని మయోర్గానందు క్రీ.శ.1538లో పుట్టారు.వీరు న్యాయశాస్త్రంలో ప్రావీణ్యతను పొంది సుప్రసిద్ద లాయరుగా పేర్గాంచారు. వీరు సలమంకా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు. క్రీ.శ.1575లో 2వ ఫిలిప్పు చక్రవర్తి తొరిబియో గారిని గ్రనడానగర ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. తాను లౌకిక బాధ్యతలు నిర్వహిస్తున్ననూ క్రీస్తు ఎడల భక్తివిశ్వాసాలను మాత్రం తోరిబియోగారు విడువలేదు. 3సం! రాల తర్వాత తన ఉద్యోగాలన్నిటిని విడిచిపెట్టి దైవ, మానవ సేవ నిమిత్తం ఒక క్రైస్తవ గురువుగా మారి అనతికాలంలోనే పెరులోని లిమా పీఠానికి ఆర్చిబిషప్పుగా క్రీ.శ.1581లో అభిషేకించబడ్డారు. ఏడాది గడవకమునుపే జాతి వివక్షచూపుతున్న లౌకిక పాలకులతో వీరు న్యాయపోరాటం చేయవలసివచ్చింది. పెరులోని రెడ్ ఇండియన్ల పట్ల తెల్లవాళ్ళు విపక్షచూపేవారు దానిని తోరిబియోగారు సహించలేదు. మానవులందరు దేవుని బిడ్డలైనప్పుడు వివక్ష ఎందుకని రెడ్ ఇండియన్ల హక్కులను కాపాడమని పాలకులతో తొరిబియో గారు పోరాటంచేశారు. 26సం!రాలు వీరు ఎనలేని సేవను చేశారు. పేదల సౌకర్యాలకోసం పోరాడారు. లెక్కలేనన్ని దేవాలయాలు,పాఠశాలలు,ఆసుపత్రులు కట్టించడమే గాక కష్టాలలో వున్న ప్రతిఒక్కరిని తప్పనిసరిగా దర్శించి ఆదుకునేవారు. మేత్రాసనంలోని ప్రతి ప్రాంతానికి కాలినడకన వెళ్ళి దివ్యసంస్కారాలను అందించారు. దాదాపు 50వేల మైళ్ళు వీరు నడిచివుంటారని అంచనా.పెరు దేశంలోని శాంతా పట్టాణాన్ని సందర్శించి లిమా పట్టణానికి తిరిగివచ్చు దారిలో క్రీ.శ.1606 మార్చి 23న పరమపదించారు. క్రీ.శ.1726లో 13వ బెనడిక్టు పోపుగారు వీరిని పునీతులుగా ప్రకటించారు.

పునీత తొరిబియో దె మొగ్రోవెజో గారా మాకొరకు ప్రార్ధించండి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN